mother language
-
Tamil Nadu: మాతృభాషలో ఇంజినీరింగ్ విద్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ విద్యలో తమిళ మీడియంను ప్రవేశపెట్టి పాఠ్యాంశాలను బోధించేందుకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతిచ్చింది. తమిళం సహా 8 మాతృభాషలో బోధనకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. జాతీయ విద్యావిధానంలోని కొన్ని అంశాలను పలువురు వ్యతిరేకించారు. అందులో మాతృభాషలో విద్యాబోధన జరగాలని కూడా ఉంది. మాతృభాషలో విద్యాబోధనను అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టడం ప్రారంభించింది. ఇంజినీరింగ్ విద్యను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో బోధించేందుకు కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఈ నేపథ్యంలో విధివిధానాల రూపకల్పన పనులను ఏఐసీటీఈ చేపట్టింది. మాతృభాషలో ఇంజినీరింగ్ విద్యా బోధన వల్ల గ్రామీణ, కొండప్రాంత హరిజన, గిరిజనుల కలలు నెరవేరుతాయని నమ్ముతున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, జపాన్, చైనా దేశాలు తమ మాతృభాషల్లోనే పూర్తిగా విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయి. అదే రీతిలో ఏఐసీటీఈ సైతం ఆంగ్ల భాషలోని పాఠాలను 22 భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తమైంది. తమిళనాడుకు సంబంధించి ఇంజినీరింగ్ విద్యను విద్యార్థులు ఇంగ్లిష్ లేదా తమిళంలో అభ్యసించడంపై ఏఐసీటీఈ అభిప్రాయ సేకరణ చేపట్టింది. అందులో 42 శాతం మంది మాతృభాష తమిళంలోనే బోధనకు మద్దతు పలికారు. ఈ కారణంగా తమిళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తెలుగు, గుజరాతీ, కన్నడం, మలయాళం. ఈ 8 భాషల్లో ఇంజినీరింగ్ పాఠాలను తర్జుమా చేసేందుకు ఏఐసీటీఈ నిర్ణయించుకుంది. దీని గురించి ఏఐసీటీఈ అధ్యక్షుడు అనిల్ సహస్రబుదే మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను మాతృభాషలో బోధించేందుకు పలు మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. మాతృభాషలో పాఠ్యాంశాల బోధన వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. తొలి దశలో 8 భాషల్లో సిలబస్‌ను తర్జుమా చేస్తున్నామని, గరిష్టంగా 142 పాఠ్యాంశాలు, తమిళంలో 94 పాఠ్యాంశాల సిలబస్‌ను తర్జుమా సాగుతోందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాతృభాషలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఏఐసీటీఈ అనుమతిచ్చిందన్నారు. తర్వాత మరో 11 భాషల్లోకి తర్జుమా చేస్తామని చెప్పారు. అన్నాయూనివర్సిటీ (చెన్నై) సహా అదే వర్సిటీకి చెందిన 12 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ తరగతులను 2010 నుంచి తమిళంలో నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. -
తానా ఆధ్వర్యంలో 'తల్లి భాష-తెలుగు మన శ్వాస'
వాషింగ్టన్ : ప్రతి బిడ్డ అమ్మ ఒడిలో నేర్చుకునే మొదటి భాష..మాతృభాష. ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే అప్రయత్నంగా, సహజంగానే మాతృభాష అబ్బుతుంది. మనుగడ కోసం వేరే భాషలను నేర్చుకున్నా మాతృభాషను మాత్రం మరవద్దు. మాతృభాష పరిరక్షణ సంకల్పంతో, యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ ఆదివారం ఫిబ్రవరి 21, 2021 నాడు తల్లి భాష-తెలుగు మన శ్వాస అనే సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆన్లైన్ ద్వారా పాల్గొననున్నట్లు తానా అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి, తాసా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్మనీ లోని ఎస్. ఆర్. హెచ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డా. తొట్టెంపూడి శ్రీ గణేష్“జర్మనీ దేశం మాతృభాషకు ఇచ్చే ప్రాధాన్యత - అన్య సాహిత్యానువాద కృషి” అనే అంశంపై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు నేల, తెలుగు భాష ప్రాముఖ్యతలపై గాయనీ గాయకులు పాల్గొని పాటలు, పద్యాలు ఆలపిస్తారని నిర్వాహకులు తెలిపారు. -
అప్పుడే తల్లి భాషను రక్షించుకోగలం : ఉపరాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్ : విద్యారంగంతోపాటు పరిపాలన, న్యాయ, పరిశోధన తదితర రంగాల్లో మాతృభాష వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం, కొత్త పదాల సృష్టి జరిగినపుడే తల్లిభాషను పరిరక్షించుకోగలమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం, తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష’ఇతివృత్తంతో జరిగిన వెబినార్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన సంస్కృతి-సంప్రదాయాలకు మన అస్తిత్వానికి మాతృభాషే పట్టుకొమ్మ. మాతృభాషతోపాటు ఇతర భాషలు ఎన్నయినా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి కూడా. ఎన్ని భాషలు ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ మంచిది. అందులో తప్పేమీ లేదు. కానీ.. ఆంగ్లభాషలో విద్యాభ్యాసం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం సరికాదు. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేల ఫలితాలను గమనిస్తే ఈ విషయం మనకు బాగా అవగతమవుతుంది’అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.‘అన్ని భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’అన్న కాళోజీ నారాయణరావుగారి మాటను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. 2017 వరకు నోబెల్ బహుమతి (శాంతి బహుమతి మినహా) పొందినవారిలో 90 శాతానికి పైగా మాతృభాషలో విద్యనభ్యసించే దేశాల వారేనని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వివిధ దేశాల ఆవిష్కరణల సామర్థ్యాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించి ఏటా నివేదిక ఇచ్చే ‘గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్’, ‘బ్లూమ్‌బర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్’ జాబితాల్లోనూ ఉన్నతస్థానాల్లో ఉన్న దేశాల్లో 90 శాతానికి పైగా మాతృభాష మాధ్యమం ద్వారానే చదువుకుంటాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రసార, ప్రచార మాధ్యమాలు కూడా మాతృభాషకు వీలైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. పాత పదాలను పునర్వినియోగంలోకి తీసుకురావడంతోపాటు కొత్త పదాలను సృష్టించడంపై దృష్టిపెట్టాలన్నారు. ఇందుకోసం కాశీనాథుని నాగేశ్వరరావు.. నైట్రోజన్‌ను నత్రజని అని, ఆక్సీజన్‌ను ప్రాణవాయువని, ఫొటో సింథసిస్‌ను కిరణజన్య సంయోగక్రియ అనే అద్భుతమైన పదాలను సృష్టించి తెలుగు ప్రజలకు పరిచయం చేశారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయోగాల ద్వారానే భాషతోపాటు పత్రికల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం కచ్చితంగా మాతృభాషలోనే జరగడం, ఉన్నత విద్యలో తెలుగు తప్పనిసరిగా ఒక విషయంగా ఉండటం వల్ల విద్యార్థుల్లో మాతృభాషపై ఆసక్తిని, వివిధ విషయాల గ్రహణశక్తిని పెంపొందింపజేయవచ్చన్నారు. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విజ్ఞానశాస్త్రాన్ని (సైన్స్) మాతృభాషలో బోధించడం వల్ల చిన్నారుల్లో సృజనాత్మకత పెరుగుతుందని చెప్పిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఇస్రో చంద్రయాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న మేల్‌స్వామి అన్నాదురై కూడా.. తన మాతృభాష తమిళంలో ఇంటర్మీడియట్ వరకు చదివినందునే.. విజ్ఞానశాస్త్రం, సాంకేతిక అంశాలపైన లోతైన అవగాహన పెంచుకోవడం సాధ్యమైందన్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు.. ‘జ్ఞాన సముపార్జనకు మాతృభాష ఎంతటి గొప్ప మాధ్యమమో’వివరిస్తాయన్నారు. భావాన్ని వ్యక్తపరిచేందుకు భాష అవసరమని.. అందులోనూ మాతృభాషలోనైతే భావాన్ని మరింత స్పష్టంగా వ్యక్తపరచగలమన్నారు. వివిధ దేశాధినేతలు మన దేశానికి వచ్చినపుడు.. ఆంగ్ల భాషలో పరిజ్ఞానం ఉన్నప్పటికీ వారి మాతృభాషలోనే సంభాషిస్తారని.. పక్కనున్న అనువాదకులు దీన్ని అనువాదం చేస్తారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా విదేశాల్లోనూ హిందీలోనే సంభాషిస్తారని.. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన నేతల్లో ఒకరిగా నిలిచారని ప్రస్తావించారు. మాతృభాషకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమన్నారు. ‘జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష’ఇతివృత్తంతో అంతర్జాతీయ అంతర్జాల వెబినార్ నిర్వహించిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ, తెలుగు అకాడమీలను ఉపరాష్ట్రపతి అభినందించారు. భాషాభివృద్ధికి, కొత్త పదాల సృష్టికి వర్సిటీలు వేదికగా నిలిచి మిగిలిన వారిని ప్రోత్సహించాలని సూచించారు. ‘మాతృభాషకు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును సమన్వయం చేస్తూ.. మనల్ని విశ్వవ్యాప్తంగా నడిపించిన, నడిపిస్తున్న మాతృభాష తీరుతెన్నులను క్రోడీకరిస్తూ ప్రపంచప్రఖ్యాతి వహించగలిగిన పదసంపద, వ్యాకరణాంశాలు, వాక్యవిన్యాసం, ప్రత్యేక పదజాలం పుష్కలంగా సమృద్ధిగా ఉన్న రోజున మాతృభాషలు సాంకేతికతకు, విజ్ఞానానికి మరింత దగ్గరవుతాయి. రోజురోజుకు అంతరిస్తున్న పదాలను వెతికి పట్టుకుని సంభాషణల్లో, వ్యాసంగంలో, పాఠ్య గ్రంథాల్లలో వాటిని చేర్చి భాషను జాగృతపరచండి. ప్రతి పదం వెనుక మన సంస్కృతి ఉంటుంది. దాన్ని గుర్తించేలా విద్యార్థుల్ని తయారుచేయండి’అని ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య పొదిలి అప్పారావు, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, విశ్వవిద్యాలయ తెలుగు విభాగం అధిపతి ఆచార్య అరుణ కుమారి, శాంతా బయోటెక్ ఫార్మా కంపెనీ చైర్మన్, తెలుగు భాషాభిమాని కేఎల్ వరప్రసాద్ రెడ్డి, తెలుగు అకాడమీ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు, ఈ సదస్సు నిర్వాహకురాలు ఆచార్య డి.విజయలక్ష్మితోపాటు విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు, తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న భాషాకోవిదులు, విషయ నిపుణులు, భాషాభిమానులు పాల్గొన్నారు. -
తారక రాముడి మానస పుత్రిక..
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు భాషకు వెలుగునివ్వాల్సిన మన ‘తెలుగు విశ్వవిద్యాలయం’ మాతృభాషా పరిరక్షణ విషయంలో ఘోరంగా విఫలమవుతున్నది. ఒకప్పుడు తెలుగు కళాకారులకు ఓ కాణాచీగా కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు భూతలస్వర్గంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూగబోయింది. భాషావికాసం కోసం పాటుపడటం సంగతేమో గానీ, తెలుగుపై ఆసక్తితో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కనీస పాఠాలు బోధించలేని దుస్థితి నెలకొంది. నేడు అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంపై ప్రత్యేకకథనం ! తారక రాముడి మానస పుత్రిక.. తెలుగు భాష, సాహిత్యాలు, సంస్కతి కళలు, జానపద విజ్ఞానం, చరిత్ర తదితర రంగాల్లో సమగ్ర వికాసాన్ని సాధించడం కోసం నాటి ముఖ్య మంత్రి ఎన్టీఆర్ 1985 డిసెంబర్ 2న ఈ వర్సిటీని ప్రారంభించారు. తొలినాళ్లలో ఆయనే దీనికి ఛాన్స్లర్ వ్యవహరించారు. గవర్నర్‌ను ఛాన్సలర్‌గా నియమిస్తేనే గుర్తిస్తామని యూజీసీ పేచీ పెట్టడంతో ఆయన వీసీ పదవి నుంచి వైదొలగారు. నాటి నుంచి రాష్ట్ర గవర్నరే దీనికి వీసీగా వ్యవహరిస్తున్నారు. వర్సిటీలో ఎంఏ తెలుగు, జర్నలిజం, చిత్రం, సంగీతం, రంగస్థల కళలు వంటి కోర్సులను అందిస్తుంది. తెలుగు భాషా వికాసం, పరిరక్షణ కోసం ఏర్పాటైన తెలుగు యూనివర్సిటీలో తెలుగు విభాగాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎంఏ తెలుగు విభాగంలో ఫస్ట్, సెకండ్ ఇయర్ కోర్సులను అందిస్తుంది. మొత్తం 60 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. వీరికి పాఠాంశ్యాలు బోధించేందుకు యూజీసీ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్ సహా ఇద్దరు రీడర్లు, ముగ్గురు లెక్చరర్స్ అవసరం కానీ ప్రస్తుతం వర్సిటీ తెలుగు శాఖలో ఒక రెగ్యులర్ ఉపాధ్యాయురాలు సహా మరో ముగ్గురు పదవీ విరమణ చేసిన (విజిటింగ్ ఫ్యాకల్టీ) ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్క తెలుగు విభాగంలోనే కాదు దాదాపు అన్ని విభాగాలది ఇదే పరిస్థితి. ఏటా పదవీ విరమణలు చేస్తున్నవారి సంఖ్య పెరుగుతుండటం, ఆ మేరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయకపోవడం, పాలకమండలి ఏర్పాటు చేయకపోవడం, దాదాపు రెండేళ్ల నుంచి వీసీ పోస్టు ఖాళీగా ఉండటం వల్ల వర్సిటీలో అభివృద్ధి కుంటుబడిపోతుంది. వర్సిటీలో అంతర్జాతీయ తెలుగు భాషాభివృద్ధి కేంద్రం ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించక పోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోయింది. విదేశాల్లో తెలుగు వెలుగుకు తప్పని కష్టాలు.. తెలుగు రాయడం, మాట్లాడటం రాని దేశాల్లో ఆ భాషను నేర్పించేందుకు వర్సిటీ వేదికగా అంతర్జాతీయ తెలుగు భాషా వికాసం కేంద్రం ఏర్పాటైంది. భాషా విస్తరణలో భాగంగా దేశంలోని తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, చత్తీస్గడ్, అస్సాం, న్యూఢిల్లీ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు సహా పలు విదేశీ విశ్వవిద్యాలయాల్లోనూ భాషా పీఠాలను ఏర్పాటు చేసింది. ఆయా విశ్వవిద్యాలయాలతో అవగాహాన ఒప్పందాన్ని కుదుర్చుకుని అక్కడి వారికి శిక్షణ ఇస్తోంది. దీనిలో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియా, ఇజ్రాయిల్‌లోని హిబ్రు విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పీఠాలను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా తెలుగును నేర్చుకోవాలనే విదేశీ ఔత్సాహికులను గుర్తించి సంవత్సరానికి ఐదుగురు చొప్పున నగరానికి రప్పించి తెలుగును నేర్పిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నట్టు అంచనా. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది ఉండగా, ఇతర రాష్ట్రాల్లో 4 కోట్లు, విదేశాల్లో మరో 4 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. భాషా పరిరక్షణ కోసమే కాకుండా అంతర్జాతీయంగా తెలుగు భాషా వ్యాప్తికి తన వంతు కృషి చేసింది. అంతేకాదు తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలంటూ చేపట్టిన ఉద్యమానికి తెలుగు విశ్వవిద్యాలయం వేదికైంది. భాషా వికాసం కోసమే కాకుండా తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడంలో వర్శిటీ కీలక పాత్రపోషించింది. ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యానికి ఆశించిన స్థాయిలో సేవలను అందించలేక పోతుంది. వెనుకబడి పోతున్నాం ఇంగ్టిషు భాష మోజులో పడిపోయి మాతృభాషను విస్మరిస్తున్నాం. మాతృభాషను మరిచిపోవడం అంటే కన్నతల్లిని కాదనుకోవడం వంటిదే. మాట్లాడటం, రాయడంలో ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలుగు ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరింది. మాతృభాషను ప్రాథమిక మాధ్యమం వరకు విధిగా అమలు చేస్తేనే భాష బతుకుతుంది. లేదంటే పూర్తిగా కనుమరుగవడం ఖాయం. – ఆచార్య గౌరీశంకర్, తెలుగుశాఖ రిటైర్డ్ ప్రొఫెసర్ -
రాష్ట్రాల మధ్య భాషా సమస్యలు
మన దేశంలోని అన్ని వ్యవస్థలు ఇంగ్లిష్ భాషని ఎక్కువగా ఉపయోగిస్తు న్నాయి. ఒక వ్యక్తి చాలా భాషలు నేర్చుకున్నప్పటికీ తన మాతృ భాషకి ఉన్న ప్రాముఖ్యం ప్రత్యేకమైనది. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజల భాషని అధికార భాషగా అమలు చేసుకునే సౌకర్యాన్ని మన రాజ్యాంగం కల్పించింది. అందుకని తెలుగుని అధికార భాషగా ఉమ్మడి రాష్ట్రం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రం కూడా గుర్తించింది. ప్రభుత్వ, న్యాయపాలనలో తెలుగుని ఎక్కువగా వాడటంవల్ల పాలన ప్రజలకి చేరువవు తుంది. తెలుగులో తీర్పులతో బాటూ, తెలుగులో న్యాయ శాస్త్రానికి సంబంధించి ఓ యాభై పుస్తకాలు రాశాను. తెలుగులో న్యాయపాలన దిశగా అవసర మైనంత కృషి జరగడంలేదని గొంతు చించుకున్న వ్యక్తుల్లో నేనూ ఉన్నాను. కింది కోర్టుల్లో మాతృ భాషలో న్యాయపాలన జరగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తీర్పులని పై కోర్టుల్లో సవాలు చేసినప్పుడు వాటికి ఇంగ్లిష్ అను వాదం పంపించాల్సిన అవసరం ఉంది. మరో రకంగా చెప్పాలంటే మనకి కూడా ఓ దేశ భాష అవసరం అయిపోయింది. ఆ స్థానాన్ని హిందీ భాష కాకుండా ఇంగ్లిష్ ఆక్రమించింది. హైకోర్టుల్లో సుప్రీం కోర్టుల్లో వివిధ భాషలకి చెందిన న్యాయమూర్తులు ఉంటారు. అందుకని దేశ భాష అవసరం అయి పోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో న్యాయపాలన, ప్రభుత్వ పాలన ఇంగ్లిష్‌లోనే ఎక్కువగా జరుగు తుంది. హిందీ రాష్ట్రాల్లో, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వ పాలన, న్యాయ పాలన వాళ్ల భాషల్లో జరుగుతుంది. చాలా మంచి పరిణామం. అయితే నేర న్యాయ వ్యవస్థ పాలన వాళ్ల భాషలోనే జరగడంవల్ల కొన్ని చిక్కులు ఉన్నాయి. భీమా, కోరేగావ్ కేసులో చాలామంది వ్యక్తులని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మన రాష్ట్రం లోనూ ఆ కేసుకి సంబంధించి ప్రముఖ కవి వరవర రావుని పోలీసులు అరెస్టు చేసి టాన్సిట్ వారంట్ కోసం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజ రుపరిచారు. ఆ తరువాత ఆయన్ని పుణేలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. అప్పటికి సుప్రీంకోర్టు వాళ్లని గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఆయనని మళ్లీ హైదరాబాద్ తీసుకునివచ్చి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ అరెస్టుకి భాషకి సంబం ధం ఉంది. వీవీని అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పుడు, వాళ్లు హైదరాబాద్ కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ మరాఠీలో ఉన్నాయి. ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతనికి రిమాండ్ రిపోర్టుని ఇవ్వాలి. అది ఇతర భాషల్లో ఉంటే దాని ఇంగ్లిష్ అనువాదాన్ని ఇవ్వాలి. ఈ కేసులో మేజిస్ట్రేట్‌కి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ మరాఠీలోనే ఉన్నాయి. ఆ మెజిస్ట్రేట్‌కి మరాఠీ రాదు. వాటి తర్జుమాని నాకు ఫలానా వాళ్లు చేశారన్న నోట్ కూడా మేజిస్ట్రేట్ చేయ లేదు. కానీ వీవీని రిమాండ్ చేసి çపుణే కోర్టులో హాజరుపరచమని ఆదేశాలు జారీ చేశారు. ఎవరినైనా రిమాండ్ చేసే ముందు అతనిపైన ఆరోపించిన నేరా లకి గట్టి ఆధారాలు ఉన్నాయా లేదా అని మేజిస్ట్రేట్ చూడాలి. ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడే రిమాం డ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్సిట్ రిమాండ్‌కి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ విధంగా చేయనప్పుడు ఆ రిమాండ్ చట్ట వ్యతిరేకమవుతుంది. ఈ విషయంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకోకపోవడం, ఇతర భాషల్లో డాక్యుమెంట్స్ ఉండి, ఆ భాష ఆ మేజి స్ట్రేట్కి తెలియనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని కూడా హైకోర్టు నిర్దేశించకపోవడం బాధ కలిగించే అంశం. ఇదే కేసులో గౌతమ్ నవలఖాని కూడా పోలీ సులు ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ ట్రాన్సిట్ రిమాండ్‌ని రద్దు చేసింది. ప్రజల భాషలో న్యాయపాలన జరగడం అత్యంత అవశ్యం. అయితే పై కోర్టులకి కేసు వెళ్లిన ప్పుడు అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో అరెస్టులు చేసి నప్పుడు అవసరమైన చర్యలని పోలీసులు, ఇతర అధికారులు తీసుకోవా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భీమా, కోరేగావ్ కేసులో భాషవల్ల ఉత్పన్న మైన సమస్యవల్ల ప్రజల భాషలో పరిపాలన అవసరం లేదు. దేశీ భాష ఇంగ్లిష్‌లో జరగాలని అనడం సమంజసమా? న్యాయస్థానాల్లో వాదోపవాదాలు, కార్యకలా పాలు, తీర్పులు ప్రజల భాషలో కాకుండా, వారికి అర్థంకాని భాషలో జరిగినప్పుడు ఆ వ్యవస్థపట్ల వారికి నమ్మకం సడలిపోతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నప్పుడు, అరెస్టులు చేస్తున్న ప్పుడు అక్కడి ప్రజల భాషలో లేదా దేశ భాషలో జరగాలి. అలా జరగనప్పుడు న్యాయవ్యవస్థ మీద, దర్యాప్తు సంస్థలమీద విశ్వాసం ఉంటే అవకాశం లేదు. భాష మన అస్తిత్వానికి చిహ్నం. భాషవల్ల ఉత్పన్నమయ్యే సమస్యలని అధిగమించాలి తప్ప, ప్రజల భాషలో న్యాయపాలన జరగకూడదనీ అను కోవడం సమంజసం కాదు. (నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం) వ్యాసకర్త : మంగారి రాజేందర్ (గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు) మొబైల్ : 94404 83001 -
అమ్మ భాషను ఆశీర్వదిద్దాం
ఒక భాష ఏ అవసరాలు తీర్చాలి? పాలక భాషలో అన్నీ ఉన్నాయి, అవి నేర్చుకుంటే చాలు అనే అభిప్రాయం అశాస్త్రీయం. ఆ ఆలోచన అపరిపక్వతకు నిదర్శనం. భాష ప్రధానంగా ఈ క్రింది అవసరాలను తీర్చాలి: 1. ఉపాధి, ఉద్యోగ అవసరాలు 2. విద్యాబోధనా మాధ్యమం 3. పాలనా మాధ్యమం 4. పత్రికలూ, రేడియోలూ, టీవీలూ, సెల్లులూ, అంతర్జాలమూ 5. వినోదం, సినిమా, నృత్యం, నాటకాలు 6. ప్రజల దైనందిన వాడకంలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ⇒పరభాష మాతృభాషా స్థానాన్ని ఆక్రమిస్తోంది. ⇒తల్లిదండ్రులు ఇంట్లో ఇంగ్లి్లషు మాట్లాడుతూ బడి భాషా ఇంగ్లి్లషు అయినప్పుడు జరిగేది ఇదే. ప్రస్తుతం ఇది తక్కువ శాతంగా ఉన్నా రానురాను పెరిగి మన మాతృభాషలు పూర్తిగా మృతభాషలు అయ్యే ప్రమాదం ఉంది. ఈ సంధికాలంలో సమాజం సంక్షోభంలో కూరుకుపోతుంది. ⇒మార్కెట్లు పూర్తిగా ఇంగ్లిషువాళ్ల పరమైపోతాయి. మనది అంటూ సొంతది ఏమీ మిగలదు. మనం దేన్నీ శాసించే స్థాయిలో ఉండం. ఇంగ్లిషే నిర్ణయాత్మకం అవుతుంది. ⇒అందరికీ ఇంగ్లిషు రావడానికి 60 నుంచి 100 ఏళ్లు పడుతుంది. ఈ లోగా ఇంగ్లిషు వచ్చినవాళ్లూ రానివాళ్లూ అంటూ దేశం రెండుగా చీలిపోతుంది. ⇒మన దేశం మళ్లీ ఇంగ్లిషు వలస దేశంగా మారుతుంది. ⇒పిల్లలు బడికి వెళ్లినప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లినట్లుగా ఉంటుంది. వాళ్లు వాళ్ల తల్లిదండ్రులను, వాళ్ల తోటలను, వాళ్ల రోజువారి జీవన విధానాన్ని వదిలి వెళ్తారు. తరగతి గదిలో కూర్చుని వాళ్ల రోజువారీ జీవనానికి సంబంధంలేని కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త విషయాలను మాత్రమే నేర్చుకున్నందువల్ల పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. వాళ్లు సొంత విషయాలను తిరస్కరిస్తారు. ఏం జరగాలి? ⇒తెలుగు మాధ్యమానికి ప్రోత్సాహం తప్పనిసరి. ⇒తెలుగు మాధ్యమంలో చదివిన వారికి కొంత శాతం ఉద్యోగాలు కేటాయించాలి. ⇒రాష్ట్రంలో ఉద్యోగం కావాలనుకునే వారందరూ తప్పక తెలుగు నేర్చుకోవాలి. ⇒రాష్ట్రంలో, దేశంలో అన్ని పరీక్షల్లో తెలుగులో రాసే అవకాశం కల్పించాలి. ⇒తెలుగు వాళ్లకు సంబంధించిన సకల వ్యవహారాలు తెలుగులోనే సాగాలి. ⇒అన్ని విశ్వవిద్యాలయాలలో వ్యవహారాలు తెలుగులోనే జరగాలి. తెలుగు తెలియని వారితో మాత్రమే ఆంగ్లంలో వ్యవహరించాలి. ⇒అందుకు తగిన పుస్తకాలు, శిక్షణ, కంప్యూటర్ అవగాహన కలిగించటం ప్రభుత్వ బాధ్యత. ⇒ప్రపంచంలో ఎవరైనా తెలుగు నేర్చుకోవటానికి ఆన్లైన్ శిక్షణను ప్రారంభించాలి. ⇒ప్రపంచ భాషగా గౌరవప్రదమైన స్థానం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఎలా జరగాలి? ⇒తెలుగు భాషాపరిరక్షణ 2019 ఎన్నికల్లో ఒక ప్రధాన అంశం కావాలంటే అందుకు మనం చేయవలసిన ప్రయత్నాలు ఏమిటి? ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్లాలి అనే విషయాలపై సరైన ఆలోచనలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని ఉద్యమ నినాదాలతో మాత్రమే ఇది ముందుకు వెళ్లదు. 2019 ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగు భాషాపరిరక్షణ పొందుపరిచేలా చూడాలి. ⇒ముందుగా అసలు తెలుగు భాషాపరిరక్షణ అంటే మన ఉద్దేశమేంటో తెలియజెయ్యాలి. తెలుగు భాష ఏ స్థాయి వరకు మాధ్యమ భాషగా ఉండాలనుకుంటున్నాం? పరిపాలనా భాషగా ఏఏ రంగాల్లో అమలు పరచాలనుకుంటున్నాం వంటి విషయాలపై ముందు మనం ఒక అవగాహనకు రావాలి. ⇒ఉన్నత చదువులు చదువుకొని పట్టణాల్లో నివసిస్తున్న వారికే మాతృభాష మాధ్యమంపై సరైన అవగాహన లేదు. ఎంత చెప్పినా వీళ్లు అంత త్వరగా మారకపోవచ్చు. వీళ్ల శాతం కూడా తక్కువ. అందువల్ల ముందుగా గ్రామీణ ప్రజలకు మాతృభాషా మాధ్యమం వల్ల లాభాలను తెలియజెయ్యాలి. ⇒మాతృభాషా మాధ్యమం వల్ల, పరిపాలన భాషగా అమలు పరచడం వల్ల ఒనగూరే లాభాల గురించి ఒక నమూనా పత్రాన్ని రూపొందించాలి. నమూనా పత్రంలో ఏముండాలి? ⇒తల్లిదండ్రులకూ పిల్లలకూ ఇంగ్లిష్ భాషపై ఉన్న కృత్రిమ గౌరవాన్ని, వ్యామోహాన్ని తొలగించి, మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించే అంశం. ⇒మాతృభాషా మాధ్యమంలో చదువుకున్న పిల్లలకూ ఉద్యోగాల్లో వెయిటేజీ కల్పించడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవచ్చు అన్న విషయం. ⇒మాతృభాషలో విద్యాభ్యాసం ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ భాషలను కూడా దశలవారీగా నేర్పడం జరుగుతుందన్న విషయం. ⇒ఇంగ్లిష్ మాధ్యమం వల్ల పిల్లల్లో ఏ భాషా సరిగ్గా ఎదగదు అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం. ⇒మాతృభాషల్లో చదువుకొని ఉన్నత పదవుల్లో ఉన్న వారి దృష్టాంతాలను చూపించడం. ⇒పరభాషా, మాతృభాషా మాధ్యమాలపై, ముఖ్యంగా రమీరె, థామస్ అండ్ కాలియర్, జార్జి మాసన్ విశ్వవిద్యాలయం, మాలిలో చేసిన అధ్యయనాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వారు చేసిన అధ్యయనాన్ని అర్థమయ్యేలా వివరించడం. ⇒భాషాధ్యయనంలోని ముఖ్యమైన, ఏక మూలాధార ప్రావీణ్యం, ఐస్‌బర్గ్, థ్రెషోల్డ్స్, బిక్స్, కాల్ప్ వంటి సిద్ధాంతాల సారాంశాన్ని అర్థమయ్యేలా వివరించడం. ⇒పరభాషా, మాతృభాషా మాధ్యమాలపై ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలన్నీ మాతృభాషా మాధ్యమంలో చదువుకున్న పిల్లలు చదువులో బాగా రాణిస్తున్నారని, మాతృభాషలో నైపుణ్యం ఉన్నప్పుడే రెండో భాష త్వరగా నేర్చుకోగలుగుతున్నారని తెలియజేస్తున్న విషయాన్ని సోదాహరణంగా అర్థమయ్యేలా వివరించడం. - సురేశ్ కొలిచాల (భాషా పరిశోధకుడు) -
అమ్మ భాషకు వందనం
– నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కర్నూలు(కల్చరల్) : అమ్మ నుంచి నేర్చుకున్న కమ్మనైన భాష... పాలు పెరుగు కన్న... జున్ను, వెన్న కన్న తీయనైన భాష... సహజమైన స్వచ్ఛమైన అమృతధారలు పంచే అద్వితీయమైన భాష... ఊయలలో ఉంగా ఉంగా పలుకులప్పుడు అమ్మ పాడే తీయనైన జోల పాట... అమ్మ పలికే అందమైన పలుకుల పూదోట... ఎవరికైనా ఆహ్లాదాన్ని కల్గిస్తాయి... ఆనందాన్ని పంచుతాయి... అమ్మ గుండె నుంచి శిశువు గుండెకు ప్రవహించే ఆ అనంత భావవాహిని... అనంతరం... భాషా సాగరానికి నిలయమవుతుంది.. ప్రతి వ్యక్తి అభివ్యక్తికి అదే ఆధారమవుతుంది. మాతృభాషే మధురమైనది, మాతృభాషలోని బోధన స్వచ్ఛమైనది అంటూ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏనాడో చాటిచెప్పారు. భావాలను స్వచ్ఛంగా, నిర్మలంగా ప్రకటించేందుకు ఏకైక సాధనం మాతృభాషేనని ఎందరెందరో భాషావేత్తలు ఘోషించారు. మంగళవారం..అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో తెలుగు భాషను పరిమళింపజేసిన మేధావులు ఎందరో ఉన్నారు. అలనాటి భువన విజయంలో సభ్యుడైన పింగళి సూరన జన్మించిన కర్నూలు జిల్లా తెలుగు భాషకు చక్కని పునాది వేసింది. తొలి తెలుగు నవల ఇక్కడే పుట్టిందని ఎందరో భాషావేత్తలు ప్రచారం చేశారు. ఇక్కడ పారుతున్న హంద్రీనదియే ఆంధ్రి అనే పదానికి పునాది అని కొందరు భాషా పరిశోధకులు తెలిపారు. కర్నూలు జిల్లాలో స్థాపితమైన తెలుగు భాషా వికాస ఉద్యమం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలో తన కార్యక్రమాలను విస్తరింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషా పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేసింది. గతంలో ఖమర్నగర్గా గుర్తింపు పొందిన కర్నూలులో ఉర్దూ భాష ముషాయిరాలలో, పాఠశాలల్లో గుబాళించింది. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఉర్దూ మాతృభాషగా కలిగినవారు ఉర్దూ భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఆదోని కర్ణాటక రాష్ట్రానికి అత్యంత సమీపంగా ఉండటంతో అక్కడ పుట్టి పెరిగిన కొందరు మేధావులు కన్నడ భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఇలా కర్నూలు జిల్లాలో వివిధ భాషలను మాతృభాషలుగా కలిగినవారు తమతమ మాతృభాషల పరిరక్షణ కోసం తమదైన శైలిలో పనిచేస్తున్నారు. భాషా వికాసానికి కృషి.. ఉర్దూ భాషా వికాసం కోసం కర్నూలులో 1970నుంచి ఖైసీఖమర్నగరి అనే కవి కృషి చేస్తున్నారు. ఉర్దూ రచయితలు, కవులనందరినీ కలుపుకుంటూ ముషాయిరాల ద్వారా, ఆయినా అనే పత్రిక ద్వారా ఉర్దూ భాషా పరిరక్షణ కోసం సాహితీ ఉద్యమం చేస్తున్నారు. ఆదోని వాస్తవ్యులైన రంగనాథ రామచంద్రరావు ప్రసిద్ధి చెందిన కన్నడ కథలను తెలుగులోకి అనువదిస్తూ, తెలుగు కథలను కన్నడలోకి అనువదిస్తూ కన్నడ భాషా పరివ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. కర్నూలు కేంద్రంగా ఎందరెందరో భాషావేత్తలు, కవులు, రచయితలు తెలుగు భాషా వికాసం కోసం, పరిరక్షణ కోసం తమ సేవలు కొనసాగిస్తున్నారు. తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం... – జే.ఎస్.ఆర్.కె.శర్మ, తెలుగు భాషా ఉద్యమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి : తెలుగు భాషా వికాస ఉద్యమం పేరుతో 2000లో మేము ఒక సంస్థను స్థాపించాం. తెలుగు భాషా పరిరక్షణ సదస్సులు 23 జిల్లాల్లో నిర్వహించాం. ప్రముఖ శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో నూరు భువన విజయ కార్యక్రమాలు, నూరు అష్టావధానాలు నిర్వహించి తెలుగు భాషా మాధుర్యాన్ని ప్రస్తుత తరానికి పంచిపెట్టాం. తెలుగు రాష్ట్రంలో రేషన్ కార్డు దరఖాస్తు తెలుగులోనే ఉండాలని కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి దానిని అమలు చేయించాం. తిరుపతిలోని పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం పేరును తెలుగులోనే కొనసాగించేటట్లు చేశాం. కర్నూలు జిల్లాలో 73 ప్రాంతాల్లో తెలుగు భాషా రథయాత్రలు నిర్వహించాం. కర్నూలులో కృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్టించాం. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2012లో కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాం. మద్దూర్‌నగర్‌లోని పింగళి సూరన తెలుగు తోట ప్రాంగణాన్ని 2015లో ప్రారంభించాం. ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా ప్రస్తుత తరానికి మాతృభాషలోనే విద్యాబోధన జరిగే విధంగా కృషి చేస్తున్నాం. ఉర్దూ భాష పరిరక్షణ కోసం ఉద్యమించాలి... – షంషుద్దీన్, రాయలసీమ ఉర్దూ కమిటీ ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లాలో ఉర్దూ మాట్లాడే ప్రజలు అధిక శాతం ఉన్నారు. అందుకే రాయలసీమ ఉర్దూ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. కేవీఆర్ కళాశాలలో బైపీసీ, ఎంపీసీ ఉర్దూ మాధ్యమంలో ప్రారంభించడానికి కృషి చేశాం. ఉర్దూలో పీజీ కోర్సును ప్రారంభింపజేశాం. ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాల్లో ఉర్దూ మాద్యమ పాఠశాలలను ప్రారంభించాం. ఉర్దూ యూనివర్సిటీ కోసం చాలా సంవత్సరాలుగా ఉద్యమిస్తూ వచ్చాం. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి గారికి 2009లో దరఖాస్తును ఇచ్చి ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభానికి శ్రీకారం చుట్టాం. రాయలసీమ వ్యాప్తంగా ఉర్దూ భాషా వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి ఉర్దూ భాషా మాధుర్యాన్ని తెలియజేశాం. ఉర్దూ అధికంగా మాట్లాడే ప్రజలున్న ప్రాంతాల్లో ఉర్దూ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అమ్మభాషే కమ్మనైనది.. – బి.వి.స్వరూప్ సిన్హా, ప్రముఖ రచయిత, కర్నూలు అమ్మ భాష కమ్మదనం అనే పేరుతో నేను రాసిన కవిత్వ సంకలనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా స్థానిక రవీంద్ర పాఠశాలలో ఆవిష్కరింపజేస్తున్నాను. ఈ పుస్తకంలో తెలుగు భాషలోని కమ్మదనాన్ని వివరించే పలు కవితలు ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలుకొని ఎందరెందరో భాషావేత్తలు, మేధావులు భావ వ్యక్తీకరణకు మాతృభాషే అసలైన సాధనమని ప్రచారం చేశారు. ఇది ఎప్పటికైనా వాస్తవమే. పీజీ స్థాయి వరకు మాతృభాషలోని విద్యాబోధన జరిగినట్లయితే విద్యార్థులు సరైన అవగాహనను పెంచుకుని భావ వ్యక్తీకరణకు సిద్ధమవుతారు. -
అమ్మ భాషకు ఆదరణ కరువు
– ప్రముఖ కవి జంధ్యాల రఘుబాబు ఆవేదన కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలకు ఆదరణ తగ్గుతోందని ప్రముఖ కవి జంధ్యాల రఘుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల భాషపై మోజుతో తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకే పంపుతూ తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నార న్నారు. శ్రీపింగలి సూరన తెలుగుతోటలో ఆదివారం కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘కథ–కవితా వస్తువులు ప్రపంచీకరణ ప్రభావము’ అన్న అంశంపై సాహితీ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘుబాబు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ కల్కూర, జేఎస్ఆర్కే శర్మ, ఆర్.రామారావు, జే.శివకష్ణ, అర్జున్, సుధీర్, పార్వతీ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
మాతృ భాషల్లో డిజిటల్ టెక్నాలజీ
సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్నా..రైతులు, నిరక్షరాస్యులు మాత్రం ఆ ఫలాలు అందుకోలేకపోతున్నారని గుర్తించాడో 30 ఏళ్లయువకుడు. దీనికి కారణమైన అంతరాలను తొలగించి సాంకేతికతను సామాన్యులకు చేరువ చేయాలని కలలుకన్నాడు. అందరికీ అర్థమయ్యేలా మాతృభాషల్లో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు.ఆయనే యునిఫోర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సీఈవో.. ఉమేశ్ సచ్దేవ్. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్.. ప్రపంచాన్ని మారుస్తున్న (10 మిలినియల్స్) వ్యక్తుల జాబితా-2016లోఉమేశ్కు చోటు కల్పించింది.ఈ నేపథ్యంలో ఆయనతో ఇంటర్వ్యూ.. ఇప్పుడిప్పుడే స్టార్టప్ రంగంవైపు అడుగులేస్తున్న రేపటి కార్పొరేట్స్‌కు నేనిచ్చే సలహా.. నేటి ఆధునిక ప్రపంచంలో అవకాశాలకు కొదవలేదు. కానీ వాటిని అందిపుచ్చుకుని, భావి వ్యాపారవేత్తలుగా ఖ్యాతి గడించాలంటే మీకొచ్చిన ఆలోచన దేశ తలరాతను మార్చేదిగా, నేటి యువతరాన్ని ఆకట్టుకునేదిగా ఉండాలి. అంతేకాకుండాప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, విజయానికి చేరువ కావాలంటే అనేక మార్గాలుంటాయని విశ్వసించాలి. అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు మన దేశ కీర్తిప్రతిష్టలను ముందుకు తీసుకె ళ్లగలరు. మాది కార్పొరేట్ లీడర్స్ కుటుంబం. నాన్న టాటా గ్రూప్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవారు. ఇంట్లో ఎప్పుడూ కార్పొరేట్ వాతావరణం ఉండటంతో నాక్కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. సరిగ్గా అప్పుడే (2005-07) మన దేశంలో స్టార్టప్‌లపై ఆసక్తి మొదలైంది. ఆ సమయంలో నేను జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నోయిడా)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నా స్నేహితుడు రవితో కలిసి 2006లో ‘సింగులారిస్’ అనే సంస్థను ప్రారంభించా. పొగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్ చేసి పట్టుకోవడమే మా పని. ఆ సమయంలో కుటుంబ సభ్యులందించిన ప్రోత్సాహం మరువలేనిది. అయితే మార్కెట్ పరిస్థితులు, సంస్థ పనితీరు మేమనుకున్నంత ఆశాజనకంగా లేకపోవడంతో రెండేళ్లకే మా ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. దారి చూపిన ఆశాదీపం.. ఎలాగైనా మానవ జీవన గమనాన్ని మార్చే వినూత్న టెక్నాలజీని తయారు చేయాలన్న లక్ష్యంతో సలహాలు, సూచనలు అందించాల్సిందిగా చాలా మంది పెద్దలను కలిసినా సరైన ప్రోత్సాహం లభించలేదు. ఆ సమయంలో ఐఐటీ-మద్రాస్‌లో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ ఝన్‌ఝన్‌వాలా ఎంతో సహకరించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఐఐటీ-మద్రాస్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లో ‘యునిఫోర్’ సంస్థను ఏర్పాటుచేశాం. తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యకు సాంకేతికతతో పరిష్కారం చూపాలనుకున్నాం. రైతులు, నిరక్షరాస్యులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి రెండు నెలలపాటు తమిళనాడులోని అనేక మారుమూల గ్రామాల్లో తిరిగి ఒక ప్రధానమైన సమస్యను గుర్తించాం. అదే భాషావరోధం.! నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల వినియోగం సర్వసాధారణమై పోయింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉంటున్నారు. వీరికి ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోవడంతో అనేక రకాల ఆన్లైన్ సేవలను వినియోగించుకోలేని పరిస్థితి. దీనికి కారణం భాషా అవరోధమని గుర్తించాం. ఎలాగైనా ఈ భాషాంతరాలను తొలగించి, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా చేయాలనుకున్నాం. రైతులు వాతావరణ సమాచారం, మార్కెట్ పరిస్థితులను తెలుసుకొని ఆర్థిక సాధికారతను పెంపొందించుకునేందుకు ఫోన్లు ఉపయోగపడాలి. దీని కోసం మాతృభాషల్లో ఆన్లైన్ వ్యవహారాలను చేసుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఈ మూడింటిపైనే దృష్టి.. యునిఫోర్ ప్రధానంగా వాయిస్ టెక్నాలజీస్ అయిన స్పీచ్ రికగ్నేషన్, వాయిస్ బయోమెట్రిక్స్, వాయిస్ అసిస్టెంట్‌పైనే దృష్టిపెడుతోంది. మొదట్లో ఈ టెక్నాలజీని మన దేశంలోని గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు ఉపయోగించుకుంటే చాలనుకున్నాం. కానీ నేడు మన దేశంతోపాటు ఫిలిప్పీన్స్, సింగపూర్, మలేషియాతోపాటు పశ్చిమాసియా దేశాలు సైతం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. త్వరలో చైనీస్ మార్కెట్‌పై కూడా దృష్టిపెట్టబోతున్నాం. ప్రస్తుతం ఈ టెక్నాలజీ 16 భారతీయ భాషలు, 150 ప్రాంతీయ మాండలికాలతోపాటు 70 అంతర్జాతీయ భాషల్లో సేవలందిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం, ఏవియేషన్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, రిటైల్ సెక్టార్లలో ఈ టెక్నాలజీ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఆర్థికంగానూ దినదినాభివృద్ధి చెందుతున్న యునిఫోర్ సంస్థ.. మానవ వనరుల ఎంపికలోనూ వినూత్నంగా వ్యవహరిస్తోంది. స్పష్టమైన లక్ష్యం, సృజనాత్మకత ఉండి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసంతో పనిచేయగలిగిన వారినే ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్నాం. 2019 నాటికి 1.33 బిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఇప్పుడిప్పుడే స్పీచ్ అనలిటిక్స్, వాయిస్ బయోమెట్రిక్స్పై దృష్టిసారిస్తున్నాయి. 2019 నాటికి ఈ మార్కెట్ 1.33 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇటీవల ఓ సర్వే సంస్థ స్పీచ్ అనలిటిక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా 500 మంది పేరొందిన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాలను కోరగా దీనివల్ల ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయని 72 శాతం మంది.. డబ్బు ఆదా అవుతుందని 68 శాతం మంది.. ప్రజల ఆర్థిక, సాంకేతిక పురోభివృద్ధికి తోడ్పడుతుందని 52 శాతం మంది తెలిపారు. రాబోయే రెండేళ్లలో ఈ విభాగంలో అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. -
తెలుగు బాషను వెలిగిద్దాం
– ఆంగ్లభాష మోజులో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం – భావితరాలకు తెలుగు తీయధనాన్ని చాటిచెప్పాలి – వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తిపంతులు – నేడు మాతృభాష దినోత్సవం కర్నూలు : రాజ్యాలను రాజులు పాలించే రోజుల్లో వారి సంస్థానాల్లో తెలుగు అమృత భాషగా వర్ధిల్లింది. ఎంతో మహోన్నత స్థాయిని అధిరోహించింది. ఏ భాషలో లేని నుడికారాలు, జాతీయాలు, సామెతలు, సంధులు, సమాసాలు తెలుగు భాష సొంతం. అయితే నేడు ఆంగ్లభాష ఆధిపత్యంలో తెలుగు భాష మత్యు కోరల్లో చిక్కుకొంది. నేటి తరం పిల్లలకు తెలుగు ఒంటబట్టడంలేదు. చాలా మందికి రాయడం..చదవడం తెలియదు. పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో తెలుగు భాషలో వేలాదిగా విద్యార్థులు తప్పిపోవడం బాధకలిగించే విషయం. తల్లిదండ్రులు పరభాష మోజులో మాతభాషపై మమకారం చూపడం లేదు. ఇదే పద్ధతి కొనసాగితే మరో రెండు, మూడు తరాలకు అంతరించి పోయే భాషల జాబితాలో తెలుగు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కవులు, రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషకు గిడుగు సేవలు ఆమోఘం.. తెలుగునాట భాషా విప్లవానికి గిడుగు రామ్మూర్తి ఆద్యుడు. ఆయన 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేటలో వెంకాయమ్మ, వీర్రాజు దపంతులకు జన్మించారు. 1910లో వ్యహారిక భాషోద్యమ సంస్థను స్థాపించి గ్రాంధిక భాషపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. తెలుగు పత్రిక స్థాపన ద్వారా ఆధునిక భాషకు పట్టం కట్టారు. ఆంధ్రదేశం నలుచెరుగులా తిరిగి సభలు, సమావేశాలు నిర్వహించి అనర్గళమైన ఉపన్యాసాలతో అందరినీ ఆలోచింప చేశారు. వీరి కషి ఫలితంగానే మద్రాసు ప్రభుత్వం వ్యవహారిక భాషవాద సంఘాన్ని ఏర్పాటు చేసి శిష్ట వ్యవహారికమునకు అనుకూలంగా తీర్మానం చేసింది. దీంతో గిడుగు వారిని అభినవ వాగనుశాసనుడు, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అని తెలుగు జాతి కీర్తించింది. ఆయన సేవలకు గుర్తుగా ఆయన జయంతి ఆగస్టు –29వతేదీని తెలుగు భాషాదినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఆంగ్లభాష మోజు.. తెలుగు బేజారు.. నేటి ప్రపంచంలో ఆంగ్లానికి ఉన్న క్రేజీ ఎనలేనిది. దీనిని ఎవరూ కాదనలేరు. ఈ నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా ఆంగ్లంపై ప్రజలు మోజు పెంచుకుంటున్నారు. పిల్లలకు విద్యాభ్యాసాన్ని మాతభాష కాకుండా ఆంగ్లంతో ప్రారంభిస్తున్నారు. పాఠశాలల్లో ఇంగ్లీషుతోపాటు మాతభాషకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా చాలా ప్రయివేట్ స్కూళ్ల ఆ పని చేయడం లేదు. గత మార్చిలో జరిగిన పది పరీక్షల్లో నాలుగు వేల మంది, ఇంటర్లో మూడు వేల మంది విద్యార్థులు తెలుగు పరీక్షల్లో తప్పిపోవడం ఇందుకు నిదర్శనం. తెలుగు తీయధనాన్ని భావితరాలకు అందించాలి.. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష గొప్పదనం, సంస్కతి, సంప్రదాయాలు, తెలుగు వారి ప్రాభావాన్ని దశదిశలా చాటాల్సిన అసవరం నేటి తరంపై ఉంది. తెలుగు భాష మాధుర్యాన్ని, సంస్కతిని వారసత్వంగా తర్వాతి తరాల వారికి అందించేందుకు నేటి కవులు, కళాకారులు, రచయితలు, యువత నడుం బిగించాలి. లేదంటే భాష పరిశోధకుల సర్వే ప్రకారం అంతరిస్తున్న భాషల్లో తెలుగు కూడా చేరుతుంది. అదే జరిగితే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా, దేశ భాషలందు లñ స్సగా పిలువబడిన తెలుగు భాష అన్యాయం చేసినట్టే. ప్రభుత్వ శాఖల్లో తెలుగును పటిష్టంగా అమలు చేయాలి తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలి. ప్రతి విభాగంలోనూ, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ తెలుగు భాషను పటిష్టంగా అమలు చేయాలి. ముఖ్యంగా పాఠశాలల్లో ఇంగ్లీషుతోపాటు తెలుగు బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. భాషను కాపాడుకుందాం: మద్దిలేటి, తెలుగు భాషోపాధ్యాయుడు, వెల్దుర్తి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే లె లుగు భాష భవిష్యత్ అంధకారమవుతుంది. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ జీఓలు, ఇతర వ్యహారాలను విధిగా తెలుగులో ప్రచురించాలి. ప్రయివేట్, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందరో మహానుభావులు ఆదరించిన భాష: సురేష్‌బాబు, ఆధునిక తెలుగు కవి పాశ్చాత్యులు సైతం తెలుగును ఆదరించారు. సీపీ బ్రౌన్ అనే ఆంగ్లేయుడు తెలుగు కవిత్వానికి ముగ్ధుడై ఆంగ్లంలోకి అనువదించాడు. అలాంటి భాషను మన పాలకులు ఆదరించకపోవడం దురదష్టకరం. తమిళల తరహాలో తెలుగు భాషను మన రాష్ట్రంలో అమలు చేయాలి. -
సదాశివ మాస్టర్ విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తా
కాగజ్‌నగర్‌రూరల్ : మహనీయులు, మన ప్రాంతీయులైన దివంగత డాక్టర్ సామల సదాశివ మాస్టరు విగ్రహాన్ని కాగజ్‌నగర్‌లో ప్రతిష్టించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక పద్మశాలి భవన్లో అష్టవధాని, విశ్రాంత ఆంగ్ల ఉపన్యాసకులు, కవి, సాహితీ వేత్త, అవధాన కర్త, ముద్దు రాజయ్యకు సదాశివ సాహితి పురస్కారం అందజేసిన సందర్భంలో ఏర్పాటైన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా డాక్టర్ మాడుగుల భాస్కర్ శర్మ వ్యవహరించగా, సమన్వయ కర్తగా తెలుగు సాహితీ సదస్సు కార్యదర్శి పెండ్యాల కిషన్‌శర్మ వ్యవహరించారు. సాహితీ వేత్తలో అణిముత్యాన్ని కోల్పోవడం దురదుష్టాకరమని సదాశివ మాస్టర్ పేరుతో చేపట్టే ప్రతి కార్యక్రమానికి తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. సదాశివ రచనలు అనేకం గౌరవ సలహాదారుడు కె. నారాయణగౌడ్ మాట్లాడుతూ తాను సామల సదాశివ శిష్యునేనని, ఆయన పేరు చిరస్థాయిగా ఉండేందుకు అందరదూ సహకరించాలని కోరారు. సదాశివ మాస్టర్ రచనలు ఐదువందల వరకు ఉన్నాయని వాటిని ముద్రించేందుకు అందరూ సహకరించాలని కార్యదర్శి పెండ్యాల కిషన్ శర్మ అన్నారు. డెప్యూటీ ఈవో పీఎల్ఎన్ చారి మాట్లాడుతూ సదాశివ మాస్టరు సిర్పూర్ తాలుకా దహెగాం మండలం తెనుగుపల్లి నివాసి అని తెలిపారు. సదాశివ మాస్టర్ కుమారుడు శ్రీవర్ధన్ తన ప్రసంగంలో తన తండ్రి శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినందుకు కతజ్ఞతలు తెలిపారు. పీఆర్టీయూ ప్రధాన సంపాదకుడు పర్వతి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తునప్పటికీ మాతృభాష తెలుగుపై పట్టు సాధించాలని కోరారు. అంతకు ముందు అవార్డు గ్రహీత ముద్దు రాజయ్యను ఎమ్మెల్యేతో పాటు సభలో పాల్గొన్న పలువురు పట్టు శాలువలతో సన్మానించారు. నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సామల సదాశివ కుమారులు రాజవర్ధన్, చంద్రశేఖర్, డాక్టర్ టి. దామోదర్‌రావు, తెలుగు సాహితీ సదస్సు ప్రచార సమితి అధ్యక్షుడు ఎస్. లక్ష్మీ రాజయ్య, ఎంఈవో జి. భిక్షపతి, కటకం మధుకర్, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు సామల రాజయ్య, ఉర్దూ కవి సాబీర్ హుస్సేన్, దయాకర్లతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమ చివరిలో ముద్దు రాజయ్యతో అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
స్థానిక భాషలో సామాజిక మాధ్యమం!
♦ మాతృభాషలో వినియోగించుకునే వీలుండే షేర్‌చాట్ ♦ ప్రస్తుతం తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో.. ♦ నెల రోజుల్లో తమిళం, గుజరాతీ భాషలకు విస్తరణ ♦ రూ.10 కోట్ల నిధుల సమీకరణ ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో షేర్ చాట్ సీఈఓ ఫరీద్ హెసన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : 125 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 30 కోట్ల లోపే. ఇందులో సామాజిక మాధ్యమాల యూజర్లు 15 కోట్ల కిందే. మరి ఇంత గ్యాప్ ఎందుకుంది? ఏ సోషల్ నెట్వర్కింగ్నైనా ఆంగ్లంలో వినియోగించాలనేది ఒక కారణమైతే! మెట్రో యువతతో పోల్చుకుంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువత ఇంగ్లిష్‌లో వెనకబడి ఉండటం మరో కారణం!! మరి రోజూ మనం మాట్లాడుకునే భాషల్లో సోషల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే వీలుంటే? ఎంచక్కా మాతృ భాషలో స్పందిస్తూ.. ఎప్పుడూ ఇతరులతో టచ్‌లో ఉంటూ ఎంజాయ్ చేయొచ్చు కదూ!! ఇదిగో ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ యాపే ‘షేర్‌చాట్’! యాప్ విశేషాలు, విస్తరణ ప్రణాళికల గురించి షేర్‌చాట్ సీఈఓ ఫరీద్ హెసన్ మాటల్లోనే.. నాతో పాటూ అంకుష్ సచ్దేవ్, భాను సింగ్‌లు ముగ్గురం ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్స్. ఇంగ్లిష్‌లో కంటే స్థానిక భాషలో సామాజిక మాధ్యమాలను వినియోగించే వీలుంటే చాలా మందికి చేరుతుందని అనుకున్నాం. అందుకే లక్ష రూపాయల పెట్టుబడితో ఆరు నెలలపాటు యాప్, సాఫ్ట్వేర్, ఫీచర్లను అభివృద్ధి చేసి గతేడాది అక్టోబర్‌లో బెంగళూరు కేంద్రంగా షేర్‌చాట్ సోషల్ నెట్వర్కింగ్ యాప్‌ను విడుదల చేశాం. షేర్ ప్రత్యేకత ఏంటంటే.. యూజర్లు తమ స్థానిక భాషలోనే కంటెంట్ పొందొచ్చు. పోస్ట్ చేయవచ్చు కూడా. ఫొటోలు, వీడియోలు, ఆడియోలు అన్నీ మీ భాషలోనే చేసుకునే వీలుంది. వీటికి తోడు న్యూస్, విషెస్, ఇతరుల కంటెంట్, ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు ఫాలో కావొచ్చు. నెలాఖరుకల్లా తమిళం, గుజరాతీలో.. ప్రస్తుతం తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళం భాషల్లో షేర్‌చాట్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది ముగింపు నాటికి బెంగాళీ, కన్నడ, పంజాబీ, ఒడియా భాషలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి విడత ఈ నెలాఖరుకల్లా గుజరాతీ, తమిళ భాషలకు విస్తరించనున్నాం. ఫీచర్ల విషయానికొస్తే.. చాటింగ్, కామెంట్ ఫీచర్లనూ అందుబాటులోకి తెస్తున్నాం. రూ.10 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే కాలిఫోర్నియాలో జరిగిన గూగుల్ లాంచ్‌ప్యాడ్ యాక్సలేటర్ కార్యక్రమానికి ఎంపికయ్యాం. మన దేశం తరపున ఎంకికైన ఏకైక యాప్ మాదే. ఇందులో 50,000 డాలర్ల నగదు బహుమతితో పాటూ 6 నెలల మెంటార్షిప్ కూడా ఇస్తారు. ఇటీవలే సైఫ్ పార్టనర్స్ నుంచి రూ.10 కోట్లు నిధులను సమీకరించాం. మరో మూడు నెలల్లో కొత్త ఇన్వెస్టర్ల నుంచి మరికొంత నిధుల సమీకరణ కూడా చేయనున్నామని ఫరీద్ వివరించారు. రోజుకు 2 లక్షల షేరింగ్స్ ప్రస్తుతం షేర్‌చాట్‌కు 12 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో సగానికి పైగా యాక్టివ్ యూజర్లే. నెలకు 4 లక్షల మంది కొత్తగా యాడ్ అవుతున్నారు. రోజుకు 2 లక్షల కంటెంట్స్ షేరింగ్ అవుతున్నాయి. మొత్తం యూజర్లలో దక్షిణాది రాష్ట్రాల నుంచి 5 లక్షల యూజర్లున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్ మాత్రమే అందుబాటులో ఉంది. నెల రోజుల్లో ఐఓఎస్ యాప్‌నూ అందుబాటులోకి తీసుకొస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
మన యాస..మన భాష
♦ ‘తెలంగాణ తెలుగు’ను కాపాడుకుందాం ♦ మాండలికం పరిరక్షణకు కృషి జరగాలి ♦ భాషావేత్తల అభిప్రాయం ♦ నేడు అంతర్జాతీయభాషా దినోత్సవం సాక్షి,సిటీబ్యూరో ; భాష...ఒక భావ వ్యక్తీకరణ. హృదయాంతరాల్లో నిక్షిప్తమైన భావోద్వేగాల స్పర్శ. కోపం, బాధ, సంతోషం, ఆనందం, విషాదం, ఆరాధన, ప్రేమ, ఆత్మీయత, అనురాగం, కరుణ, జాలి, దయ, వేదన వంటి భావాలన్నిం టికీ తల్లి ఒడి లాంటిది మాతృభాష. మేధస్సును ప్రతిబింబించేదీ, సరికొత్త ఆలోచనలను ఆవిష్కరించేదీ భాష ఒక్కటే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా అనేక రకాల మనుషులు, సంస్కృతులు, సంప్రదాయాల సమూహమైనట్లే ...అనేక భాషల సమూహం కూడా. ఫిబ్రవరి 21వ తేదీ అంతర్జాతీయ భాషా దినోత్సవం. అంత టా ఆంగ్లమే ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రస్తుత తరుణంలో అంతరించిపోతున్న మాతృభాషలకు పట్టం కట్టేం దుకు, మాతృభాషలను సుసంపన్నం చేసుకొనేందుకు అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ యునె స్కో ప్రపంచ భాషా దినోత్సవానికి పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణకు, వైవిధ్యభరితమైన తెలంగాణ మాండలికాన్ని కాపాడుకొనేం దుకు యావత్ సమాజం సన్నద్ధం కావాల్సి ఉంది. అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... కొత్త సందర్భం.... వందల, వేల సంవత్సరాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వ సంపదగా అందించేది తల్లిభాష ఒక్కటే. తల్లి దండ్రులు, కుటుంబం, పుట్టిపెరిగి న భౌగోళిక పరిస్థితులు, సమాజం నుంచి అలవడే సహజమైన భాష అది. అన్ని భాషలకు ఉన్నట్లే తెలంగాణ తెలుగుకు సైతం ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు తెలంగాణ మాండలికంలో గొప్ప సాహితీ సృజన చేశారు. తమిళం నుంచి మళయాలం విడివడి ఒక భాషగా అభివృద్ధి చెందినట్లే, కొన్ని వందల ఏళ్ల క్రితమే తెలుగు, కన్నడం విడిపోయి రెండు భాషలుగా ఎదిగాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఆవిర్భవించాయి. రెండు రాష్ట్రాల్లోనూ మాతృభాష తెలుగే. ఉమ్మడి రాష్ర్టంలో తెలుగు సంస్కృతీకరణకు గురైం ది. వేల కొద్దీ సంస్కృత పదాలు వ చ్చి చేరాయి. తెలంగాణ మాండలికం మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ తెలుగును, మాండలికాన్ని కాపాడుకొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని భాషావేత్తలు కోరుతున్నారు. తెలంగాణ ప్రజల వాడుకలో ఉన్న 15వేలకు పైగా మాండలిక పదాల ను ఇప్పటికిప్పుడు తెలుగు భాషలో చేర్చి దానిని పరిపుష్టం చేయవలసి ఉందని సూచిస్తున్నారు. తెలు గు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి. తెలంగాణ తెలుగు నిఘంటువు నిర్మాణం కోసం, భాష అభివృద్ధి, విస్తృతి కోసం నిధులు కేటాయించాలి. శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చా కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు, భాషావేత్తలు మాతృభాష పరిరక్షణపై చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల భాషను సృజనాత్మకం చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక భాషలు అంతరించాయి. ఇంకా కొన్ని అంతరించిపోయేందుకు దగ్గర్లో ఉన్నాయి. తెలంగాణ తెలుగు కూడా ఇలాగే కొన ఊపిరితో ఉంది. సురవరం ప్రతాప్‌రెడ్డి, కాళోజీ వంటి ఎందరో కవులు తెలంగాణ మాండలికంలో గొప్ప సాహితీ రచన చేశారు. ‘వాళ్లు కానీ ఈ వైపునకు ఏమై నా వచ్చారా’ అంటే తెలంగాణ వాళ్లకు అర్ధం కాదు. ‘ఆళ్లు గిట్ల ఇక్కడ కానొచ్చిండ్రా..’ అంటేనే అర్ధమవుతుంది. ప్రజల భాషను సృజనాత్మకం చేయాలి. పాలనలో, పత్రికల్లో, రచనల్లో తెలంగాణ భాష, మాండలికం విస్తృతంగా వినియోగించాలి. ప్రాచీన భాషల అభివృద్ధి కోసం కేంద్రం అందజేసే నిధుల ద్వారా ఇక్కడి తెలుగు అభివృద్ధి కోసం ప్రభుత్వం తగిన ప్రణాళికలను, కార్యాచరణను రూపొందించాలి. - ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు,తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు మన భాషలోనే మాట్లాడుకుందాం తెలంగాణ భాష ముప్పావుల వంతు అంతరించింది. ఇక పావులొంతే మిగిలింది. దీన్ని కాపాడుకోవాల్నంటే అందరం తెలంగాణ మాండలికంలోనే మాట్లాడుకోవాలే. రాయాలే. దీన్ని ఎవరికి వాళ్లు తీర్మానం చేసుకోవాలే. తెలంగాణ భాషలో, మాండలికంలో రాయడం చిన్న చూపు అనుకోవద్దు. అలాం టి అభిప్రాయం ఉంటే తీసేసుకోవాలే. సురవరం తెలంగాణ మాండలికంలో సీస పద్యాన్నే రాసిండు. తెలంగాణ భాషలో, యాసలో సినిమాలు తీయాలే. విలన్లకు పరిమితం చేసే సంస్కృతి పోయి, అన్ని పాత్రలు ఈ భాషలోనే మాట్లాడేవిధంగా సినిమాలు నిర్మించాలి. - తెలిదేవర భానుమూర్తి, సీనియర్ పాత్రికేయులు తెలంగాణ తెలుగు శక్తివంతమైంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో ప్రజల పోరాటానికి ఆయుధమైంది ఇక్కడి తెలుగు. తెలంగాణ మాండలికంలోగొప్ప సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యం ప్రజ లను ముందుకు నడిపించింది. అలాంటి శక్తివంతమైన తెలంగాణ తెలుగును కాపాడేందుకు, అభివృద్ధి చేసేం దుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టాలి. ప్రజలు అనేక రూపాల్లో భాషను విని యోగిస్తున్నారు. ఉత్పత్తి సంబంధాల్లో, మానవ సంబంధాలు, చేసే వృత్తుల్లో అనేక రకాలుగా భాష నిక్షిప్తమై ఉంది. అలాంటి భాషనంతా వెలికి తీసి అభివృద్ధి చేయాలి. - గోగు శ్యామల, రచయిత్రి కరికులమ్‌లో మార్పు చేయాలి చిన్నయ సూరి పంచతంత్రం కథల స్థానం లో తెలంగాణ కవులు, రచయితలు రాసిన కథలతో కరికులమ్ రూపొందించాలి. తెలంగాణ భాషను, నుడికారాన్ని మాండలికాన్ని చిన్నప్పటి నుంచే పరిచయం చేసేందుకు ప్రాథమిక విద్య స్థాయిలోనే మార్పులు జరగవలసి ఉంది. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ భాషా వికాసం జరగాలి. ప్రామాణిక భాష ఆధిపత్యం అంతరించాలి. - కోడం కుమార్, రచయిత, తెలుగు భాషా పరిశోధకులు తెలంగాణ అకాడమీ ఏర్పాటు చేయాలి తెలంగాణ భాష అభివృద్ధి కోసం వెంటనే తెలంగాణ అకాడమీని ఏర్పాటు చేయాలి. తెలంగాణ భాష వ్యాకరణం, నిఘంటువు రూపొందించాలి. ప్రతి జిల్లాలో భాషా అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని 10 జిల్లాల్లో ప్రజలు మాట్లాడుకొనే భాషను, పదజాలాన్ని కాపాడేందుకు ఈ సంస్థలు కృషి చేయా లి. ప్రభుత్వంతో పాటు కవులు, రచయితలు కూడా భాషాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. - కొల్లాపురం విమల, భాషావేత్త -
తెలుగుబ్లాగ్ల్లో విహరిద్దాం..
ఇంటర్నెట్.. ఈ రోజుల్లో సమస్త సమాచారం కోసం మనం ఆధారపడే సాధనం. అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్ సైతం అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్ వినియోగం మరింత పెరిగింది. కాసింత సమయం దొరికితే చాలు.. ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టేస్తుంటారు. అయితే దీన్ని ఉపయోగించడానికి ఆంగ్లం అవసరం కావడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం అందుబాటులోకి వచ్చాయి తెలుగుబ్లాగులు. వీటిలో కథలు, పద్యాల నుంచి వైద్య సలహాల వరకు మనకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది. ఇందులో యాడ్ అయితే చాలు.. మన మనసులోని భావాలు సైతం మాతృభాషలో అందరితో పంచుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం మీరు క్రియేట్ చేయండి ఓ బ్లాగ్.. * మాతృభాషలోనే సమస్త సమాచారం * సినిమాలు, ఆటలు,కవితలు లభ్యం * అందుబాటులో కథలు, వైద్య సలహాలు * వింతలు విశేషాలతో అబ్బురపరుస్తున్న వైనం నల్లగొండ కల్చరల్: తెలుగులో కూడలి, జల్లెడ.. వంటి పేర్లతో బ్లాగులు కనిపిస్తున్నాయి. వీటిలో మాతృభాషలోనే సమస్త సమాచారం దొరుకుతుంది. తెలుగులో ఎవరు బ్లాగ్ క్రియేట్ చేసుకున్నా తెలుగు కూడలి, జల్లెడలో యాడ్ కావచ్చు. ఈ బ్లాగ్‌ల్లో వంటింటి విషయాల నుంచి జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, వింతలు, విశేషాలు వంటి ఎన్నో నూతన విషయాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. సినిమా, సాహిత్యం, హాస్యం, సాంకేతికం, ఫొటోలు, రాజకీయాలు, పిల్లలకు ఉపయోగపడే నీతికథలు, ఆటలు, కబుర్లు, వార్తా విశేషాలు ఇలాంటివెన్నో తెలుగు భాషల్లో దొరికే బ్లాగ్స్పాట్ డాట్ కామ్‌ల్లో వెతుక్కోవచ్చు. బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం ఇలా.. మనకు జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు.. ఉచితంగా తెలుగు లేదా ఇంగ్లిష్‌లో బ్లాగ్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మన జిల్లాలోని వింతలు విశేషాలతో, జిల్లా ఇతర సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను క్రియేట్ చేయాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని. కానీ అదే సమాచారంతో నల్లగొండ డాట్ బ్లాగ్స్పాట్ డాట్ కామ్ పేరుతో ఓ బ్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటే చాలా సులభం. కేవలం మనకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. దీని ద్వారా మన సమాచారాన్ని పొందుపర్చాలనుకున్నా సులువే. గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాల్‌పేపర్‌లో కుడివైపున కనిపించే యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చే స్తే అందులో బ్లాగ్స్ అనే ఒక స్పాట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మన మెయిల్ఐడీతో ఎంటర్ కావాలి. ఇక్కడి నుంచి తెలుగు లేదా ఇంగ్లిష్ బ్లాగ్‌ను ఎంచుకుని మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన విషయాలను ప్రపంచానికి తెలిసే విధంగా పోస్ట్ చేయవచ్చు. నవలలు, కథల కోసం * డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగువన్.కామ్ వెబ్సైట్లో కావల్సిననన్నీ నవలలు అందుబాటులో ఉంటాయి. ఈ సైట్లోకి వెళ్లి సాహిత్యం ఆప్షన్‌పై క్లిక్‌చేస్తే మనకు కావల్సిన నవలలు ఎంచుకోవచ్చు. డివోషనల్పై క్లిక్ చేస్తే భక్తి సమాచారం వస్తుంది. ఇదే సైట్లో పిల్లలకు సులభంగా అర్థమయ్యే నీతికథలు, కూరగాయల పేర్లు, పద్యాలు, ఆటలు కూడా ఉంటాయి. సైట్‌లోని కిడ్స్ ఆప్షన్‌లోకి వెళ్తే మనకు కావాల్సినవి ఎంచుకోవచ్చు. వార్తలు, పలు విశేష కథనాలు సైతం ఈ సైట్లో చదవవచ్చు. * డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగుకార్నర్.కామ్ వెబ్సైట్లోకి వెళ్లితే తెలుగుకు సంబంధించి మరిన్ని వివరాలు లభ్యమవుతాయి. ఇందులో సుమతి, వేమన, భాస్కర శతకాలు.. నీతికథలు చదువుకోవచ్చు. తెలుగు ఆటలు, అంకెలు, గుణింతాలు, రాశులు.. ఈ వెబ్‌పేజీలో చూడవచ్చు. మనకు కావల్సిన ఆప్షన్ ఎంచుకుంటే మరో పేజీ ప్రత్యక్షమవుతుంది. అందులో పూర్తి సమాచారం ఉంటుంది. * డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఉపకారి.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కినిగె.కామ్, వాకిలి.. తదితర సైట్లలో తెలుగు సాహిత్యం, కథలు, నవలలు చదవవచ్చు. మాతృభాషను గౌరవిద్దాం * తెలుగు బ్లాగులను వినియోగించడం ద్వారా మాతృభాషను గౌరవించినట్లవుతుంది. * సమాచారమంతా తెలుగులో ఉండడం ద్వారా ఇంగ్లిష్ రాని వారికి సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. * పిల్లలకు పెద్దలకు అవసరమయ్యే కథలు, సాహిత్యం, పద్యాలు అన్నీ తెలుగు బ్లాగులు, సైట్లలో అందుబాటులో ఉంటాయి. * తెలుగు భాషలో ఉండే బ్లాగులు, సైట్లలో పిల్లలకు ఉపయోగకరమైన విషయాలూ ఉంటాయి. * నీతికథలు, బాలల ప్రపంచం, అక్బర్, బీర్బల్ వంటి కథలు అందులో ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా... * పిల్లలకథలు, బాలల ప్రపంచం, బొమ్మలు, బాలల సాహిత్యం, నీతి చంద్రికలు, చందమామ కథలు అక్బర్, బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణుని కథలు, అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం లాంటి క థానికల సమాచారంతో కూడిన బ్లాగ్లు కూడలి, జల్లెడ, బ్లాగిల్లు, మౌలిక వంటి బ్లాగ్స్పాట్ డాట్ కామ్‌లలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా పెద్దవారికి అవసరమైన సాహిత్య సమావేశాలు, ఆధ్యాత్మిక రంగాలు, యువతకు అవసరమైన క్రీడలు, సినిమాలు, బ్యూటీ టిప్స్, ఇంట్లో వాళ్లందరికీ అవసరమగు కొత్త కొత్త వంటకాలు మొదలుకుని ఆయుర్వేదం టిప్స్, వాటి ఉపయోగాలను వివరించే బ్లాగ్స్ కూడా దొరుకుతాయి. మాతృభాషలోనే కంప్యూటర్ విజ్ఞానం.. చాలా మంది ఇంటర్నెట్ వాడకం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని కనెక్షన్ తీసుకుంటారు. తీరా అందులో ఏ సమాచారం చూసినా ఇంగ్లిష్‌లోనే ఉండడం తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు తెలుగు బ్లాగ్‌లోకి వెళ్తే ఎంతో సులువుగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కంప్యూటర్ వాడకం నుంచి మొదలుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అన్నింటి గురించి తెలిపే సైట్లు సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఫొటోషాప్ ద్వారా మన ఫొటోలు అందమైన లోకేషన్లకు యాడ్ చేస్తూ మనకు నచ్చిన ఫ్రేముల్లో చూసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో లభించే ఫీచర్లు, యాప్స్ వరకు చాలా అంశాలు కూడా ఈ బ్లాగ్ సైట్లలో మనకు లభిస్తాయి. ఇవే కాకుండా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఫీచర్స్, గూగుల్ ఫీచర్స్ ఇలా చాలా విషయాలను సులువుగా తెలుసుకోవడానికి ఈ బ్లాగులు తోడ్పడుతున్నాయి. -
మాతృభాషపై ఆసక్తి పెంచుకోవాలి
నార్నూర్ : మాతృభాషపై ఆసక్తి పెంచుకున్నప్పుడే గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. నార్నూర్ మండలంలోని గుం జాల గ్రామంలో సోమవారం ‘గుంజాల గోండి లిపి-సంపూర్ణ అక్షరాస్యత గ్రామం గా గుంజాల’ అనే కార్యక్రమ ప్రారంభ సభను నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రశాంత్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు గ్రామంలోని కొమురం భీమ్ జెండా వద్ద నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, కొన్ని దశాబ్దాల పాటు కనుమరుగైన గుంజాల గోండి లిపి ప్రతులను వెలుగులోకి తీసుకువచ్చిన జంగు, లింగులను, గోండి లిపిని అధ్యయనం చేసి అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రొఫెసర్లను అభినందించారు. గుంజాలలో గోండి లిపి రీసర్చ్ సెంటర్ భవన నిర్మాణానికి వెంటనే రూ.20 లక్షల నిధులు విడుదల చేయాలని ఐటీడీఏ పీవో ప్రశాంత్పాటిల్ను ఆదేశించారు. గుంజాల గోండి లిపి అధ్యయన కేంద్రం అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు మాట్లాడుతూ, 5 సంవత్సరాల నుంచి 85 ఏళ్ల ముసలి వరకు గోండి లిపిలో అక్షరాస్యత సాధించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలోని 17 పాఠశాలల్లో గుంజాల గోండి లిపిలో బోధన కొనసాగుతోందని, లిపిలో మొదటి వాచకాన్ని సైతం రూపొందించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఆదివాసీలు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. దళిత, ఆదివాసీ అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ ఆర్.ఎస్.సర్రాజు, ఆర్డీవో ఐల్లయ్య, ఏజెన్సీ జిల్లా విద్యాధికారి సనత్‌కుమార్, గుంజాల గోండి లిపి అధ్యయన కేంద్రం ప్రొఫెసర్లు మనోజ, స్కాలర్లు, ఎంపీడీవో రాథోడ్ రవీందర్, తహశీల్దార్ మల్లయ్య, సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు. కృషితోనే ఇంతటి ప్రాధాన్యం ఉట్నూర్ రూరల్ : గోండి భాష పరిరక్షణ, అభివృద్ధి కృషితోనే ఆ భాషకు ఇంతటి ప్రాధాన్యం దక్కుతోందని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ‘4వ జాతీయ గోండి భాష ప్రామాణికం’ వర్క్‌షాప్ సోమవారం ముగిసిం ది. కలెక్టర్ హాజరయ్యారు. ఐటీడీఏ ద్వా రా భాష అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. -
విభజనవాదం ఏర్పడింది...భాషపై గౌరవం లేకే
= భాషాభివృద్ధిపై శ్రద్ధ ఏదీ? = తెలుగు భాషా వికాస సంస్కృతీ సంవత్సరంగా ప్రకటించినా పట్టని సర్కారు = అమలుకునోచని సీఎం కిరణ్ వాగ్దానాలు = రాష్ట్ర తెలుగు భాషా వికాస ఉద్యమ అధ్యక్షుడు హనుమంతరావు ఆవేదన పామర్రు, న్యూస్‌లైన్ : మాతృభాషపై గౌరవం లేకనే రాష్ట్రంలో విభజనవాదం తలెత్తిందని రాష్ట్ర తెలుగు భాషా వికాస ఉద్యమ అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత గానుగపెంట హనుమంతరావు తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఆయన బంధువులను కలిసేందుకు పామర్రు వచ్చిన సందర్భంగా ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రంలో అందరం ఒకే భాష మాట్లాడేటప్పుడు రాష్ట్రాన్ని విభజించడం అసంబద్ధమని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడం క్షంతవ్యం కాదని, తెలుగు తల్లిని నిట్టనిలువునా చీల్చడం మంచిది కాదని చెప్పారు. తెలుగు భాషాభివృద్ధిపై కొరవడిన శ్రద్ధ... తెలుగు భాషా వికాస సంస్కృతిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని, దీంతో తెలుగుభాషా విస్తరణ పనులు కుంటుపడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రస్తుత సంవత్సరాన్ని తెలుగు భాషా వికాస సంస్కృతీ సంవత్సరంగా స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారని, ఈ ఏడాది మొత్తం తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తామని, ఆ భాషకు సంబంధించిన చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తామని కూడా వాగ్దానాలు చేశారని వివరించారు. దీని కోసం జిల్లాకు కోటి రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. తెలుగు భాషా వికాస సంస్కృతీ సంవత్సరం ప్రారంభించి ఆరు నెలలు పైబడుతున్నా రాష్ట్రంలో ఏవిధమైన భాషాభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భాషాభివృద్ధి పనులు రాష్ట్రంలో 20 శాతం మాత్రమే అరకొరగా అమలవుతున్నాయని చెప్పారు. భాషాభివృద్ధికి ప్రభుత్వం చేయాల్సిన పనులివీ... తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం చేయాల్సిన పనులను ఈ సందర్భంగా హనుమంతరావు వివరించారు. పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగును బోధనా భాషగా విధిగా ప్రవేశపెట్టాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక తెలుగు పండితుడిని నియమించాలని, అన్ని కార్యాలయాల్లో తెలుగు సంపూర్ణంగా అమలయ్యేందుకు పర్యవేక్షక అధికారులను మండల స్థాయిలో నియమించాలని, తెలుగు వాచకాలలో మాతృభాషపై మమకారం కలిగించే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని. ప్రతి జిల్లాకు ఏపీకి చెందిన కలెక్టర్లనే నియమించి.. వీటిని అమలుచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికార భాషా సంఘానికి తగిన స్వేచ్ఛ, నిధులు, అధికారాలు ఇవ్వాలని, పాఠశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులు మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేషధారణ తప్పనిసరిగా ఉండేలా చూడాలని చెప్పారు. తెలుగు భాషను తెలుగు వారే నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తెలుగు సంపూర్ణంగా అమలు అయ్యేందుకు ప్రజలు, భాషాభిమానులు, మేధావులు, విద్యార్థులు ఉద్యమాలను తీసుకురావాలని కోరారు.