వాషింగ్టన్ : ప్రతి బిడ్డ అమ్మ ఒడిలో నేర్చుకునే మొదటి భాష..మాతృభాష. ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే అప్రయత్నంగా, సహజంగానే మాతృభాష అబ్బుతుంది. మనుగడ కోసం వేరే భాషలను నేర్చుకున్నా మాతృభాషను మాత్రం మరవద్దు. మాతృభాష పరిరక్షణ సంకల్పంతో, యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ ఆదివారం ఫిబ్రవరి 21, 2021 నాడు తల్లి భాష-తెలుగు మన శ్వాస అనే సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆన్‌లైన్ ద్వారా పాల్గొననున్నట్లు తానా అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి, తాసా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్మనీ లోని ఎస్. ఆర్. హెచ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డా. తొట్టెంపూడి శ్రీ గణేష్“జర్మనీ దేశం మాతృభాషకు ఇచ్చే ప్రాధాన్యత - అన్య సాహిత్యానువాద కృషి” అనే అంశంపై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు నేల, తెలుగు భాష ప్రాముఖ్యతలపై గాయనీ గాయకులు పాల్గొని పాటలు, పద్యాలు ఆలపిస్తారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment