మన యాస..మన భాష | today is mother tongue day | Sakshi
Sakshi News home page

మన యాస..మన భాష

Published Sun, Feb 21 2016 2:31 AM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM

మన యాస..మన భాష - Sakshi

మన యాస..మన భాష

‘తెలంగాణ తెలుగు’ను కాపాడుకుందాం
మాండలికం పరిరక్షణకు కృషి జరగాలి
భాషావేత్తల అభిప్రాయం
నేడు అంతర్జాతీయభాషా దినోత్సవం

 
సాక్షి,సిటీబ్యూరో ; భాష...ఒక భావ వ్యక్తీకరణ. హృదయాంతరాల్లో  నిక్షిప్తమైన భావోద్వేగాల స్పర్శ. కోపం, బాధ, సంతోషం, ఆనందం, విషాదం, ఆరాధన, ప్రేమ, ఆత్మీయత, అనురాగం, కరుణ, జాలి, దయ, వేదన వంటి భావాలన్నిం టికీ తల్లి ఒడి లాంటిది మాతృభాష. మేధస్సును ప్రతిబింబించేదీ, సరికొత్త ఆలోచనలను ఆవిష్కరించేదీ భాష  ఒక్కటే. ఒక్క మాటలో చెప్పాలంటే  ప్రపంచమంతా అనేక రకాల మనుషులు, సంస్కృతులు, సంప్రదాయాల సమూహమైనట్లే ...అనేక  భాషల  సమూహం  కూడా. ఫిబ్రవరి 21వ తేదీ అంతర్జాతీయ భాషా దినోత్సవం. అంత టా ఆంగ్లమే ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రస్తుత తరుణంలో అంతరించిపోతున్న మాతృభాషలకు పట్టం కట్టేం దుకు, మాతృభాషలను సుసంపన్నం చేసుకొనేందుకు అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ యునె స్కో ప్రపంచ భాషా దినోత్సవానికి పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణకు, వైవిధ్యభరితమైన తెలంగాణ మాండలికాన్ని కాపాడుకొనేం దుకు యావత్ సమాజం సన్నద్ధం కావాల్సి ఉంది. అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

 కొత్త సందర్భం....
 వందల, వేల సంవత్సరాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వ సంపదగా అందించేది తల్లిభాష ఒక్కటే. తల్లి దండ్రులు, కుటుంబం, పుట్టిపెరిగి న భౌగోళిక పరిస్థితులు, సమాజం నుంచి  అలవడే  సహజమైన  భాష  అది. అన్ని భాషలకు ఉన్నట్లే తెలంగాణ తెలుగుకు సైతం ఎంతో చరిత్ర  ఉంది. ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు తెలంగాణ  మాండలికంలో  గొప్ప సాహితీ సృజన చేశారు. తమిళం  నుంచి మళయాలం విడివడి ఒక  భాషగా అభివృద్ధి చెందినట్లే, కొన్ని వందల ఏళ్ల క్రితమే తెలుగు, కన్నడం విడిపోయి రెండు  భాషలుగా ఎదిగాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు  ఆవిర్భవించాయి. రెండు రాష్ట్రాల్లోనూ  మాతృభాష  తెలుగే. ఉమ్మడి రాష్ర్టంలో  తెలుగు సంస్కృతీకరణకు గురైం ది. వేల కొద్దీ సంస్కృత పదాలు వ చ్చి చేరాయి.

తెలంగాణ మాండలికం మనుగడ  ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ తెలుగును, మాండలికాన్ని  కాపాడుకొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని భాషావేత్తలు కోరుతున్నారు. తెలంగాణ ప్రజల  వాడుకలో ఉన్న  15వేలకు పైగా మాండలిక పదాల ను ఇప్పటికిప్పుడు తెలుగు భాషలో చేర్చి  దానిని పరిపుష్టం చేయవలసి ఉందని సూచిస్తున్నారు. తెలు గు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి. తెలంగాణ తెలుగు నిఘంటువు నిర్మాణం కోసం, భాష అభివృద్ధి, విస్తృతి కోసం నిధులు కేటాయించాలి. శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చా కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు, భాషావేత్తలు మాతృభాష పరిరక్షణపై చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
 
 
 ప్రజల భాషను సృజనాత్మకం చేయాలి
 ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక భాషలు అంతరించాయి. ఇంకా కొన్ని అంతరించిపోయేందుకు దగ్గర్లో ఉన్నాయి. తెలంగాణ తెలుగు కూడా ఇలాగే కొన ఊపిరితో ఉంది. సురవరం ప్రతాప్‌రెడ్డి, కాళోజీ వంటి ఎందరో కవులు  తెలంగాణ  మాండలికంలో గొప్ప సాహితీ రచన చేశారు. ‘వాళ్లు కానీ ఈ వైపునకు ఏమై నా వచ్చారా’ అంటే  తెలంగాణ వాళ్లకు అర్ధం కాదు. ‘ఆళ్లు గిట్ల ఇక్కడ కానొచ్చిండ్రా..’ అంటేనే అర్ధమవుతుంది. ప్రజల భాషను సృజనాత్మకం చేయాలి. పాలనలో, పత్రికల్లో, రచనల్లో తెలంగాణ భాష, మాండలికం విస్తృతంగా వినియోగించాలి. ప్రాచీన భాషల అభివృద్ధి కోసం కేంద్రం అందజేసే నిధుల ద్వారా ఇక్కడి తెలుగు అభివృద్ధి కోసం ప్రభుత్వం తగిన ప్రణాళికలను, కార్యాచరణను రూపొందించాలి.  - ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు,తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు
 
 మన భాషలోనే మాట్లాడుకుందాం
 తెలంగాణ భాష ముప్పావుల వంతు అంతరించింది. ఇక పావులొంతే మిగిలింది. దీన్ని కాపాడుకోవాల్నంటే అందరం తెలంగాణ మాండలికంలోనే మాట్లాడుకోవాలే. రాయాలే. దీన్ని ఎవరికి వాళ్లు తీర్మానం చేసుకోవాలే. తెలంగాణ భాషలో, మాండలికంలో రాయడం చిన్న చూపు అనుకోవద్దు. అలాం టి అభిప్రాయం ఉంటే తీసేసుకోవాలే. సురవరం  తెలంగాణ మాండలికంలో సీస పద్యాన్నే రాసిండు. తెలంగాణ భాషలో, యాసలో సినిమాలు తీయాలే. విలన్‌లకు పరిమితం చేసే సంస్కృతి పోయి, అన్ని పాత్రలు ఈ భాషలోనే మాట్లాడేవిధంగా సినిమాలు నిర్మించాలి.  - తెలిదేవర భానుమూర్తి, సీనియర్ పాత్రికేయులు
 
 తెలంగాణ తెలుగు శక్తివంతమైంది
 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో ప్రజల పోరాటానికి ఆయుధమైంది ఇక్కడి తెలుగు. తెలంగాణ మాండలికంలోగొప్ప సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యం  ప్రజ లను ముందుకు నడిపించింది. అలాంటి శక్తివంతమైన తెలంగాణ తెలుగును  కాపాడేందుకు, అభివృద్ధి చేసేం దుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టాలి. ప్రజలు అనేక రూపాల్లో  భాషను విని యోగిస్తున్నారు. ఉత్పత్తి సంబంధాల్లో, మానవ సంబంధాలు, చేసే వృత్తుల్లో అనేక రకాలుగా భాష నిక్షిప్తమై ఉంది. అలాంటి భాషనంతా వెలికి తీసి అభివృద్ధి చేయాలి.
 - గోగు శ్యామల, రచయిత్రి
 
 కరికులమ్‌లో మార్పు చేయాలి
 చిన్నయ సూరి పంచతంత్రం కథల స్థానం లో తెలంగాణ కవులు, రచయితలు రాసిన కథలతో కరికులమ్ రూపొందించాలి. తెలంగాణ భాషను, నుడికారాన్ని మాండలికాన్ని చిన్నప్పటి నుంచే పరిచయం చేసేందుకు ప్రాథమిక విద్య స్థాయిలోనే మార్పులు జరగవలసి ఉంది. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ భాషా వికాసం జరగాలి. ప్రామాణిక భాష ఆధిపత్యం అంతరించాలి.
                                                   - కోడం కుమార్, రచయిత,  తెలుగు భాషా పరిశోధకులు
 
 తెలంగాణ అకాడమీ ఏర్పాటు చేయాలి
 తెలంగాణ భాష అభివృద్ధి కోసం  వెంటనే తెలంగాణ అకాడమీని ఏర్పాటు చేయాలి. తెలంగాణ భాష వ్యాకరణం, నిఘంటువు రూపొందించాలి. ప్రతి జిల్లాలో భాషా అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని 10 జిల్లాల్లో  ప్రజలు మాట్లాడుకొనే భాషను, పదజాలాన్ని కాపాడేందుకు ఈ సంస్థలు కృషి చేయా లి. ప్రభుత్వంతో పాటు కవులు, రచయితలు కూడా భాషాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.  - కొల్లాపురం విమల, భాషావేత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement