Language Day
-
అక్షర కుసుమం: వాచస్పతి కుసుమారెడ్డి
కొండూరు కుసుమారెడ్డి... ఏడున్నర దశాబ్దాల జీవనయానంలో ఆమె కలం నుంచి ఇరవై రచనలు జాలువారాయి. ఓనమాలు దిద్దిన నాటి నుంచి నేటి వరకు అక్షరంతో మమేకమై సాగుతున్న సాహిత్యసేవకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అధికార భాషా దినోత్సవం’ సందర్భంగా (ఆగస్టు 29) ఆమెను ‘భాషారత్న’ పురస్కారంతో గౌరవించింది. ఆ విశేషాలను, తన సాహిత్య ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ‘‘మాది నెల్లూరు జిల్లా, కావలి పట్టణం. మా నాన్న జయరామిరెడ్డి హైస్కూల్ హెడ్మాస్టర్, అమ్మ శంకరమ్మ గృహిణి. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు కావలిలో చదివాను. గుంటూరు, నల్లపాడు (ఆంధ్ర విశ్వవిద్యాలయం)లో పీజీ చేసిన తర్వాత ఎంఫిల్కి హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. లింగ్విస్టిక్స్‌లో పీజీ డిప్లమో, రెండు పీహెచ్‌డీలు ఉస్మానియాలోనే చేశాను. వారణాసి, సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీ నుంచి డీలిట్ చేసి ‘వాచస్పతి’ బిరుదు పొందాను. ఉస్మానియాలో 1974లో విద్యార్థిగా అడుగు పెట్టిన నేను 1979లో లెక్చరర్నయ్యాను. పదోన్నతులతో ప్రొఫెసర్ హోదాలో తెలుగు శాఖాధిపతిగా విధులు నిర్వర్తించి 2008లో రిటైరయ్యాను. ఆ రిటైర్మెంట్ ఉస్మానియా నుంచి మాత్రమే. ఆ మరునాటి నుంచి ట్రిపుల్ ఐటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్) బాధ్యతలు స్వీకరించాను. ట్రిపుల్ ఐటీ రూపకల్పన నుంచి ఆరేళ్లపాటు ఆ విధుల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా ఉద్యోగపరంగా విశ్రాంత జీవితమే కానీ, చదవడానికి రాయడానికి విశ్రాంతి తీసుకోలేదు. విషయశోధన చేస్తూనే ఉన్నాను, రాస్తూనే ఉన్నాను. పంతొమ్మిది గ్రంథాలు ప్రచురితమయ్యాయి. ఐసీహెచ్ఆర్ నుంచి ‘సీనియర్ అకడమిక్ ఫెలో’ అందుకున్న రచన (కల్చరల్ లైఫ్ ఆఫ్ తెలంగాణ ట్రైబ్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు డాన్స్, మ్యూజిక్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్) తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రచురణ దశలో ఉంది. అన్నీ అధ్యయన భరితాలే! నేను కాలక్షేపం కోసం ఏదీ రాయలేదు. కాలక్షేపంగా చదువుకోవడానికీ రాయలేదు. ప్రతిదీ సమగ్రమైన పరిశోధన, శాస్త్ర పూర్వక అధ్యయనంతో రాసినవే. నా రచనలన్నీ జీవితగమనానికి సూచికలవంటివే. నా పర్యవేక్షణలో 30 మందికి పైగా విద్యార్థులు పీహెచ్‌డీలు చేశారు. నేను పీహెచ్డీ చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలతోపాటు, నా విద్యార్థులకు గైడ్ చేస్తున్న క్రమంలో నాకు ఓ విషయం స్పష్టంగా తెలిసి వచ్చింది. అప్పటి వరకు పరిశోధన చేసే వాళ్లకు ఒక మెథడాలజీ లేదు. ఆ లోటును భర్తీ చేయడానికి ఆచార్య ఎం. కులశేఖరరావుతో కలిసి ‘సాహిత్య పరిశోధన పద్ధతులు’ రాశాను. ఇలాగే నా ప్రతి రచన వెనుక బలమైన కారణం, ఉపయుక్తత ఉన్నాయి. తంజావూరులోని సరస్వతి మహల్ గ్రంథాలయం ప్రభావం నా రచనల మీద ఎక్కువగా ఉంది. నెల రోజుల పాటు అక్కడే ఉండి తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చేసి నోట్స్ రాసుకున్నాను. రంగాజమ్మ స్ఫూర్తి! ఎంఫిల్ అంశంగా రంగాజమ్మను తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. ఆమె ఎనిమిది భాషల్లో ప్రావీణ్యం ఉన్న తెలుగు కవయిత్రి. కనకాభిషేక గౌరవం అందుకున్న ఏకైక మహిళ. తంజావూరు నాయక రాజుల ఆస్థానంలో ఆమెకి గొప్ప స్థానం ఉండేది. నా మీద ఆమె ప్రభావం కూడా ఉందనే చెప్పాలి. ఆమెలాగే నేను కూడా నా రంగంలో విశేషంగా కృషి చేయాలని, అత్యున్నత స్థాయికి చేరాలనే ఆకాంక్ష నాకు తెలియకుండానే కలిగింది. సంస్కృతంలో డీలిట్ చేయడం ద్వారా వాచస్పతి బిరుదు పొందిన తొలి తెలుగు వ్యక్తినయ్యాను. ఇప్పటికీ ఆ బిరుదు సాధించిన ఏకైక తెలుగు మహిళను నేనే. జ్ఞానం భావితరాలకు అందాలి! వార్తా పత్రికల్లో వ్యాసాలు రాశాను. వ్యక్తిత్వ వికాసం క్లాసులకు మూలం మన భగవద్గీత. ఒక్కో శ్లోకాన్ని నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉదాహరణలతో రాసిన గీతాయోగం నన్ను యూనివర్సిటీ పరిధి నుంచి బయటకు తెచ్చింది. గీతాయోగం ద్వారా సాధారణ పాఠకులకు కూడా పరిచయమయ్యాను. మొత్తంగా నేను రాసిన పుస్తకాల లెక్క చెప్పగలను, కానీ ఎన్ని గ్రంథాలను చదివాననే ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉండదు. మన ప్రాచీన గ్రంథాల్లో గణితం, రాజనీతి, ధర్మ అర్థశాస్త్రాలు, వైద్యం, ధనుర్విద్య, ఖడ్గలక్షణ శాస్త్రాది యుద్ధ నైపుణ్యాలన్నీ సమగ్రంగా ఉన్నాయి. నృత్యకళ అత్యున్నత స్థాయిలో ఉండేది. చాలా నాట్యరీతులు అంతరించి పోయాయి. వాటిని వివరించే సాహిత్యం కూడా చేజారిపోతోంది. వాటి పునరుద్ధరణకు మార్గదర్శనం చేయగలిగిన రచనలు చేశాను. నాకు నేనుగా నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించాను. భావితరాల కోసం ఓ బృహత్తర ప్రణాళిక నా మదిలో ఉంది. అది... మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్న జ్ఞానాన్ని డిజిటలైజ్ చేసి ప్రాచీన సాహిత్య శాస్త్ర గ్రంథాలన్నింటితో ఒక డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఉంది. మన ప్రాచీన గ్రంథాల పట్ల చాలామందికి ఆసక్తి ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాల కారణంగా తంజావూరు, ఇతర గ్రంథాలయాలకు వెళ్లి తాళపత్ర గ్రంథాలను, ప్రాచీన రచనలను అధ్యయనం చేయగలిగిన సమయం ఉండదు. అలాంటి వారికి ఈ ప్రయత్నం మేలు చేస్తుంది. అరచేతిలోని స్మార్ట్ ఫోన్లోనే చదువుకోవచ్చు. అమెరికా నుంచి సాఫ్ట్వేర్ నిపుణులు ఒకరు ఫోన్ చేసి ‘భీమఖండంలో ఒక శాస్త్రీయ విషయముందని, పరిశోధన కోసం ఆ పుస్తకం ఒక కాపీ కావాల’ని అడిగారు. డిజిటలైజ్ చేస్తే మనదేశం నుంచి అమెరికాకు పుస్తకాన్ని పంపించాల్సిన ప్రయాస అక్కరలేదు. వందేళ్లు దాటిన పుస్తకాలు కూడా ఆదరణకు నోచుకోకుండా పడి ఉన్నాయి. వాటన్నింటినీ భావితరాలకు అందించడానికి ఏమి చేయాలి, ఎలా చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఇటీవల విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలిగా నియమించినట్లు అధికారులు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా నా ఆలోచనలకు ఒక రూపం తీసుకురావచ్చనే ఉత్సాహం కలిగింది’’ అన్నారు వాచస్పతి కొండూరి కుసుమారెడ్డి. రోజుకు పదిగంటలు! బోధన వృత్తిలో ఉన్నంత కాలం నా దినచర్య ఒకేక్రమంలో సాగింది. నాలుగు గంటలు పాఠాలు చెప్పడానికి, రెండు గంటలు ప్రిపరేషన్‌కి. ప్రయాణం ఒక గంట. ఈ ఏడు గంటలు ఉద్యోగం కోసం. ఇవన్నీ పూర్తయిన తర్వాత మూడు గంటల సేపు పుస్తకాలు చదవడానికి, రాసుకోవడానికి పట్టేది. రోజుకు దాదాపు పదిగంటలు అక్షరాల మధ్యనే గడిచేది. మా తమ్ముడి భార్య వాణి నాకు ఇంటి బాధ్యతలేవీ లేకుండా చూసుకునేది. నాకు సన్మానాలు జరుగుతుంటే తనకే జరిగినంత సంతోషపడేది. నా కోసం అతిథులు వస్తే తన పుట్టింటి వాళ్లు వచ్చినంత సంబరపడుతూ వాళ్లకు అన్నీ అమర్చి పెట్టేది. మా నాన్న కవి అనే విషయం ఆయన పోయిన తర్వాత కానీ మాకు తెలియలేదు. ఆయన పుస్తకాలన్నీ తీసి సర్దుతుంటే ‘రుద్రీయము’ చేతిరాత ప్రతి దొరికింది. కాకతీయ రాజు రుద్రదేవుడి చరిత్రను ఆయన పద్యకావ్యంగా రాశారు. ఆ పుస్తకాన్ని పరిష్కరించి ప్రచురించడం, ఆయన కవి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేయడం నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : సీహెచ్ మోహనాచారి -
వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు- నార్వేలు సంయుక్తంగా వర్చువల్ పద్దతిలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో ప్రముఖ రచయిత్రి మంగిపూడి రాధికకు ప్రవాస తెలుగు పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రచయిత తనికెళ్ళ భరణి ఈ పురస్కారాన్ని అందుకున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి అభినందనలు తెలియజేశారు. మొత్తం 12 మంది ప్రవాస భాషా సేవకుల కృషిని తెలియజేశారు. ప్రవాస భాషా సేవకులు చేస్తున్న కృషిని ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర, వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు వంశీ రామరాజు, డాక్టర్ మీగడ రామలింగస్వామిలు ప్రశంసించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ గారు ముఖ్యఅతిథిగా ప్రారంభోపన్యాసం చేసి ఈ సభను ప్రారంభించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణ గావిస్తూ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నడిపించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విక్రమ్ పెట్లూరు దక్షిణాఫ్రికా, డాక్టర్ వెంకట్ తరిగోపుల నార్వే, సుధాకర్ కువైట్, లక్ష్మణ్ దక్షిణాఫ్రికా, రత్నకుమార్ కవుటూరు సింగపూర్ , పీసపాటి జయ హాంకాంగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘ప్రవాస తెలుగు పురస్కారం-2021’కు ఎంపికైన రాధికా మంగిపూడి -
28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం
సాక్షి, అమరావతి: ఈ నెల 28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం జరుగనుంది. 13 మందికి భాషా సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. శలాక రఘునాథ శర్మ, మొవ్వ వృషాద్రిపతి, డా.కోడూరి ప్రభాకర్‌రెడ్డి, వాడ్రేవు సుందరరావు, వెలమల సిమ్మన, డా.కంపల్లె రవిచంద్రన్, డా.ఉపద్రష్ట వేంకట రమణమూర్తి, ఎస్ సుధారాణి, జిఎస్ చలం, కెంగార మోహన్, షహనాజ్ బేగం, మల్లిపురం జగదీష్, పచ్చా పెంచలయ్య ఈ పురస్కారాలు అందుకోనున్నారు. -
కవిత్వంతో ప్రజల్లో చైతన్యం
గన్‌ఫౌండ్రీ: శాంతియుత పోరాటాలతో ఫలితం రానప్పుడు ప్రజలు హింసాత్మక పంథా ఎంచుకుంటారని తన కవితల ద్వారా చెప్పిన వ్యక్తి కాళోజీ అని విరసం నేత వరవరరావు అన్నారు. తన కవితలతో ప్రజల్లో చైతన్యం కలిగించారని చెప్పారు. సోమవారం నిజాం కళాశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆధ్వర్యంలో కాళోజీ స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. వరవరరావు కీలక ఉపన్యాసం చేస్తూ కాళోజీ చిన్న నాటి నుంచే ప్రజల తరపున కవిత్వాలు రాసే వారని అన్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని భాషా దినోత్సవంగా నిర్వహించడం ఆనందకరమన్నారు. పలుకుబడుల భాషను పూర్తి స్థాయిలో తీసుకువచ్చినప్పుడు ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ వర్సిటీలో మరిన్ని ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ప్రవేశపెట్టిన కాళోజీ బంగారు పతకాన్ని బీఏ తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన ప్రకాశ్ అనే విద్యార్థికి ప్రదానం చేశారు. నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహమాన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్, నిజాం కళాశాల తెలుగుశాఖ ప్రొఫెసర్లు కాసీం, డాక్టర్ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. -
అమ్మ భాష అమృతం
సందర్భం : నేడు తెలుగు భాషా దినోత్సవం ––––––––––––––––––––– తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలెందు తెలుగు లెస్స... అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాష ఔనత్యాన్ని ప్రపంచానికి ఆయన ఇలా చాటిచెప్పారు. పంచదార కన్న.. పనస తొనల కన్న... కమ్మని తేనే కన్న మధురమైనది మన తెలుగు భాష అంటూ ప్రాచీన కవులు ఎందరో తమ భాషాభిమానాన్ని చాటుకున్నారు. తల్లి ప్రేమకు సరిసాటిగా భాసిల్లిన తెలుగు భాషను ఎందరో మహనీయులు సుసంపన్నం చేసారు. అందులో అనంత వాసులూ భాగస్వామ్యులై భాషా వికాసానికి ఇతోధికంగా తోడ్పాటునందిస్తున్నారు. తెలుగు భాషా వైభవాన్ని ఘనంగా చాటడం, మాతృభాష సౌందర్యాన్ని గుర్తుచేయడం కోసం గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి సందర్భంగా ఆగష్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. అనంత వాసికి అరుదైన అవకాశం రాష్ట్ర విభజన తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పొట్లూరి హరికృష్ణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలుగు రక్షణ వేదిక సంస్థ ద్వారా వందలాది మంది కవులను, రచయితలను సత్కరించడం వారి గొప్పతనాన్ని లోకానికి చాటడం ద్వారా తెలుగు భాషాభివృద్ధికి చేయూతనందిస్తున్న హరికృష్ణ... అంతరించిపోతున్న భాషల్లో తెలుగు చేరకుండా అందరూ కృషి చేయాలంటారు. స్ఫూర్తికి ప్రతిరూపం ఉమర్ ముస్లిం కుటుంబంలో జన్మించిన... తెలుగు భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు డాక్టర్ ఉమర్‌ఆలీషా. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆ«ధ్యాత్మిక పీఠం తెలుగు భాషకు ఎనలేని కృషి చేస్తోంది. కేవలం కోస్తా జిల్లాలకు పరిమితమైన ఈ పీఠం కార్యక్రమాలు నవమ పీఠాధిపతులు డా.ఉమర్‌ఆలీషా చేతుల మీదుగా ఈ సంవత్సరమే జిల్లాలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఉమర్ స్ఫూర్తికి ప్రతిరూపంగా భాషావృద్ధికి జిల్లా వాసి పండిట్ రియాజుద్దీన్ అహ్మద్ తోడ్పడుతున్నారు, కాబట్టే ఆయన డా. ఉమర్ ఆలీషా సాహితీ సమితి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై అనేక భాషా కార్యక్రమాలను చేపడుతున్నారు. జిల్లా రచయితకు భాషా పురస్కారం తెలుగులోని ప్రతి ప్రకియను స్పృశించిన సుప్రసిద్ధ కథా రచయిత డా.శాంతి నారాయణ, ఈ ఏడాది ప్రభుత్వం ద్వారా భాషా పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలుగువారికి భాషాభిమానం తక్కువేనని, ఇంటి నుంచే భాష పట్ల అనురక్తి పెరిగాలని అంటున్నారు. నేటి కార్యక్రమాలు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వివిధ సంస్థల వారు భాషాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు భాషకు నీరాజనం పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డా.ఉమర్ ఆలీషా సాహితీ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రఘురామయ్య తెలిపారు. అలాగే తెలుగు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ అనంతరం తెలుగు తల్లి కూడలి వద్ద సమావేశం ఉంటుందని సంస్థ అధ్యక్షులు డా.నారాయణ తెలిపారు. స్థానిక విశాలంధ్ర బుక్ హౌస్‌లో భాషా సాహిత్యాలపై ప్రత్యేక రిబేటును అందిస్తున్నట్టు బుక్ హౌస్ మేనేజర్ చెట్ల ఈరన్న తెలిపారు. తెలుగు భాషా ప్రచారంలో భాగంగా వారం రోజుల పాటు సాగనున్న ఈ ప్రత్యేక ఆఫర్లను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
మన యాస..మన భాష
♦ ‘తెలంగాణ తెలుగు’ను కాపాడుకుందాం ♦ మాండలికం పరిరక్షణకు కృషి జరగాలి ♦ భాషావేత్తల అభిప్రాయం ♦ నేడు అంతర్జాతీయభాషా దినోత్సవం సాక్షి,సిటీబ్యూరో ; భాష...ఒక భావ వ్యక్తీకరణ. హృదయాంతరాల్లో నిక్షిప్తమైన భావోద్వేగాల స్పర్శ. కోపం, బాధ, సంతోషం, ఆనందం, విషాదం, ఆరాధన, ప్రేమ, ఆత్మీయత, అనురాగం, కరుణ, జాలి, దయ, వేదన వంటి భావాలన్నిం టికీ తల్లి ఒడి లాంటిది మాతృభాష. మేధస్సును ప్రతిబింబించేదీ, సరికొత్త ఆలోచనలను ఆవిష్కరించేదీ భాష ఒక్కటే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా అనేక రకాల మనుషులు, సంస్కృతులు, సంప్రదాయాల సమూహమైనట్లే ...అనేక భాషల సమూహం కూడా. ఫిబ్రవరి 21వ తేదీ అంతర్జాతీయ భాషా దినోత్సవం. అంత టా ఆంగ్లమే ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రస్తుత తరుణంలో అంతరించిపోతున్న మాతృభాషలకు పట్టం కట్టేం దుకు, మాతృభాషలను సుసంపన్నం చేసుకొనేందుకు అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ యునె స్కో ప్రపంచ భాషా దినోత్సవానికి పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణకు, వైవిధ్యభరితమైన తెలంగాణ మాండలికాన్ని కాపాడుకొనేం దుకు యావత్ సమాజం సన్నద్ధం కావాల్సి ఉంది. అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... కొత్త సందర్భం.... వందల, వేల సంవత్సరాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వ సంపదగా అందించేది తల్లిభాష ఒక్కటే. తల్లి దండ్రులు, కుటుంబం, పుట్టిపెరిగి న భౌగోళిక పరిస్థితులు, సమాజం నుంచి అలవడే సహజమైన భాష అది. అన్ని భాషలకు ఉన్నట్లే తెలంగాణ తెలుగుకు సైతం ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు తెలంగాణ మాండలికంలో గొప్ప సాహితీ సృజన చేశారు. తమిళం నుంచి మళయాలం విడివడి ఒక భాషగా అభివృద్ధి చెందినట్లే, కొన్ని వందల ఏళ్ల క్రితమే తెలుగు, కన్నడం విడిపోయి రెండు భాషలుగా ఎదిగాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఆవిర్భవించాయి. రెండు రాష్ట్రాల్లోనూ మాతృభాష తెలుగే. ఉమ్మడి రాష్ర్టంలో తెలుగు సంస్కృతీకరణకు గురైం ది. వేల కొద్దీ సంస్కృత పదాలు వ చ్చి చేరాయి. తెలంగాణ మాండలికం మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ తెలుగును, మాండలికాన్ని కాపాడుకొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని భాషావేత్తలు కోరుతున్నారు. తెలంగాణ ప్రజల వాడుకలో ఉన్న 15వేలకు పైగా మాండలిక పదాల ను ఇప్పటికిప్పుడు తెలుగు భాషలో చేర్చి దానిని పరిపుష్టం చేయవలసి ఉందని సూచిస్తున్నారు. తెలు గు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి. తెలంగాణ తెలుగు నిఘంటువు నిర్మాణం కోసం, భాష అభివృద్ధి, విస్తృతి కోసం నిధులు కేటాయించాలి. శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చా కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు, భాషావేత్తలు మాతృభాష పరిరక్షణపై చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల భాషను సృజనాత్మకం చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక భాషలు అంతరించాయి. ఇంకా కొన్ని అంతరించిపోయేందుకు దగ్గర్లో ఉన్నాయి. తెలంగాణ తెలుగు కూడా ఇలాగే కొన ఊపిరితో ఉంది. సురవరం ప్రతాప్‌రెడ్డి, కాళోజీ వంటి ఎందరో కవులు తెలంగాణ మాండలికంలో గొప్ప సాహితీ రచన చేశారు. ‘వాళ్లు కానీ ఈ వైపునకు ఏమై నా వచ్చారా’ అంటే తెలంగాణ వాళ్లకు అర్ధం కాదు. ‘ఆళ్లు గిట్ల ఇక్కడ కానొచ్చిండ్రా..’ అంటేనే అర్ధమవుతుంది. ప్రజల భాషను సృజనాత్మకం చేయాలి. పాలనలో, పత్రికల్లో, రచనల్లో తెలంగాణ భాష, మాండలికం విస్తృతంగా వినియోగించాలి. ప్రాచీన భాషల అభివృద్ధి కోసం కేంద్రం అందజేసే నిధుల ద్వారా ఇక్కడి తెలుగు అభివృద్ధి కోసం ప్రభుత్వం తగిన ప్రణాళికలను, కార్యాచరణను రూపొందించాలి. - ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు,తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు మన భాషలోనే మాట్లాడుకుందాం తెలంగాణ భాష ముప్పావుల వంతు అంతరించింది. ఇక పావులొంతే మిగిలింది. దీన్ని కాపాడుకోవాల్నంటే అందరం తెలంగాణ మాండలికంలోనే మాట్లాడుకోవాలే. రాయాలే. దీన్ని ఎవరికి వాళ్లు తీర్మానం చేసుకోవాలే. తెలంగాణ భాషలో, మాండలికంలో రాయడం చిన్న చూపు అనుకోవద్దు. అలాం టి అభిప్రాయం ఉంటే తీసేసుకోవాలే. సురవరం తెలంగాణ మాండలికంలో సీస పద్యాన్నే రాసిండు. తెలంగాణ భాషలో, యాసలో సినిమాలు తీయాలే. విలన్లకు పరిమితం చేసే సంస్కృతి పోయి, అన్ని పాత్రలు ఈ భాషలోనే మాట్లాడేవిధంగా సినిమాలు నిర్మించాలి. - తెలిదేవర భానుమూర్తి, సీనియర్ పాత్రికేయులు తెలంగాణ తెలుగు శక్తివంతమైంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో ప్రజల పోరాటానికి ఆయుధమైంది ఇక్కడి తెలుగు. తెలంగాణ మాండలికంలోగొప్ప సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యం ప్రజ లను ముందుకు నడిపించింది. అలాంటి శక్తివంతమైన తెలంగాణ తెలుగును కాపాడేందుకు, అభివృద్ధి చేసేం దుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టాలి. ప్రజలు అనేక రూపాల్లో భాషను విని యోగిస్తున్నారు. ఉత్పత్తి సంబంధాల్లో, మానవ సంబంధాలు, చేసే వృత్తుల్లో అనేక రకాలుగా భాష నిక్షిప్తమై ఉంది. అలాంటి భాషనంతా వెలికి తీసి అభివృద్ధి చేయాలి. - గోగు శ్యామల, రచయిత్రి కరికులమ్‌లో మార్పు చేయాలి చిన్నయ సూరి పంచతంత్రం కథల స్థానం లో తెలంగాణ కవులు, రచయితలు రాసిన కథలతో కరికులమ్ రూపొందించాలి. తెలంగాణ భాషను, నుడికారాన్ని మాండలికాన్ని చిన్నప్పటి నుంచే పరిచయం చేసేందుకు ప్రాథమిక విద్య స్థాయిలోనే మార్పులు జరగవలసి ఉంది. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ భాషా వికాసం జరగాలి. ప్రామాణిక భాష ఆధిపత్యం అంతరించాలి. - కోడం కుమార్, రచయిత, తెలుగు భాషా పరిశోధకులు తెలంగాణ అకాడమీ ఏర్పాటు చేయాలి తెలంగాణ భాష అభివృద్ధి కోసం వెంటనే తెలంగాణ అకాడమీని ఏర్పాటు చేయాలి. తెలంగాణ భాష వ్యాకరణం, నిఘంటువు రూపొందించాలి. ప్రతి జిల్లాలో భాషా అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని 10 జిల్లాల్లో ప్రజలు మాట్లాడుకొనే భాషను, పదజాలాన్ని కాపాడేందుకు ఈ సంస్థలు కృషి చేయా లి. ప్రభుత్వంతో పాటు కవులు, రచయితలు కూడా భాషాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. - కొల్లాపురం విమల, భాషావేత్త