గన్‌ఫౌండ్రీ: శాంతియుత పోరాటాలతో ఫలితం రానప్పుడు ప్రజలు హింసాత్మక పంథా ఎంచుకుంటారని తన కవితల ద్వారా చెప్పిన వ్యక్తి కాళోజీ అని విరసం నేత వరవరరావు అన్నారు. తన కవితలతో ప్రజల్లో చైతన్యం కలిగించారని చెప్పారు. సోమవారం నిజాం కళాశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆధ్వర్యంలో కాళోజీ స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. వరవరరావు కీలక ఉపన్యాసం చేస్తూ కాళోజీ చిన్న నాటి నుంచే ప్రజల తరపున కవిత్వాలు రాసే వారని అన్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని భాషా దినోత్సవంగా నిర్వహించడం ఆనందకరమన్నారు. పలుకుబడుల భాషను పూర్తి స్థాయిలో తీసుకువచ్చినప్పుడు ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ వర్సిటీలో మరిన్ని ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ప్రవేశపెట్టిన కాళోజీ బంగారు పతకాన్ని బీఏ తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన ప్రకాశ్ అనే విద్యార్థికి ప్రదానం చేశారు. నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహమాన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్, నిజాం కళాశాల తెలుగుశాఖ ప్రొఫెసర్లు కాసీం, డాక్టర్ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.