పశ్చిమబెంగాల్‌లో మొత్తం ఆరింటినీ గెల్చుకున్న టీఎంసీ
న్యూఢిల్లీ: పదమూడు రాష్ట్రాల్లో 46 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే కైవసం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తమ స్థానాలను మళ్లీ గెల్చుకున్నాయి. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. అత్యధికంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు 26 చోట్ల గెలిచాయి. ఇవి గతంలో పోలిస్తే అదనంగా తొమ్మిది స్థానాల్లో గెలవడం విశేషం. కాంగ్రెస్ ఏడు చోట్ల గెలిచింది. గతంలో గెలిచిన స్థానాల్లో ఆరింటిని చేజార్చుకుంది.
పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఐదు స్థానాలను నిలబెట్టుకున్న టీఎంసీ ఈసారి మదారిహాట్‌ను బీజేపీ నుంచి లాగేసుకుంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో జూనియర్ వైద్యురాలి రేప్, హత్యోదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైనాసరే ఆ అంశం రాష్ట్రంలో టీఎంసీ హవాను ఆపలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు చోట్ల, సమాజ్‌వాదీ పార్టీ రెండు చోట్ల గెలిచాయి. కేరళలో ఎల్‌డీఎఫ్ కూటమిలోని సీపీఐ(ఎం) పార్టీ, రాజస్థాన్‌లో భారత్ ఆదివాసీ పార్టీ(బీఏపీ) పార్టీ ఒక్కో స్థానంలో జయకేతనం ఎగరేశాయి.
యూపీలో బీజేపీ హవా
ఉత్తరప్రదేశ్‌లో 9 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీ ఆరు చోట్ల విజయం సాధించింది. రాష్ట్రంలోని కుందార్కీ, ఘజియాబాద్, ఖేర్, ఫూల్‌పూర్, ఖతేహరీ, మఝావాన్‌లో బీజేపీ గెలిచింది. కర్హాల్, సిషామావూలలో సమాజ్‌వాదీ పార్టీ, మీరాపూర్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ విజయం సాధించాయి. కుందార్కీ స్థానంలో 12 మంది పోటీచేస్తే అందులో 11 మంది ముస్లిం అభ్యర్థులే. ఈ 11 మంది అభ్యర్థుల్ని వెనక్కి నెట్టి ఏకైక హిందూ అభ్యరి్థ, బీజేపీ నేత రామ్‌వీర్ సింగ్ ఏకంగా 1,44,791 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. 1993 నుంచి చూస్తే ఈ స్థానంలో బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. ఖతేహరీలోనూ 1991 తర్వాత బీజేపీకి తొలిసారిగా విజయం దక్కింది.
రెండూ క్రాంతికారీకే
సిక్కింలోని రెండు స్థానాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెల్చుకుంది. రాజస్థాన్‌లో అధికార బీజేపీ ఏడింటికిగాను ఐదు చోట్ల జయపతాకం ఎగరేసింది. అస్సాంలోని ఐదు స్థానాలనూ బీజేపీ, దాని మిత్రపక్షాలే గెల్చుకున్నాయి. బీజేపీ మూడు చోట్ల, అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ(యునైటెడ్) ఒక్క స్థానంలో గెలిచాయి. పంజాబ్‌లోని నాలుగు స్థానాల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ తన వశంచేసుకుంది.
బిహార్‌లోని నాలుగు స్థానాలకుగాను రెండు చోట్ల బీజేపీ, ఒక చోట హిందుస్తానీ ఆవామ్ మోర్చా, మరో చోట జనతాదళ్(యునైటెడ్) గెలిచాయి. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్‌కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థులు దాదాపు అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. కర్ణాటకలోని మొత్తం మూడు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ గిద్దెర్‌బహాలో ఓడారు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సతీమణి అమృత, గుర్‌దాస్‌పూర్ ఎంపీ సుఖ్‌జీందర్ రంధావా భార్య జతీందర్ కౌర్ సైతం ఓడారు.
ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు
Comments
Please login to add a commentAdd a comment