west bengal election
-
ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా
న్యూఢిల్లీ: పదమూడు రాష్ట్రాల్లో 46 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే కైవసం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తమ స్థానాలను మళ్లీ గెల్చుకున్నాయి. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. అత్యధికంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు 26 చోట్ల గెలిచాయి. ఇవి గతంలో పోలిస్తే అదనంగా తొమ్మిది స్థానాల్లో గెలవడం విశేషం. కాంగ్రెస్ ఏడు చోట్ల గెలిచింది. గతంలో గెలిచిన స్థానాల్లో ఆరింటిని చేజార్చుకుంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఐదు స్థానాలను నిలబెట్టుకున్న టీఎంసీ ఈసారి మదారిహాట్ను బీజేపీ నుంచి లాగేసుకుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో జూనియర్ వైద్యురాలి రేప్, హత్యోదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైనాసరే ఆ అంశం రాష్ట్రంలో టీఎంసీ హవాను ఆపలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు చోట్ల, సమాజ్‌వాదీ పార్టీ రెండు చోట్ల గెలిచాయి. కేరళలో ఎల్డీఎఫ్ కూటమిలోని సీపీఐ(ఎం) పార్టీ, రాజస్థాన్‌లో భారత్ ఆదివాసీ పార్టీ(బీఏపీ) పార్టీ ఒక్కో స్థానంలో జయకేతనం ఎగరేశాయి. యూపీలో బీజేపీ హవా ఉత్తరప్రదేశ్‌లో 9 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీ ఆరు చోట్ల విజయం సాధించింది. రాష్ట్రంలోని కుందార్కీ, ఘజియాబాద్, ఖేర్, ఫూల్పూర్, ఖతేహరీ, మఝావాన్లో బీజేపీ గెలిచింది. కర్హాల్, సిషామావూలలో సమాజ్‌వాదీ పార్టీ, మీరాపూర్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ విజయం సాధించాయి. కుందార్కీ స్థానంలో 12 మంది పోటీచేస్తే అందులో 11 మంది ముస్లిం అభ్యర్థులే. ఈ 11 మంది అభ్యర్థుల్ని వెనక్కి నెట్టి ఏకైక హిందూ అభ్యరి్థ, బీజేపీ నేత రామ్‌వీర్ సింగ్ ఏకంగా 1,44,791 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. 1993 నుంచి చూస్తే ఈ స్థానంలో బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. ఖతేహరీలోనూ 1991 తర్వాత బీజేపీకి తొలిసారిగా విజయం దక్కింది. రెండూ క్రాంతికారీకే సిక్కింలోని రెండు స్థానాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెల్చుకుంది. రాజస్థాన్‌లో అధికార బీజేపీ ఏడింటికిగాను ఐదు చోట్ల జయపతాకం ఎగరేసింది. అస్సాంలోని ఐదు స్థానాలనూ బీజేపీ, దాని మిత్రపక్షాలే గెల్చుకున్నాయి. బీజేపీ మూడు చోట్ల, అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ(యునైటెడ్) ఒక్క స్థానంలో గెలిచాయి. పంజాబ్‌లోని నాలుగు స్థానాల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ తన వశంచేసుకుంది. బిహార్‌లోని నాలుగు స్థానాలకుగాను రెండు చోట్ల బీజేపీ, ఒక చోట హిందుస్తానీ ఆవామ్ మోర్చా, మరో చోట జనతాదళ్(యునైటెడ్) గెలిచాయి. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్‌కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థులు దాదాపు అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. కర్ణాటకలోని మొత్తం మూడు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ గిద్దెర్బహాలో ఓడారు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సతీమణి అమృత, గుర్దాస్పూర్ ఎంపీ సుఖ్జీందర్ రంధావా భార్య జతీందర్ కౌర్ సైతం ఓడారు. ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు -
బెంగాల్ పోల్ షెడ్యూల్‌పై వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను ఏడు విడతలకు విస్తరించడం, రంజాన్ మాసం సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం వెనక కుట్ర ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ విమర్శించం ఎంత మేరకు సబబు ? కేంద్ర బలగాల బందోబస్తు మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడేందుకు, రంజాన్ మాసం ఉపావాస దీక్షలో ఉండే ముస్లింలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండదన్న ఉద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్‌ను ఇలా ఖరారు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు? ఆమె వాదనలో నిజం ఎంత ? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహిస్తుండగా, ఒడిశాలో నాలుగు విడతలుగా ఎందుకు నిర్వహిస్తున్నారని, రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ కూడా ప్రశ్నించారు. 2014లో ఒడిశాలో రెండు విడతలుగా ఎన్నికలను నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పటికి ఇప్పటికీ ఒడిశా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల్లో పెద్ద మార్పేమి లేదని అన్నారు. ఇక మహారాష్ట్రలో గత ఎన్నికల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించగా, ఈసారి నాలుగు విడతలకు విస్తరించాల్సిన అవసరం ఏమొచ్చిందిని ఆయన ప్రశ్నించారు. ఇరుగుపొరుగునున్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించగా, ఈసారి రెండు రాష్ట్రాల పోలింగ్ మధ్య నెల రోజుల విరామం ఎందుకు వచ్చిందని మరో ప్రశ్న. వివిధ రాష్ట్రాల్లోని శాంతి భద్రతల పరిస్థితులను, అందుబాటులో ఉన్న కేంద్ర బలగాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు ఎన్నికల వర్గాలు చెబుతున్నాయి. రంజాన్ మాసం గురించి వారేం చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండే రాష్ట్ర గవర్నర్ల నుంచి ఎలా కావాలంటే అలా నివేదికలు తెప్పించుకోవచ్చని మమతా బెనర్జీ విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో నాలుగు విడతల్లో నిర్వహించినప్పుడు ఇప్పుడు ఏడు విడతలకు విస్తరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది ఆమె ప్ర«శ్న. గతంతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి నిజంగానే బాగా లేదు. తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు పెరిగాయి. మూడు, నాలుగు సార్లు మత ఘర్షణలు కూడా చెలరేగాయి. పోలింగ్ సందర్భంగా సరైన భద్రత లేకపోయినట్లయితే రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పాలకపక్షానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. 1972లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 216 సీట్లను గెలుచుకోగా, సీపీఐ 35. సీపీఎం 14 సీట్లను గెలుచుకున్నాయి. 2018లో బెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడోవంతు పంచాయతీలకు పోటీ లేకుండానే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. నామినేషన్లు దాఖలు చేయకుండా తమను అడ్డుకోవడం వల్లనే తాము పోటీ చేయలేకపోయామని పలువురు ప్రతిపక్ష నాయకులు నాడు ఆరోపణలు చేశారు. రంజాన్ సందర్భంగా గతంలోనూ ఎన్నికలు 2013లో బెంగాల్ పంచాయతీ ఎన్నికలు రంజాన్ మాసం సందర్భంగానే జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు రంజాన్ మాసం సందర్భంగానే జరిగాయి. ఆ ఎన్నికల్లో ముస్లింలు భారీగా పోలింగ్‌లో పాల్గొనడంతో పాలకపక్ష బీజేపీ అభ్యర్థి మగాంక సింగ్ ఓడిపోయారు. రంజాన్ మాసం సందర్భంగా దిన చర్యకు ఎలాంటి భంగం ఉండదని, అలాంటప్పుడు పోలింగ్‌లో పాల్గొనడానికి ఎందుకు అభ్యంతరం ఉంటుందని హైదరాబాద్ ఎంపీ ఒవైసీ సోమవారం వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. -
మమతా బెనర్జీకే పట్టం
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికార నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మమతా బెనర్జీ రెండో పర్యాయం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారని పేర్కొన్నాయి. బెంగాల్ లోని 294 అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ 178, వామపక్ష కూటమి 110 సీట్లు గెల్చుకునే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ ఆనంద్ సర్వే వెల్లడించింది. బీజేపీ ఖాతా తెరవనుందని తెలిపింది. ఇతరులు 5 స్థానాలు దక్కించుకుంటారని అంచనా వేసింది. తృణమూల్ 167, సీపీఎం 75, కాంగ్రెస్ 45, బీజేపీ 4, ఇతరులు 3 చోట్ల గెలుపొందే అవకాశాలు ఉన్నాయని సీఓటర్ సర్వే తెలిపింది. తృణమూల్ 233-253, వామపక్ష కూటమి 38-51, బీజేపీ 1-5 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని బెంగాల్ ఇండియా టుడే సర్వే వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 19న ఓట్లు లెక్కించనున్నారు.