బెంగాల్‌ పోల్‌ షెడ్యూల్‌పై వివాదం | Controversy on Bengal Poll Schedule | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ పోల్‌ షెడ్యూల్‌పై వివాదం

Published Tue, Mar 12 2019 2:33 PM | Last Updated on Tue, Mar 12 2019 3:38 PM

Controversy on Bengal Poll Schedule - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను ఏడు విడతలకు విస్తరించడం, రంజాన్‌ మాసం సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం వెనక కుట్ర ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ విమర్శించం ఎంత మేరకు సబబు ? కేంద్ర బలగాల బందోబస్తు మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడేందుకు, రంజాన్‌ మాసం ఉపావాస దీక్షలో ఉండే ముస్లింలు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండదన్న ఉద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్‌ను ఇలా ఖరారు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు? ఆమె వాదనలో నిజం ఎంత ?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్‌ నిర్వహిస్తుండగా, ఒడిశాలో నాలుగు విడతలుగా ఎందుకు నిర్వహిస్తున్నారని, రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌ కూడా ప్రశ్నించారు. 2014లో ఒడిశాలో రెండు విడతలుగా ఎన్నికలను నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పటికి ఇప్పటికీ ఒడిశా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల్లో పెద్ద మార్పేమి లేదని అన్నారు. ఇక మహారాష్ట్రలో గత ఎన్నికల్లో మూడు విడతలుగా పోలింగ్‌ నిర్వహించగా, ఈసారి నాలుగు విడతలకు విస్తరించాల్సిన అవసరం ఏమొచ్చిందిని ఆయన ప్రశ్నించారు. ఇరుగుపొరుగునున్న  హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో ఒకే రోజు పోలింగ్‌ నిర్వహించగా, ఈసారి రెండు రాష్ట్రాల పోలింగ్‌ మధ్య నెల రోజుల విరామం ఎందుకు వచ్చిందని మరో ప్రశ్న.

వివిధ రాష్ట్రాల్లోని శాంతి భద్రతల పరిస్థితులను, అందుబాటులో ఉన్న కేంద్ర బలగాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు ఎన్నికల వర్గాలు చెబుతున్నాయి. రంజాన్‌ మాసం గురించి వారేం చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండే రాష్ట్ర గవర్నర్ల నుంచి ఎలా కావాలంటే అలా నివేదికలు తెప్పించుకోవచ్చని మమతా బెనర్జీ విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో నాలుగు విడతల్లో నిర్వహించినప్పుడు ఇప్పుడు ఏడు విడతలకు విస్తరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది ఆమె ప్ర«శ్న. గతంతో పోలిస్తే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి నిజంగానే బాగా లేదు. తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు పెరిగాయి. మూడు, నాలుగు సార్లు మత ఘర్షణలు కూడా చెలరేగాయి.

పోలింగ్‌ సందర్భంగా సరైన భద్రత లేకపోయినట్లయితే రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పాలకపక్షానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. 1972లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 216 సీట్లను గెలుచుకోగా, సీపీఐ 35. సీపీఎం 14 సీట్లను గెలుచుకున్నాయి. 2018లో బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడోవంతు పంచాయతీలకు పోటీ లేకుండానే తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. నామినేషన్లు దాఖలు చేయకుండా తమను అడ్డుకోవడం వల్లనే తాము పోటీ చేయలేకపోయామని పలువురు ప్రతిపక్ష నాయకులు నాడు ఆరోపణలు చేశారు. 

రంజాన్‌ సందర్భంగా గతంలోనూ ఎన్నికలు 
2013లో బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు రంజాన్‌ మాసం సందర్భంగానే జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు రంజాన్‌ మాసం సందర్భంగానే జరిగాయి. ఆ ఎన్నికల్లో ముస్లింలు భారీగా పోలింగ్‌లో పాల్గొనడంతో పాలకపక్ష బీజేపీ అభ్యర్థి మగాంక సింగ్‌ ఓడిపోయారు. రంజాన్‌ మాసం సందర్భంగా దిన చర్యకు ఎలాంటి భంగం ఉండదని, అలాంటప్పుడు పోలింగ్‌లో పాల్గొనడానికి ఎందుకు అభ్యంతరం ఉంటుందని హైదరాబాద్‌ ఎంపీ ఒవైసీ సోమవారం వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement