∙భాషారత్న జ్ఞాపికతో... ; విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పురస్కార ప్రదానం సందర్భంగా...
కొండూరు కుసుమారెడ్డి... ఏడున్నర దశాబ్దాల జీవనయానంలో ఆమె కలం నుంచి ఇరవై రచనలు జాలువారాయి. ఓనమాలు దిద్దిన నాటి నుంచి నేటి వరకు అక్షరంతో మమేకమై సాగుతున్న సాహిత్యసేవకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అధికార భాషా దినోత్సవం’ సందర్భంగా (ఆగస్టు 29) ఆమెను ‘భాషారత్న’ పురస్కారంతో గౌరవించింది. ఆ విశేషాలను, తన సాహిత్య ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె.
‘‘మాది నెల్లూరు జిల్లా, కావలి పట్టణం. మా నాన్న జయరామిరెడ్డి హైస్కూల్ హెడ్‌మాస్టర్, అమ్మ శంకరమ్మ గృహిణి. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు కావలిలో చదివాను. గుంటూరు, నల్లపాడు (ఆంధ్ర విశ్వవిద్యాలయం)లో పీజీ చేసిన తర్వాత ఎంఫిల్‌కి హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. లింగ్విస్టిక్స్‌లో పీజీ డిప్లమో, రెండు పీహెచ్‌డీలు ఉస్మానియాలోనే చేశాను. వారణాసి, సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీ నుంచి డీలిట్ చేసి ‘వాచస్పతి’ బిరుదు పొందాను.
ఉస్మానియాలో 1974లో విద్యార్థిగా అడుగు పెట్టిన నేను 1979లో లెక్చరర్‌నయ్యాను. పదోన్నతులతో ప్రొఫెసర్ హోదాలో తెలుగు శాఖాధిపతిగా విధులు నిర్వర్తించి 2008లో రిటైరయ్యాను. ఆ రిటైర్‌మెంట్ ఉస్మానియా నుంచి మాత్రమే. ఆ మరునాటి నుంచి ట్రిపుల్ ఐటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్) బాధ్యతలు స్వీకరించాను. ట్రిపుల్ ఐటీ రూపకల్పన నుంచి ఆరేళ్లపాటు ఆ విధుల్లో ఉన్నాను.
ఇప్పుడు కూడా ఉద్యోగపరంగా విశ్రాంత జీవితమే కానీ, చదవడానికి రాయడానికి విశ్రాంతి తీసుకోలేదు. విషయశోధన చేస్తూనే ఉన్నాను, రాస్తూనే ఉన్నాను. పంతొమ్మిది గ్రంథాలు ప్రచురితమయ్యాయి. ఐసీహెచ్‌ఆర్ నుంచి ‘సీనియర్ అకడమిక్ ఫెలో’ అందుకున్న రచన (కల్చరల్ లైఫ్ ఆఫ్ తెలంగాణ ట్రైబ్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు డాన్స్, మ్యూజిక్ అండ్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్) తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రచురణ దశలో ఉంది.
అన్నీ అధ్యయన భరితాలే!
నేను కాలక్షేపం కోసం ఏదీ రాయలేదు. కాలక్షేపంగా చదువుకోవడానికీ రాయలేదు. ప్రతిదీ సమగ్రమైన పరిశోధన, శాస్త్ర పూర్వక అధ్యయనంతో రాసినవే. నా రచనలన్నీ జీవితగమనానికి సూచికలవంటివే. నా పర్యవేక్షణలో 30 మందికి పైగా విద్యార్థులు పీహెచ్‌డీలు చేశారు. నేను పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలతోపాటు, నా విద్యార్థులకు గైడ్ చేస్తున్న క్రమంలో నాకు ఓ విషయం స్పష్టంగా తెలిసి వచ్చింది.
అప్పటి వరకు పరిశోధన చేసే వాళ్లకు ఒక మెథడాలజీ లేదు. ఆ లోటును భర్తీ చేయడానికి ఆచార్య ఎం. కులశేఖరరావుతో కలిసి ‘సాహిత్య పరిశోధన పద్ధతులు’ రాశాను. ఇలాగే నా ప్రతి రచన వెనుక బలమైన కారణం, ఉపయుక్తత ఉన్నాయి. తంజావూరులోని సరస్వతి మహల్ గ్రంథాలయం ప్రభావం నా రచనల మీద ఎక్కువగా ఉంది. నెల రోజుల పాటు అక్కడే ఉండి తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చేసి నోట్స్ రాసుకున్నాను.
రంగాజమ్మ స్ఫూర్తి!
ఎంఫిల్ అంశంగా రంగాజమ్మను తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. ఆమె ఎనిమిది భాషల్లో ప్రావీణ్యం ఉన్న తెలుగు కవయిత్రి. కనకాభిషేక గౌరవం అందుకున్న ఏకైక మహిళ. తంజావూరు నాయక రాజుల ఆస్థానంలో ఆమెకి గొప్ప స్థానం ఉండేది. నా మీద ఆమె ప్రభావం కూడా ఉందనే చెప్పాలి. ఆమెలాగే నేను కూడా నా రంగంలో విశేషంగా కృషి చేయాలని, అత్యున్నత స్థాయికి చేరాలనే ఆకాంక్ష నాకు తెలియకుండానే కలిగింది. సంస్కృతంలో డీలిట్ చేయడం ద్వారా వాచస్పతి బిరుదు పొందిన తొలి తెలుగు వ్యక్తినయ్యాను. ఇప్పటికీ ఆ బిరుదు సాధించిన ఏకైక తెలుగు మహిళను నేనే.
జ్ఞానం భావితరాలకు అందాలి!
వార్తా పత్రికల్లో వ్యాసాలు రాశాను. వ్యక్తిత్వ వికాసం క్లాసులకు మూలం మన భగవద్గీత. ఒక్కో శ్లోకాన్ని నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉదాహరణలతో రాసిన గీతాయోగం నన్ను యూనివర్సిటీ పరిధి నుంచి బయటకు తెచ్చింది. గీతాయోగం ద్వారా సాధారణ పాఠకులకు కూడా పరిచయమయ్యాను. మొత్తంగా నేను రాసిన పుస్తకాల లెక్క చెప్పగలను, కానీ ఎన్ని గ్రంథాలను చదివాననే ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉండదు.
మన ప్రాచీన గ్రంథాల్లో గణితం, రాజనీతి, ధర్మ అర్థశాస్త్రాలు, వైద్యం, ధనుర్విద్య, ఖడ్గలక్షణ శాస్త్రాది యుద్ధ నైపుణ్యాలన్నీ సమగ్రంగా ఉన్నాయి. నృత్యకళ అత్యున్నత స్థాయిలో ఉండేది. చాలా నాట్యరీతులు అంతరించి పోయాయి. వాటిని వివరించే సాహిత్యం కూడా చేజారిపోతోంది. వాటి పునరుద్ధరణకు మార్గదర్శనం చేయగలిగిన రచనలు చేశాను. నాకు నేనుగా నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించాను.
భావితరాల కోసం ఓ బృహత్తర ప్రణాళిక నా మదిలో ఉంది. అది... మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్న జ్ఞానాన్ని డిజిటలైజ్ చేసి ప్రాచీన సాహిత్య శాస్త్ర గ్రంథాలన్నింటితో ఒక డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఉంది. మన ప్రాచీన గ్రంథాల పట్ల చాలామందికి ఆసక్తి ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాల కారణంగా తంజావూరు, ఇతర గ్రంథాలయాలకు వెళ్లి తాళపత్ర గ్రంథాలను, ప్రాచీన రచనలను అధ్యయనం చేయగలిగిన సమయం ఉండదు. అలాంటి వారికి ఈ ప్రయత్నం మేలు చేస్తుంది. అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌లోనే చదువుకోవచ్చు.
అమెరికా నుంచి సాఫ్ట్‌వేర్ నిపుణులు ఒకరు ఫోన్ చేసి ‘భీమఖండంలో ఒక శాస్త్రీయ విషయముందని, పరిశోధన కోసం ఆ పుస్తకం ఒక కాపీ కావాల’ని అడిగారు. డిజిటలైజ్ చేస్తే మనదేశం నుంచి అమెరికాకు పుస్తకాన్ని పంపించాల్సిన ప్రయాస అక్కరలేదు. వందేళ్లు దాటిన పుస్తకాలు కూడా ఆదరణకు నోచుకోకుండా పడి ఉన్నాయి. వాటన్నింటినీ భావితరాలకు అందించడానికి ఏమి చేయాలి, ఎలా చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఇటీవల విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలిగా నియమించినట్లు అధికారులు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా నా ఆలోచనలకు ఒక రూపం తీసుకురావచ్చనే ఉత్సాహం కలిగింది’’ అన్నారు వాచస్పతి కొండూరి కుసుమారెడ్డి.
రోజుకు పదిగంటలు!
బోధన వృత్తిలో ఉన్నంత కాలం నా దినచర్య ఒకేక్రమంలో సాగింది. నాలుగు గంటలు పాఠాలు చెప్పడానికి, రెండు గంటలు ప్రిపరేషన్‌కి. ప్రయాణం ఒక గంట. ఈ ఏడు గంటలు ఉద్యోగం కోసం. ఇవన్నీ పూర్తయిన తర్వాత మూడు గంటల సేపు పుస్తకాలు చదవడానికి, రాసుకోవడానికి పట్టేది. రోజుకు దాదాపు పదిగంటలు అక్షరాల మధ్యనే గడిచేది. మా తమ్ముడి భార్య వాణి నాకు ఇంటి బాధ్యతలేవీ లేకుండా చూసుకునేది. నాకు సన్మానాలు జరుగుతుంటే తనకే జరిగినంత సంతోషపడేది.
నా కోసం అతిథులు వస్తే తన పుట్టింటి వాళ్లు వచ్చినంత సంబరపడుతూ వాళ్లకు అన్నీ అమర్చి పెట్టేది. మా నాన్న కవి అనే విషయం ఆయన పోయిన తర్వాత కానీ మాకు తెలియలేదు. ఆయన పుస్తకాలన్నీ తీసి సర్దుతుంటే ‘రుద్రీయము’ చేతిరాత ప్రతి దొరికింది. కాకతీయ రాజు రుద్రదేవుడి చరిత్రను ఆయన పద్యకావ్యంగా రాశారు. ఆ పుస్తకాన్ని పరిష్కరించి ప్రచురించడం, ఆయన కవి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేయడం నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకం.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు : సీహెచ్ మోహనాచారి
Comments
Please login to add a commentAdd a comment