sahitya sabha
-
అక్షర కుసుమం: వాచస్పతి కుసుమారెడ్డి
కొండూరు కుసుమారెడ్డి... ఏడున్నర దశాబ్దాల జీవనయానంలో ఆమె కలం నుంచి ఇరవై రచనలు జాలువారాయి. ఓనమాలు దిద్దిన నాటి నుంచి నేటి వరకు అక్షరంతో మమేకమై సాగుతున్న సాహిత్యసేవకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అధికార భాషా దినోత్సవం’ సందర్భంగా (ఆగస్టు 29) ఆమెను ‘భాషారత్న’ పురస్కారంతో గౌరవించింది. ఆ విశేషాలను, తన సాహిత్య ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ‘‘మాది నెల్లూరు జిల్లా, కావలి పట్టణం. మా నాన్న జయరామిరెడ్డి హైస్కూల్ హెడ్మాస్టర్, అమ్మ శంకరమ్మ గృహిణి. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు కావలిలో చదివాను. గుంటూరు, నల్లపాడు (ఆంధ్ర విశ్వవిద్యాలయం)లో పీజీ చేసిన తర్వాత ఎంఫిల్కి హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. లింగ్విస్టిక్స్‌లో పీజీ డిప్లమో, రెండు పీహెచ్‌డీలు ఉస్మానియాలోనే చేశాను. వారణాసి, సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీ నుంచి డీలిట్ చేసి ‘వాచస్పతి’ బిరుదు పొందాను. ఉస్మానియాలో 1974లో విద్యార్థిగా అడుగు పెట్టిన నేను 1979లో లెక్చరర్నయ్యాను. పదోన్నతులతో ప్రొఫెసర్ హోదాలో తెలుగు శాఖాధిపతిగా విధులు నిర్వర్తించి 2008లో రిటైరయ్యాను. ఆ రిటైర్మెంట్ ఉస్మానియా నుంచి మాత్రమే. ఆ మరునాటి నుంచి ట్రిపుల్ ఐటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్) బాధ్యతలు స్వీకరించాను. ట్రిపుల్ ఐటీ రూపకల్పన నుంచి ఆరేళ్లపాటు ఆ విధుల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా ఉద్యోగపరంగా విశ్రాంత జీవితమే కానీ, చదవడానికి రాయడానికి విశ్రాంతి తీసుకోలేదు. విషయశోధన చేస్తూనే ఉన్నాను, రాస్తూనే ఉన్నాను. పంతొమ్మిది గ్రంథాలు ప్రచురితమయ్యాయి. ఐసీహెచ్ఆర్ నుంచి ‘సీనియర్ అకడమిక్ ఫెలో’ అందుకున్న రచన (కల్చరల్ లైఫ్ ఆఫ్ తెలంగాణ ట్రైబ్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు డాన్స్, మ్యూజిక్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్) తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రచురణ దశలో ఉంది. అన్నీ అధ్యయన భరితాలే! నేను కాలక్షేపం కోసం ఏదీ రాయలేదు. కాలక్షేపంగా చదువుకోవడానికీ రాయలేదు. ప్రతిదీ సమగ్రమైన పరిశోధన, శాస్త్ర పూర్వక అధ్యయనంతో రాసినవే. నా రచనలన్నీ జీవితగమనానికి సూచికలవంటివే. నా పర్యవేక్షణలో 30 మందికి పైగా విద్యార్థులు పీహెచ్‌డీలు చేశారు. నేను పీహెచ్డీ చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలతోపాటు, నా విద్యార్థులకు గైడ్ చేస్తున్న క్రమంలో నాకు ఓ విషయం స్పష్టంగా తెలిసి వచ్చింది. అప్పటి వరకు పరిశోధన చేసే వాళ్లకు ఒక మెథడాలజీ లేదు. ఆ లోటును భర్తీ చేయడానికి ఆచార్య ఎం. కులశేఖరరావుతో కలిసి ‘సాహిత్య పరిశోధన పద్ధతులు’ రాశాను. ఇలాగే నా ప్రతి రచన వెనుక బలమైన కారణం, ఉపయుక్తత ఉన్నాయి. తంజావూరులోని సరస్వతి మహల్ గ్రంథాలయం ప్రభావం నా రచనల మీద ఎక్కువగా ఉంది. నెల రోజుల పాటు అక్కడే ఉండి తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చేసి నోట్స్ రాసుకున్నాను. రంగాజమ్మ స్ఫూర్తి! ఎంఫిల్ అంశంగా రంగాజమ్మను తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. ఆమె ఎనిమిది భాషల్లో ప్రావీణ్యం ఉన్న తెలుగు కవయిత్రి. కనకాభిషేక గౌరవం అందుకున్న ఏకైక మహిళ. తంజావూరు నాయక రాజుల ఆస్థానంలో ఆమెకి గొప్ప స్థానం ఉండేది. నా మీద ఆమె ప్రభావం కూడా ఉందనే చెప్పాలి. ఆమెలాగే నేను కూడా నా రంగంలో విశేషంగా కృషి చేయాలని, అత్యున్నత స్థాయికి చేరాలనే ఆకాంక్ష నాకు తెలియకుండానే కలిగింది. సంస్కృతంలో డీలిట్ చేయడం ద్వారా వాచస్పతి బిరుదు పొందిన తొలి తెలుగు వ్యక్తినయ్యాను. ఇప్పటికీ ఆ బిరుదు సాధించిన ఏకైక తెలుగు మహిళను నేనే. జ్ఞానం భావితరాలకు అందాలి! వార్తా పత్రికల్లో వ్యాసాలు రాశాను. వ్యక్తిత్వ వికాసం క్లాసులకు మూలం మన భగవద్గీత. ఒక్కో శ్లోకాన్ని నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉదాహరణలతో రాసిన గీతాయోగం నన్ను యూనివర్సిటీ పరిధి నుంచి బయటకు తెచ్చింది. గీతాయోగం ద్వారా సాధారణ పాఠకులకు కూడా పరిచయమయ్యాను. మొత్తంగా నేను రాసిన పుస్తకాల లెక్క చెప్పగలను, కానీ ఎన్ని గ్రంథాలను చదివాననే ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉండదు. మన ప్రాచీన గ్రంథాల్లో గణితం, రాజనీతి, ధర్మ అర్థశాస్త్రాలు, వైద్యం, ధనుర్విద్య, ఖడ్గలక్షణ శాస్త్రాది యుద్ధ నైపుణ్యాలన్నీ సమగ్రంగా ఉన్నాయి. నృత్యకళ అత్యున్నత స్థాయిలో ఉండేది. చాలా నాట్యరీతులు అంతరించి పోయాయి. వాటిని వివరించే సాహిత్యం కూడా చేజారిపోతోంది. వాటి పునరుద్ధరణకు మార్గదర్శనం చేయగలిగిన రచనలు చేశాను. నాకు నేనుగా నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించాను. భావితరాల కోసం ఓ బృహత్తర ప్రణాళిక నా మదిలో ఉంది. అది... మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్న జ్ఞానాన్ని డిజిటలైజ్ చేసి ప్రాచీన సాహిత్య శాస్త్ర గ్రంథాలన్నింటితో ఒక డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఉంది. మన ప్రాచీన గ్రంథాల పట్ల చాలామందికి ఆసక్తి ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాల కారణంగా తంజావూరు, ఇతర గ్రంథాలయాలకు వెళ్లి తాళపత్ర గ్రంథాలను, ప్రాచీన రచనలను అధ్యయనం చేయగలిగిన సమయం ఉండదు. అలాంటి వారికి ఈ ప్రయత్నం మేలు చేస్తుంది. అరచేతిలోని స్మార్ట్ ఫోన్లోనే చదువుకోవచ్చు. అమెరికా నుంచి సాఫ్ట్వేర్ నిపుణులు ఒకరు ఫోన్ చేసి ‘భీమఖండంలో ఒక శాస్త్రీయ విషయముందని, పరిశోధన కోసం ఆ పుస్తకం ఒక కాపీ కావాల’ని అడిగారు. డిజిటలైజ్ చేస్తే మనదేశం నుంచి అమెరికాకు పుస్తకాన్ని పంపించాల్సిన ప్రయాస అక్కరలేదు. వందేళ్లు దాటిన పుస్తకాలు కూడా ఆదరణకు నోచుకోకుండా పడి ఉన్నాయి. వాటన్నింటినీ భావితరాలకు అందించడానికి ఏమి చేయాలి, ఎలా చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఇటీవల విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలిగా నియమించినట్లు అధికారులు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా నా ఆలోచనలకు ఒక రూపం తీసుకురావచ్చనే ఉత్సాహం కలిగింది’’ అన్నారు వాచస్పతి కొండూరి కుసుమారెడ్డి. రోజుకు పదిగంటలు! బోధన వృత్తిలో ఉన్నంత కాలం నా దినచర్య ఒకేక్రమంలో సాగింది. నాలుగు గంటలు పాఠాలు చెప్పడానికి, రెండు గంటలు ప్రిపరేషన్‌కి. ప్రయాణం ఒక గంట. ఈ ఏడు గంటలు ఉద్యోగం కోసం. ఇవన్నీ పూర్తయిన తర్వాత మూడు గంటల సేపు పుస్తకాలు చదవడానికి, రాసుకోవడానికి పట్టేది. రోజుకు దాదాపు పదిగంటలు అక్షరాల మధ్యనే గడిచేది. మా తమ్ముడి భార్య వాణి నాకు ఇంటి బాధ్యతలేవీ లేకుండా చూసుకునేది. నాకు సన్మానాలు జరుగుతుంటే తనకే జరిగినంత సంతోషపడేది. నా కోసం అతిథులు వస్తే తన పుట్టింటి వాళ్లు వచ్చినంత సంబరపడుతూ వాళ్లకు అన్నీ అమర్చి పెట్టేది. మా నాన్న కవి అనే విషయం ఆయన పోయిన తర్వాత కానీ మాకు తెలియలేదు. ఆయన పుస్తకాలన్నీ తీసి సర్దుతుంటే ‘రుద్రీయము’ చేతిరాత ప్రతి దొరికింది. కాకతీయ రాజు రుద్రదేవుడి చరిత్రను ఆయన పద్యకావ్యంగా రాశారు. ఆ పుస్తకాన్ని పరిష్కరించి ప్రచురించడం, ఆయన కవి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేయడం నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : సీహెచ్ మోహనాచారి -
New York : తానా సాహిత్య సదస్సు విజయవంతం
న్యూయార్క్, జూన్ 27 తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జూన్ 27న జరిగిన వర్చువల్ సమావేశంలో “ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలలో తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా విజ్ఞాన సదస్సు విజయవంతంగా జరిగింది. తానా అధ్యక్షలు జయశేఖర్ తాళ్లూరి తెలుగు భాష, సాహిత్య పరిరక్షణ, పర్వ్యాప్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడానికి తానా ఎల్లప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “విద్యాలయాలలో విద్య ‘లయ’ తప్పుతోందని, పలు రాష్ట్రాలలో పాలకుల విద్యా విధానాలు శ్రుతి మించి ‘రోగాన’ పడుతున్నాయని, చాలా విశ్వవిద్యాలయాలలో తరచూ సిబ్బందిలో వచ్చే ఖాళీలను భర్తీ చేయకుండా, విద్యార్దులను ఇబ్బందికి గురి చేస్తున్నారని, భర్తీ చేసినా మొక్కుబడిగా వారిని తాత్కాలికంగా నియమిస్తూ, అరకొరా వేతనాలు ఇస్తూ భోదించే అధ్యాపకులే లేని అధ్వాన్న పరిస్థితులలోకి నెడుతున్నానారని, విద్యాలయాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి విశ్వ విద్యాలయాలతో విశ్వానికే దిశానిర్దేశం చేసి మార్గదర్శకంగా నిలచిన మన భారతదేశంలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రభుత్వాలు, ప్రజలు, సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. విశాఖపట్నానికి చెందిన, ఆంధ్రవిశ్వవిద్యాలయం లో చదువుకున్న ఆచార్య డా. నీలి బెండపూడిఅమెరికా దేశంలో కెంటకీ రాష్ట్రంలో 223 సంవత్సరాల చరిత్ర, 120 కోట్ల రూపాయల వార్షిక ఆదాయ వ్యయం,3,000 కు పైగా సిబ్బంది, 22,000 మంది విద్యార్ధులకు నిలయమైన లూయివిల్ విశ్వవిద్యాలయపు అధ్యక్షురాలు (ఉపకులతి)గా ఎన్నికగావడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయమంటూ డా. ప్రసాద్ తోటకూర ఆమెను ఈ సభకు ప్రత్యేక అతిధిగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా లూయివిల్ విశ్వవిద్యాలయపు అధ్యక్షురాలు (ఉపకులతి) ఆచార్య డా. నీలి బెండపూడి తెలుగు భాష మాధుర్యాన్ని, సాహిత్యపు విలువలని, ఎంతోమంది సాహితీవేత్తల కృషిని,అమెరికా దేశంలో గత 40 సంవత్సరాలుగా తానా చేస్తున్న కృషిని కొనియాడుతూ తాను ఏదేశంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, భారతీయురాలిగా, తెలుగు వ్యక్తిగా గుర్తించబడడం తనకు గర్వకారణం అంటూ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. తంగెడ కిషన్‌రావు ఈ సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల తెలుగుశాఖాధ్యక్షులతో వేదిక పంచుకోవడం ఆనందదాయకంగా ఉందని, వివిధ సాహితీ సంస్థలు, సాహితీ ప్రియులు, తానా లాంటి పలు సంస్థలతో కలిసి పనిచేస్తూ తెలుగు విశ్వవిద్యాలయంలో అనేక జాతీయ, అంతర్జాతీయ తెలుగు సమావేశాలు నిర్వహించాలనే ఆసక్తి ఉన్నట్లుగా తెలియపరిచారు. తెలుగు భాష, సాహిత్యం, కళల అభివృద్ధికి తెలుగు విశ్వవిద్యాలయం విశేషంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉందని ప్రకటించారు. మైసూరు విశ్వవిద్యాలయం, మైసూరు పూర్వ తెలుగు శాఖాసంచాలకులు ఆచార్య డా. ఆర్.వి.ఎస్. సుందరం; ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు యోజన నిర్దేశకులు ఆచార్య డా. దిగుమర్తి మునిరత్నం నాయుడు;మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నై తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. విస్తాలి శంకర్ రావు; ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, ఆలిఘర్ తెలుగు శాఖాధ్యక్షులు సహాయ ఆచార్యులు డా. పటాన్ ఖాసిం ఖాన్; మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం, మధురై తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. జొన్నలగడ్డ వెంకట రమణ; బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య డా. కొలకలూరి ఆశాజ్యోతి; ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. గంప వెంకట రామయ్య; కర్ణాటక రాజ్య సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు తెలుగు శాఖాధిపతి ఆచార్య డా. మొగరాల రామనాథం నాయుడు; బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి తెలుగు శాఖాచార్యులు ఆచార్య డా. భమిడిపాటి విశ్వనాథ్ లు తమ తమ విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖ ఆవిర్భావం, జరుగుతున్న అభివృద్ధి, తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా రంగాలలో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యక్రమాలను, ప్రభుత్వాల నుండి ఇంకా అందవలసిన సహాయ సహకారాల అవసరాలను సోదాహరణంగా వివరించారు. హాస్యావధాని, ప్రముఖ పాత్రికేయులు హాస్య బ్రహ్మ డా. టి. శంకర నారాయణ తన హాస్య ప్రసంగంలో విశ్వనాధ సత్యనారాయణ, గుర్రం జాషువా, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీశ్రీ, ఆరుద్ర, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి లాంటి సాహితీవేత్తల జీవితాల్లోని హాస్య సంఘటలను వివరించి సభను నవ్వులతో ముంచెత్తారు. గత సంవత్సర కాలంగా ప్రతి నెలా తానా నిర్వహిస్తున్న సాహితీ సమావేశాలతో పోల్చుకుంటే ఇదొక ప్రత్యేక సాహిత్య సమావేశమని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం చేయడంలో సహకరించిన ప్రసార మాధ్యమాలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
చికాగోలో సాహితీ మిత్రుల సమ్మేళనం
చికాగో: ప్రస్తుత కాలంలో వస్తువులకే ప్రాధాన్యత ఇస్తూ.. మానవ సంబంధాలకు విలువ ఇవ్వకూడదనే విధంగా సమాజం తయారైందని ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి వ్యాఖ్యానించారు. చికాగో సబర్బ్ ఓక్ బ్రూక్ పబ్లిక్ లైబ్రరీలో ‘చికాగో సాహితీ మిత్రులు’ పేరుతో శనివారం నిర్వహించిన సాహిత్య సభలో సిద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలకరింపులు తగ్గిపోతూ.. ప్రక్కనున్న వారి గురించి ఆలోచించలేని సమాజాన్ని మనం తయారు చేసుకుంటున్నామని అన్నారు. ఈ ధోరణి చాలా ప్రమాదకరమైని సిద్దారెడ్డి అభిప్రాయపడ్డారు. వేమన, గురజాడ, శ్రీశ్రీలు తెలుగులో రాసిన రచనల్లోని సారాన్ని ఒక తత్వంలాగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని ‘చికాగో సాహితీ మిత్రుల సంఘం’ నిర్వాహకులు మెట్టుపల్లి జయదేవ్, తిమ్మాపురం ప్రకాష్, ఆపూరి హరినాథ్ బాబులు నిర్వహించారు. అయితే ఈ సభకు డాక్టర్ జంపాల చౌదరి అధ్యక్షత వహించారు. ప్రముఖ రచయిత్రి మల్లేశ్వరి మాట్లాడుతూ.. తన నవల ‘నీల’ రాయడానికి గల నేపథ్యాన్ని, నిజమైన సంఘటనలను ఆ నవలలో కొన్ని చోట్ల ఎలా పొందుపరిచారో ఆ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి సభ్యులు నవీన్ వాసిరెడ్డి ప్రసంగిస్తూ.. తెలుగు సాహిత్యానికి ఉన్న విశాలమైన స్థానాన్ని తాను కేంద్ర సాహిత్య అకాడమీకి సభ్యునిగా ఎంపిక అయ్యాక దగ్గరగా చూశానని తెలిపారు. అదేవిధంగా తెలుగు కథ పరిణామం గురించి మాట్లాడారు. సభా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యానికి తాను చేసిన సేవలను వివరించారు. నవలా సాహిత్యానికి బహుమతులను ఎంపిక చేయడంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఈ సమావేశ నిర్వహణకు వసతులు ఏర్పాటు చేసిన మెట్టుపల్లి శారద, బూచుపల్లి రాము, పాతకోట ప్రభాకర్ తదితరులకు సాహిత్య సంస్థ తరుపున ప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాటా డైరక్టర్ లింగారెడ్డిగారి వెంకటరెడ్డి , నాటా రీజనల్ కో ఆర్డినేటర్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర తెలుగు సంఘాల నాయకులు.. అప్పలనేని పద్మారావు, కటికి ఉమా, కానూరి జగదీష్, నందుల మురళి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ముస్తఫా రచనల నిండా మానవతా పరిమళాలే
కడప కల్చరల్ : డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా రచనలన్నీ మానవత్వపు పరిమళాలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాయని ప్రముఖ రచయిత, అనువాదకులు కొమ్మిశెట్టి మోహన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా జీవితం–సాహిత్యం అనే అంశంపై ఆయన మాట్లాడారు. ముస్తఫా రచనలన్నీ వెలుగుల రవ్వలేనని, సమాజంలోని విలువల పట్ల ఆయన కాంక్ష, స్పందన ఆ రచనల్లో ప్రతిఫలిస్తున్నాయని తెలిపారు. ఉత్తమ సమాజం కోసం ఆయన రచనలు సాగాయన్నారు. రాజకీయాల పట్ల ఆయన నిరసన కవిత్వంలోని వ్యంగం ద్వారా అర్థమవుతోందని, గోవును గ్రామంతో, పులిని పట్నంతో పోల్చడం ఎంతో పదునుగా ఉందన్నారు. సీమ వాసి గనుక ఈ ప్రాంత కడగండ్లను కవితా వస్తువుగా స్వీకరించడం విశేషమన్నారు. రచనలన్నీ దేనికవే గొప్పవిగా చెప్పవచ్చన్నారు. ఇంతటి ప్రతిభావంతుడైన ముస్తఫా నిగర్వి, సంయమనశీలి, జ్ఞాని అని, ఆయనతో మాట్లాడితే పుస్తకంతో మాట్లాడినట్లు ఉంటుందని అభివర్ణించారు. దశాబ్దాల క్రితం ఆయన ఈ ప్రాంత రైతుల ఆత్మహత్యల పట్ల ఆవేదనను రచనల్లో వివరించారన్నారు. ప్రక్రియ ఏదైనా మూల వస్తువు మానవత్వమేనని వివరించారు. పలు పత్రికల్లో వచ్చిన ఆయన వ్యాసాలు రాష్ట్రంలోని మేధావుల ప్రశంసలు కూడా అందుకున్నాయన్నారు. ఈ సందర్భంగా బ్రౌన్ గ్రంథాలయ బాధ్యులు డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి ముస్తఫా రచనలను విశేషంగా ప్రశంసించారు. బ్రౌన్ గ్రంథాలయం పక్షాన వక్తతోపాటు రచయిత ముస్తఫాను కూడా నిర్వాహకులు, డాక్టర్ జానమద్ది సాహిత్య పీఠం అధ్యక్షుడు జానమద్ది విజయభాస్కర్ సత్కరించారు.