చికాగో: ప్రస్తుత కాలంలో వస్తువులకే ప్రాధాన్యత ఇస్తూ.. మానవ సంబంధాలకు విలువ ఇవ్వకూడదనే విధంగా సమాజం తయారైందని ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి వ్యాఖ్యానించారు. చికాగో సబర్బ్ ఓక్ బ్రూక్ పబ్లిక్ లైబ్రరీలో ‘చికాగో సాహితీ మిత్రులు’ పేరుతో శనివారం నిర్వహించిన సాహిత్య సభలో సిద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలకరింపులు తగ్గిపోతూ.. ప్రక్కనున్న వారి గురించి ఆలోచించలేని సమాజాన్ని మనం తయారు చేసుకుంటున్నామని అన్నారు. ఈ ధోరణి చాలా ప్రమాదకరమైని సిద్దారెడ్డి అభిప్రాయపడ్డారు. వేమన, గురజాడ, శ్రీశ్రీలు తెలుగులో రాసిన రచనల్లోని సారాన్ని ఒక తత్వంలాగా ఆయన వివరించారు.
ఈ కార్యక్రమాన్ని ‘చికాగో సాహితీ మిత్రుల సంఘం’ నిర్వాహకులు మెట్టుపల్లి జయదేవ్, తిమ్మాపురం ప్రకాష్, ఆపూరి హరినాథ్ బాబులు నిర్వహించారు. అయితే ఈ సభకు డాక్టర్ జంపాల చౌదరి అధ్యక్షత వహించారు. ప్రముఖ రచయిత్రి మల్లేశ్వరి మాట్లాడుతూ.. తన నవల ‘నీల’ రాయడానికి గల నేపథ్యాన్ని, నిజమైన సంఘటనలను ఆ నవలలో కొన్ని చోట్ల ఎలా పొందుపరిచారో ఆ విధానాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి సభ్యులు నవీన్ వాసిరెడ్డి ప్రసంగిస్తూ.. తెలుగు సాహిత్యానికి ఉన్న విశాలమైన స్థానాన్ని తాను కేంద్ర సాహిత్య అకాడమీకి సభ్యునిగా ఎంపిక అయ్యాక దగ్గరగా చూశానని తెలిపారు. అదేవిధంగా తెలుగు కథ పరిణామం గురించి మాట్లాడారు. సభా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యానికి తాను చేసిన సేవలను వివరించారు. నవలా సాహిత్యానికి బహుమతులను ఎంపిక చేయడంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఈ సమావేశ నిర్వహణకు వసతులు ఏర్పాటు చేసిన మెట్టుపల్లి శారద, బూచుపల్లి రాము, పాతకోట ప్రభాకర్ తదితరులకు సాహిత్య సంస్థ తరుపున ప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాటా డైరక్టర్ లింగారెడ్డిగారి వెంకటరెడ్డి , నాటా రీజనల్ కో ఆర్డినేటర్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర తెలుగు సంఘాల నాయకులు.. అప్పలనేని పద్మారావు, కటికి ఉమా, కానూరి జగదీష్, నందుల మురళి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment