అమ్మ భాష అమృతం
సందర్భం : నేడు తెలుగు భాషా దినోత్సవం
–––––––––––––––––––––
తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలెందు తెలుగు లెస్స... అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాష ఔనత్యాన్ని ప్రపంచానికి ఆయన ఇలా చాటిచెప్పారు.
పంచదార కన్న.. పనస తొనల కన్న... కమ్మని తేనే కన్న మధురమైనది మన తెలుగు భాష అంటూ ప్రాచీన కవులు ఎందరో తమ భాషాభిమానాన్ని చాటుకున్నారు. తల్లి ప్రేమకు సరిసాటిగా భాసిల్లిన తెలుగు భాషను ఎందరో మహనీయులు సుసంపన్నం చేసారు. అందులో అనంత వాసులూ భాగస్వామ్యులై భాషా వికాసానికి ఇతోధికంగా తోడ్పాటునందిస్తున్నారు. తెలుగు భాషా వైభవాన్ని ఘనంగా చాటడం, మాతృభాష సౌందర్యాన్ని గుర్తుచేయడం కోసం గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి సందర్భంగా ఆగష్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం.
అనంత వాసికి అరుదైన అవకాశం
రాష్ట్ర విభజన తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పొట్లూరి హరికృష్ణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలుగు రక్షణ వేదిక సంస్థ ద్వారా వందలాది మంది కవులను, రచయితలను సత్కరించడం వారి గొప్పతనాన్ని లోకానికి చాటడం ద్వారా తెలుగు భాషాభివృద్ధికి చేయూతనందిస్తున్న హరికృష్ణ... అంతరించిపోతున్న భాషల్లో తెలుగు చేరకుండా అందరూ కృషి చేయాలంటారు.
స్ఫూర్తికి ప్రతిరూపం ఉమర్
ముస్లిం కుటుంబంలో జన్మించిన... తెలుగు భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు డాక్టర్ ఉమర్‌ఆలీషా. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆ«ధ్యాత్మిక పీఠం తెలుగు భాషకు ఎనలేని కృషి చేస్తోంది. కేవలం కోస్తా జిల్లాలకు పరిమితమైన ఈ పీఠం కార్యక్రమాలు నవమ పీఠాధిపతులు డా.ఉమర్‌ఆలీషా చేతుల మీదుగా ఈ సంవత్సరమే జిల్లాలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఉమర్ స్ఫూర్తికి ప్రతిరూపంగా భాషావృద్ధికి జిల్లా వాసి పండిట్ రియాజుద్దీన్ అహ్మద్ తోడ్పడుతున్నారు, కాబట్టే ఆయన డా. ఉమర్ ఆలీషా సాహితీ సమితి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై అనేక భాషా కార్యక్రమాలను చేపడుతున్నారు.
జిల్లా రచయితకు భాషా పురస్కారం
తెలుగులోని ప్రతి ప్రకియను స్పృశించిన సుప్రసిద్ధ కథా రచయిత డా.శాంతి నారాయణ, ఈ ఏడాది ప్రభుత్వం ద్వారా భాషా పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలుగువారికి భాషాభిమానం తక్కువేనని, ఇంటి నుంచే భాష పట్ల అనురక్తి పెరిగాలని అంటున్నారు.
నేటి కార్యక్రమాలు
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వివిధ సంస్థల వారు భాషాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు భాషకు నీరాజనం పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డా.ఉమర్ ఆలీషా సాహితీ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రఘురామయ్య తెలిపారు. అలాగే తెలుగు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ అనంతరం తెలుగు తల్లి కూడలి వద్ద సమావేశం ఉంటుందని సంస్థ అధ్యక్షులు డా.నారాయణ తెలిపారు. స్థానిక విశాలంధ్ర బుక్ హౌస్‌లో భాషా సాహిత్యాలపై ప్రత్యేక రిబేటును అందిస్తున్నట్టు బుక్ హౌస్ మేనేజర్ చెట్ల ఈరన్న తెలిపారు. తెలుగు భాషా ప్రచారంలో భాగంగా వారం రోజుల పాటు సాగనున్న ఈ ప్రత్యేక ఆఫర్లను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.