అమ్మ భాషకు వందనం | salute to mother language | Sakshi
Sakshi News home page

అమ్మ భాషకు వందనం

Published Mon, Feb 20 2017 9:33 PM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

అమ్మ భాషకు వందనం

అమ్మ భాషకు వందనం

– నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 
కర్నూలు(కల్చరల్‌) : అమ్మ నుంచి నేర్చుకున్న కమ్మనైన భాష... పాలు పెరుగు కన్న... జున్ను, వెన్న కన్న తీయనైన భాష... సహజమైన స్వచ్ఛమైన అమృతధారలు పంచే అద్వితీయమైన భాష... ఊయలలో ఉంగా ఉంగా పలుకులప్పుడు అమ్మ పాడే తీయనైన జోల పాట... అమ్మ పలికే అందమైన పలుకుల పూదోట... ఎవరికైనా ఆహ్లాదాన్ని కల్గిస్తాయి... ఆనందాన్ని పంచుతాయి... అమ్మ గుండె నుంచి శిశువు గుండెకు ప్రవహించే ఆ అనంత భావవాహిని... అనంతరం... భాషా సాగరానికి నిలయమవుతుంది.. ప్రతి వ్యక్తి అభివ్యక్తికి అదే ఆధారమవుతుంది. మాతృభాషే మధురమైనది, మాతృభాషలోని బోధన స్వచ్ఛమైనది అంటూ విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఏనాడో చాటిచెప్పారు. భావాలను స్వచ్ఛంగా, నిర్మలంగా ప్రకటించేందుకు ఏకైక సాధనం మాతృభాషేనని ఎందరెందరో భాషావేత్తలు ఘోషించారు. మంగళవారం..అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
 
జిల్లాలో తెలుగు భాషను పరిమళింపజేసిన మేధావులు ఎందరో ఉన్నారు. అలనాటి భువన విజయంలో సభ్యుడైన పింగళి సూరన జన్మించిన కర్నూలు జిల్లా తెలుగు భాషకు చక్కని పునాది వేసింది. తొలి తెలుగు నవల ఇక్కడే పుట్టిందని ఎందరో భాషావేత్తలు ప్రచారం చేశారు. ఇక్కడ పారుతున్న హంద్రీనదియే ఆంధ్రి అనే పదానికి పునాది అని కొందరు భాషా పరిశోధకులు తెలిపారు. కర్నూలు జిల్లాలో స్థాపితమైన తెలుగు భాషా వికాస ఉద్యమం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలో తన కార్యక్రమాలను విస్తరింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషా పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేసింది. గతంలో ఖమర్‌నగర్‌గా గుర్తింపు పొందిన కర్నూలులో ఉర్దూ భాష ముషాయిరాలలో, పాఠశాలల్లో గుబాళించింది. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఉర్దూ మాతృభాషగా కలిగినవారు ఉర్దూ భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఆదోని కర్ణాటక రాష్ట్రానికి అత్యంత సమీపంగా ఉండటంతో అక్కడ పుట్టి పెరిగిన కొందరు మేధావులు కన్నడ భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఇలా కర్నూలు జిల్లాలో వివిధ భాషలను మాతృభాషలుగా కలిగినవారు తమతమ మాతృభాషల పరిరక్షణ కోసం తమదైన శైలిలో పనిచేస్తున్నారు. 
 
భాషా వికాసానికి కృషి..
ఉర్దూ భాషా వికాసం కోసం కర్నూలులో 1970నుంచి ఖైసీఖమర్‌నగరి అనే కవి కృషి చేస్తున్నారు. ఉర్దూ రచయితలు, కవులనందరినీ కలుపుకుంటూ ముషాయిరాల ద్వారా, ఆయినా అనే పత్రిక ద్వారా ఉర్దూ భాషా పరిరక్షణ కోసం సాహితీ ఉద్యమం చేస్తున్నారు. ఆదోని వాస్తవ్యులైన రంగనాథ రామచంద్రరావు ప్రసిద్ధి చెందిన కన్నడ కథలను తెలుగులోకి అనువదిస్తూ, తెలుగు కథలను కన్నడలోకి అనువదిస్తూ కన్నడ భాషా పరివ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. కర్నూలు కేంద్రంగా ఎందరెందరో భాషావేత్తలు, కవులు, రచయితలు తెలుగు భాషా వికాసం కోసం, పరిరక్షణ కోసం తమ సేవలు కొనసాగిస్తున్నారు.  
 
తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం... 
– జే.ఎస్‌.ఆర్‌.కె.శర్మ, తెలుగు భాషా ఉద్యమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి : 
 తెలుగు భాషా వికాస ఉద్యమం పేరుతో 2000లో  మేము ఒక సంస్థను స్థాపించాం. తెలుగు భాషా పరిరక్షణ సదస్సులు  23 జిల్లాల్లో  నిర్వహించాం.  ప్రముఖ శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో నూరు భువన విజయ కార్యక్రమాలు, నూరు అష్టావధానాలు నిర్వహించి తెలుగు భాషా మాధుర్యాన్ని ప్రస్తుత తరానికి పంచిపెట్టాం. తెలుగు రాష్ట్రంలో రేషన్‌ కార్డు దరఖాస్తు తెలుగులోనే ఉండాలని కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి దానిని అమలు చేయించాం. తిరుపతిలోని పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం పేరును తెలుగులోనే కొనసాగించేటట్లు చేశాం. కర్నూలు జిల్లాలో 73 ప్రాంతాల్లో తెలుగు భాషా రథయాత్రలు నిర్వహించాం. కర్నూలులో  కృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్టించాం. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2012లో  కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాం. మద్దూర్‌నగర్‌లోని పింగళి సూరన తెలుగు తోట ప్రాంగణాన్ని 2015లో ప్రారంభించాం. ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా ప్రస్తుత తరానికి మాతృభాషలోనే విద్యాబోధన జరిగే విధంగా కృషి చేస్తున్నాం. 
 
ఉర్దూ భాష పరిరక్షణ కోసం ఉద్యమించాలి... 
– షంషుద్దీన్, రాయలసీమ ఉర్దూ కమిటీ ప్రధాన కార్యదర్శి 
కర్నూలు జిల్లాలో ఉర్దూ మాట్లాడే ప్రజలు అధిక శాతం ఉన్నారు. అందుకే రాయలసీమ ఉర్దూ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. కేవీఆర్‌ కళాశాలలో బైపీసీ, ఎంపీసీ ఉర్దూ మాధ్యమంలో ప్రారంభించడానికి కృషి చేశాం. ఉర్దూలో పీజీ కోర్సును ప్రారంభింపజేశాం. ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాల్లో ఉర్దూ మాద్యమ పాఠశాలలను ప్రారంభించాం. ఉర్దూ యూనివర్సిటీ కోసం చాలా సంవత్సరాలుగా ఉద్యమిస్తూ వచ్చాం. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గారికి 2009లో దరఖాస్తును ఇచ్చి ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభానికి శ్రీకారం చుట్టాం. రాయలసీమ వ్యాప్తంగా ఉర్దూ భాషా వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి ఉర్దూ భాషా మాధుర్యాన్ని తెలియజేశాం. ఉర్దూ అధికంగా మాట్లాడే ప్రజలున్న ప్రాంతాల్లో ఉర్దూ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 
 
అమ్మభాషే కమ్మనైనది..
– బి.వి.స్వరూప్‌ సిన్హా, ప్రముఖ రచయిత, కర్నూలు 
అమ్మ భాష కమ్మదనం అనే పేరుతో నేను రాసిన కవిత్వ సంకలనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా స్థానిక రవీంద్ర పాఠశాలలో ఆవిష్కరింపజేస్తున్నాను. ఈ పుస్తకంలో తెలుగు భాషలోని కమ్మదనాన్ని వివరించే పలు కవితలు ఉన్నాయి. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మొదలుకొని ఎందరెందరో భాషావేత్తలు, మేధావులు భావ వ్యక్తీకరణకు మాతృభాషే అసలైన సాధనమని ప్రచారం చేశారు. ఇది ఎప్పటికైనా వాస్తవమే. పీజీ స్థాయి వరకు మాతృభాషలోని విద్యాబోధన జరిగినట్లయితే విద్యార్థులు సరైన అవగాహనను పెంచుకుని భావ వ్యక్తీకరణకు సిద్ధమవుతారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement