కాలీ పీలీ దిమాఖ్‌ ఖరాబ్‌ జేయకురా బై! | speciality of hyderabad lingo | Sakshi
Sakshi News home page

ప్రత్యేకతను చాటుకుంటున్న హైదరాబాద్‌ లింగో

Published Sun, Dec 17 2017 9:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

speciality of hyderabad lingo - Sakshi

 సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ అంటే ఆరామ్‌ సంస్కృతి, దక్కనీ భాష.. బిర్యానీ భోజనం! నిజాం పాలనలో తెలుగుతో పాటు కన్నడ, మరాఠీ మాట్లాడే ప్రాంతాలూ ఉండడం, ఉర్దూ అధికార భాష కావడంతో ఇక్కడి తెలుగులో వీటన్నిటీ ప్రభావమూ కనిస్తుంది. ఒక్కప్పుడు నగరం నైజాం రాజధాని.. తర్వాత రెండు తెలుగురాష్ట్రాల రాజధానీ కావడంతో కాస్మోపాలిటన్‌ కల్చర్‌కు వేదికగా నిలిచింది. దీనివల్ల కూడా హైదరాబాద్‌ తెలుగు పలు భాషల పదాలతో కలిసి ఈ అర్బన్‌ లింగో మిగిలిన నగరాల్లోలా కాక  హైదరాబాదీ లింగోగా తన ప్రత్యేకతను చాటుతోంది. ఇక్కడ కూరగాయల బేరగాళ్లు, ఆటోవాలాలు, యువత.. పెద్దవాళ్లు.. ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో తెలుగు ఉంది ఇక్కడ. ‘అరే అమ్మా.. ఇయ్యాల తర్కారీ (కూరగాయలు) మస్తు సస్తా (చవక) ఉన్నయ్, కద్దూ (సొరకాయ), కరేలా (కాకరకాయ), కల్యామాక్‌ (కరివేపాకు), భేండీ (బెండకాయ) అన్నీ సస్తల్నే’’ అంటారు. ఉత్తర భారతీయులూ ఎక్కువగా ఉండడం వల్ల పాతబస్తీ నుంచి మొదలు వయా నాంపల్లి బేగంపేట్‌ వరకు కూరగాయల పేర్లు హిందీ లేదా ఉర్దూ భాషల్లోనే వినిపిస్తాయి మార్కెట్లలో. బేరగాళ్ల దగ్గర కూడా! గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో సూపర్‌ మార్కెట్లు వచ్చినా అక్కడ ఇంగ్లిష్‌ జతకూర్చుకుంది కాని ఈ నేటివిటీ అయితే తాజాతనం కోల్పోలేదు.
 
కాలీ పీలీ.. కిరాక్‌..
ఎక్కడున్నా యువత ఉనికే వేరు. వాళ్ల ఫ్యాషన్‌కే కాదు వాళ్ల కమ్యూనికేషనూ లేటెస్ట్‌ ట్రెండ్‌నే అనుసరిస్తుంటుంది. అందుకే ప్రతి తరంలో యూత్‌ కొత్త తెలుగును ఆవిష్కరిస్తుంటారు. ఇందులోనూ హైదరాబాద్‌ యువతరం ఫర్మాయిష్‌ ప్రత్యేకమే. పొట్టి, పాట్ట (అమ్మాయి, అబ్బాయి) నుంచి మొదలవుతుంది ఇది.  ‘2 పొట్టి ఏముందిరా.. ఏక్‌దమ్‌ కిరాక్‌’ అంటూ  ‘‘అబే.. కాలీ పీలీ (ఉట్టిగానే) దిమాఖ్‌ ఖరాబ్‌ జేయకురా బై’ అని ఎండ్‌ చేస్తారు. మధ్యలో ఇంకెన్ని..? నక్కో (వద్దు), లైట్‌ లేలే (పట్టించుకోకు), ‘యేం బైగన్‌ (వంకాయ) పనులు చేస్తున్నవ్‌రా’, ‘నన్ను బైగన్‌ చేసేసినవ్‌ కదా..’, ‘పోరడు చిక్నా (అమాయకుడు, సున్నితమనస్కుడు)రా.. పాపం’, ‘అరే హౌలే (పిచ్చోడు)..’, ‘కిరికిరి (గొడవ) షురూ జేయక్‌’’, ‘పటాయించు (ప్రేమలో పడేయ్‌)’’, ‘దబాకే (బాగా) ఆకలైతుంది’, ‘ఏంది.. సర్కాయిం చిందా? (పిచ్చి పట్టిందా)’’ వగైరా వగైరా తెలుగుగానే పలుకుతున్నాయ్‌.  ఇక స్నేహితులను మామా, చిచ్చా.. అని పిలుచుకోవడం పరిపాటి. తరాలు మారుతున్నా ఇవన్నీ ఇప్పటికీ వాడకంలో ఉన్న మాటలే! ఎవర్‌ యంగ్‌ జర్గాన్‌! అంటే పాతతరమూ వీటి సరళి వీడలేదన్నమాట!

ఇంటర్నెట్‌ స్లాంగ్‌
ఇది ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తున్న మాధ్యమం. దీనికి హైదరాబాదూ మినహాయింపు కాదు. డూడ్, లోల్, రఫోల్, ఓఎమ్‌జీ (ఓ మై గాడ్‌), యూ నో, హీ ఈజ్‌ బే (బీఈఏ.. అంటే బిఫోర్‌ ఎనీ వన్‌ ఎల్స్‌), ఫేస్‌పామ్‌(అయ్యో), త్రో బాక్‌ టు (పాతది గుర్తు చేసుకునే క్రమం), ఫట్టా.. పీస్‌ (అందమైన అమ్మాయిని ఉద్దేశించిన పదాలు, ఎఫ్‌వైఐ (ఫర్‌ యువర్‌ ఇన్ఫర్మేషన్‌), కూల్, చిల్,ఈటీసీ (ఎట్‌సెట్రా), టీక్యూ (థాంక్యూ), టీకే (టేక్‌ కేర్‌) మొదలైనవన్నీ ఇంటర్‌నెట్‌ స్లాంగ్‌గా ఫేమస్‌ అయ్యాయి. సోషల్‌ మీడియా, స్మార్ట్‌ ఫోన్స్‌ చాటింగ్‌  క్రియేట్‌ చేసిన మాటలివి. వీటిలో చాలా  టీక్యూ, టీకే, రఫోల్, లోల్‌ వంటివన్నీ కూడా చాటింగ్‌లోనే కాదు.. మాట్లాడుతున్నప్పుడు కూడా వాడుకలో సర్వసాధారణమైపోయాయి.  ఏ జోక్‌ అయినా నవ్వు తెప్పిస్తే లోల్‌ అని, పగలబడేలా నవ్వు తెప్పిస్తే నవ్వకుండా రఫోల్‌ అని చెప్పేసి ఊరుకుంటున్నారు అంతే. పరభాషా పదాలు చేరితేనే మాతృభాష విస్త్రతమవుతుంది. అభివ్యక్తీకరణకు కొత్త మాటలు పుడితేనే భాష వికాసం చెందుతుంది. అయితే.. పరాయి పదాలు మన భాషలో ఇమిడిపోవాలి. పరాయి పదాల్లో మన భాష కుంచించుకుపోవద్దు. ఆ జాగ్రత్త పాటిస్తే చాలు!

 రోకో.. హల్లు
సైకిల్‌ రిక్షాలున్నప్పుడు వినిపించిన ఈ పదాలు ఆటోరిక్షాల్లోనూ ధ్వనిస్తూ క్యాబ్‌ డ్రైవర్లకూ కామన్‌ అయ్యాయి. ‘భయ్యా.. చార్‌మినార్‌ ఛల్తే’’ దగ్గర బేరం మొదలై రిక్షా ఎక్కాక హైదరాబాద్‌ ఎగుడు దిగుడు రోడ్లకు తన రిక్షాను బ్యాలెన్స్‌ చేసుకుంటున్న సందర్భంలో సవారీ.. (సారీ ఈ మాట చెప్పడం కూడా మర్చాం. సవారీ అంటే రిక్షాలో ప్రయాణించే ప్రయాణికుడు) ‘భయ్యా.. హల్లూ ఛలో (నెమ్మదిగా నడుపు అన్నా)’,  గమ్యం వచ్చేశాక.. ‘రోకో భయ్యా.. రోకో (ఆపు అన్నా ఆపు) అనే ఉర్దూ పదాలు మొత్తం రవాణా సౌకర్య వ్యవస్థ జార్గాన్‌గా.. ఆ డిక్షనరీలో స్థిరపడిపోయాయి.


డ్రామెటిక్‌గా భావిస్తున్నారు..
సాఫ్ట్‌వేర్‌ జాబ్స్, చాటింగ్‌ వల్లే వాక్యాలు పదాల్లా మారిపోతున్నాయని నా అభిప్రాయం. హైదరాబాద్‌లాంటి చోట్ల తెలుగుతో సమానంగా హిందీ, ఉర్దూ ఉంటాయి. ఈ పది పదిహేనేళ్లలో ఇంగ్లిష్‌ కూడా అంతే కామన్‌ అయింది. అచ్చంగా తెలుగులో మాట్లాడితే డ్రామెటిక్‌గా మాట్లాడినట్టు ఉంటోంది. విన్నవాళ్లూ అలాగే భావిస్తున్నారు.   
    – స్వప్నపేరి, అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్టిస్ట్‌


సీక్రెట్‌గా ఉండడం కోసం
సాధారణంగా యూత్‌ లింగో ఎందుకుంటుంది అంటే.. వాళ్ల స్వేచ్ఛను కోపాడుకోవడం కోసం. తల్లిదండ్రులతో, లెక్చరర్స్‌తో ఓపెన్‌గానే ఉంటాం. కాని కొన్ని విషయాల్లో సీక్రెట్స్‌ తప్పవు కదా! సపోజ్‌ నా ఫ్రెండ్‌ పర్సనల్‌ విషయాలు మా పేరెంట్స్‌తో  మాట్లాడలేను కదా. అలా పేరెంట్స్‌ ముందు ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చనప్పుడో, లేక పరాయి వాళ్లముందు, కొత్త ప్లేసెస్‌లో వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ లింగోను యూజ్‌ చేస్తాం.  
– కె.ప్రత్యూష, గ్రాఫిక్‌ డిజైనర్‌

ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైయిల్‌
మాది ఒడిశా. కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నా. మనం ఉండే ప్రాంతం, వాతావరణాన్ని బట్టి స్లాంగ్స్, యాక్సెంట్స్‌ ఉంటాయి. అర్బన్‌ లింగో నుంచి మాలాంటి యూత్‌ సపరేట్‌గా కొన్ని పదాలను తయారు చేసుకుంటుంటుంది. ఇవన్నీ భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన భిన్న భాషల నుంచీ పుట్టుకొస్తాయి.   
– భరత్‌ బెహెరా, ఫన్‌బకెట్‌ ఆర్టిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement