‘వెళ్లొస్తా’ అని ... ఎంతకూ రాడే? | Specialization of Bahamanis | Sakshi
Sakshi News home page

‘వెళ్లొస్తా’ అని ... ఎంతకూ రాడే?

Published Mon, Sep 15 2014 12:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

‘వెళ్లొస్తా’ అని ... ఎంతకూ రాడే? - Sakshi

‘వెళ్లొస్తా’ అని ... ఎంతకూ రాడే?

హైద్రాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడి భాష నాకు వింతగా తోచింది. నేను చిన్నప్పటి నుంచి ఉర్దూ చదివినవాడిని. రాసిన వాడిని. ఇక్కడి ఉర్దూ రాత భాషలోని కొన్ని పదాలు నాకు తెలిసిన ఉర్దూ సాహిత్యంలో ఎక్కడా తారసపడలేదు. పాత తరాల సాహిత్యం చదివిన తర్వాత ‘యురేకా’ అన్పించింది! ఇక్కడ బాగా ప్రాచుర్యంలో ఉన్న ‘దేజావొ’ లాంటి పదాలు మా పంజాబీలకు చిరపరిచితమైనవే! ఈ మతలబు తెలుసుకునేందుకు చరిత్రలోకి కాస్త తొంగి చూడాల్సిందే!
 
దక్కన్ తరంగాలు!
ముస్లింల దండయాత్ర వలన మాత్రమే దక్కనీ రూపొందలేదు. జైనులు-బౌద్ధులు-శైవులు-వైష్ణవులు-తమ విశ్వాసాల ప్రచారాల్లో భాగంగా ద్రవిడ ప్రాంతానికి శతాబ్దాలుగా వచ్చేవారు. ఇక్కడి వారు అక్కడికీ! వీరికి, మహారాష్ట్ర-కర్ణాటక-తెలంగాణ ప్రాంతాలు ఉత్తర-దక్షిణ భారతాల సంగమస్థలిగా ఉండేది. సూఫీలు,గురునానక్ దక్షిణ ప్రాంతాలను సందర్శించారు. ఈ సంగమం వలన ఏర్పడిన భాష దక్కనీ. ముస్లింలు అందరూ సూఫీలు కారు. సూఫీలందరూ ముస్లింలు కారు! దక్కనీలో జైన చరిత్ర కావ్యాలు రాశారు. దక్కన్ పీఠభూమి పరిసరాల్లోని అనేక భాషాప్రవాహాలను కలుపుకుని దక్కనీ (దక్షిణాది భాష) ఆవిర్భవించింది.
 
బహమనీల ప్రత్యేకత!
అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరిపై దాడి చేసిన నేపథ్యంలో అతడు, అతడి సైన్యం వెంట తెచ్చిన పర్షియన్ భాష పంజాబ్‌తో సంగమించింది. ఖిల్జీ దాడి తర్వాత నూరేళ్లకు 1295 ప్రాంతంలో కొత్తభాషగా ఢిల్లీకీ పరిచయమైంది. సింధునది ప్రాంతానికి వచ్చిన సైనికులు (ఉర్దు) మాట్లాడే భాష కాబట్టి (హిందీ)గా మారింది. ఈ నేపథ్యంలో 1327లో తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడు. మహారాష్ట్రలోని నాసిక్-నాందేడ్ మధ్యలోని దేవగిరిని దౌలతాబాద్ అన్నాడు. దక్కన్ పీఠభూమికి చెందిన దౌలతాబాద్‌కు రాచకుటుంబీకులు, ఉన్నతాధికారులు, చేతివృత్తుల వారు, దాదాపు 500 మంది సూఫీలు ఢిల్లీ నుంచి చేరారు.
 
తమ భాషనూ ఇక్కడకు తెచ్చారు. 1347లో స్థానిక ప్రభువులు తుగ్లక్‌కు ఎదురు తిరిగి బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ నేపథ్యంలో బహమనీలు ఉత్తరాది వారితో ఎటువంటి సంబంధం, పోలిక వద్దనుకున్నారు. భాష విషయంలో కూడా! అలా ఉత్తరాది ఉర్దూతో సంబంధం లేకుండా దక్షిణాది ఉర్దూ పరిణామం మొదలైంది!  స్థానిక భాషలైన మరాఠీ-తెలుగు-కన్నడ పదాలను చేర్చుకుంది. ‘హవ్-నక్కొ-కైకొ’ మరాఠీ నుంచి చేరాయి. ‘జాకే ఆతుమ్’ ఉర్దూకు తెలుగు కంట్రిబ్యూషన్!  ఉత్తరాది ఉర్దూలో ఈ వాడుక లేదు! ఈ విషయం నేను స్వానుభవంతో చెబుతున్నా!
 
ఆంధ్రుడైన మా ఉన్నతాధికారి ఒకరు ‘వెళ్లొస్తా’ అని వెళ్లాడు. ఎంతకూ రాడే? చాలాసేపు వెయిట్ చేశా. ‘ఆయన వెళ్తున్నా అన్నారు, మళ్లీ వస్తా అనలేదు’ అని మా దగ్గర పనిచేసే వ్యక్తి చెప్పాడు!

ప్రజల నాల్కలపై జీవించిన రాజు!
ఫిరోజ్ షా, బుర్హానుద్దీన్ జనమ్, ఖురేషీ బిద్రీ, గవాసీ, వజాహీ, కులీ కుతుబ్‌షా వంటి కవులు తమ సాహిత్యంతో దక్కనీని సారవంతమూ చేశారు. హైద్రాబాద్ నగర వ్యవస్థాపకుడు ఐదవ కులీకుతుబ్‌షా పర్షియాలో దక్కనీలో గొప్ప కవితలు రాశారు. ఆయన సాహిత్యంలో వివిధ భారతీయభాషల పదాలున్నాయి! నేటికీ ప్రాచుర్యంలో ఉన్న భాగ్యనగర నిర్మాత కులీకుతుబ్‌షా కవిత (యూట్యూబ్‌లో ఇక్బాల్ బానో తదితరుల స్వరాలు పరవశింపజేస్తాయ్)
 
 పియా బాజ్ /ప్యాలా పియా జాయెన
 పియా బాజ్ ఎక్ తిల్ / జియా జాయె న
 ప్రేయసి లేకుండా పాత్రికలో మధువును తాగలేను
 ప్రేయసి లేకుండా ఒక్క శ్వాస అయినా తీసుకోలేను
 కతె పియా బిన్ / సుబురి కరూ
 కెహ జాయె అమ్మా / కియా జాయొ న’’పియా బాజ్ ’’
 తాళమంటావు ప్రేయసి దూరమైనా
 చెప్పడం తేలికే అమ్మా బతకడమే కష్టం
 నహీ ఇష్క్ జిస్ / వొ బడా కూడ్ హై
 కథీ ఉస్ సె మిల్ / బెసియ జాయె న ’’పియా బాజ్ ’’
 ప్రేమించలేని వాడు మహా క్రూరుడు
 ప్రేయసి లేకుండా జీవించే వాడెంత క్రూరుడొ
 కుతుబ్‌షా న దె/ ముఝ్ దివానె కొ పంద్
 దీవానె కొ కుచ్ / పంద్ దియా జాయె న ’’పియా బాజ్ ’’
 కుతుబ్‌షా ప్రేయసిలేని పిచ్చివాడు తర్కాలేల
 పిచ్చివాడికి హితవచనాలు చెప్పరాదు కదా


 ప్రెజెంటర్ : పున్నా కృష్ణమూర్తి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement