కేటీఆర్.. బ్రాండ్ బాజా!
► ఒలింపిక్స్ నిర్వహించేలా హైదరాబాద్ అభివృద్ధి: కేటీఆర్
► విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది
► జనాభా 10 కోట్లు దాటినా
► ఇబ్బందుల్లేకుండా మౌలిక వసతులు
► నిరంతర విద్యుత్, మహిళా భద్రత, అందరికీ విద్య, వైద్యం
► నగరంలో అన్ని ప్రాంతాలను కలిపేలా మెట్రోరైల్ నిర్మాణం
► ‘బ్రాండ్ హైదరాబాద్’లో మంత్రి కేటీఆర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. మంగళవారమిక్కడ ఎస్‌బ్రిక్స్ అనే ప్రైవేటు సంస్థ ‘బ్రాండ్ హైదరాబాద్’ పేరిట శిల్పారామంలో మంత్రి కేటీఆర్‌తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత హైదరాబాద్ మహానగర పరిధి ఐదు జిల్లాలకు విస్తరించిందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగర జనాభా 10 కోట్లకు చేరినా ఇబ్బందుల్లేని విధంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎస్‌ఆర్‌డీపీ) కింద నగరమంతటా విశాలమైన రోడ్లు, మెరుగైన రవాణా సదుపాయాలు, నిరంతర విద్యుత్, మహిళలకు భద్రత, పరిశ్రమలకు ప్రోత్సాహం, అందరికీ ప్రభుత్వ విద్య, వైద్యం తదితర వసతులను కల్పిస్తామన్నారు. మూసీని ఆనుకొని ఉన్న 2 వేల ఎకరాల్లో, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సుందరీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. అన్ని కాలనీల్లో ఆడిటోరియంల నిర్మాణం చేపడతామని, గ్రంథాలయాలు, క్రీడామైదానాలను ఆధునీకరిస్తామన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను కలిపేలా రెండోదశలో మెట్రోరైల్, ఎంఎంటీఎస్ రైలు మార్గాలను విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, స్థానిక ప్రజలు హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికల గురించి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ జవాబులిచ్చారు. నగరాభివృద్ధికోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
- క్రీడలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తాం. ఏదో ఒకనాటికి ఇండియాలో ఒలింపిక్స్ వస్తే.. అది హైదరాబాద్‌లోనే జరిగేలా ఇప్పట్నుంచే వసతులను మెరుగు పరుస్తాం.
- ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల రీజినల్ రింగురోడ్డుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ రెండింటి మధ్య శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేసి, అక్కడ నివసించే వారు అక్కడే పనిచేసే విధంగా చర్యలు చేపడతాం. మిలటరీ ప్రాంతాల్లో ఏర్పడుతున్న రహదారి సమస్యలపై రక్షణశాఖతో చర్చిస్తున్నాం.. వచ్చే మే నె లాఖరుకల్లా సమస్యలను పరిష్కరిస్తాం
- టి-హబ్‌లో ఐటీ స్టార్టప్స్ మాదిరిగానే గేమింగ్, యానిమేషన్, మల్టీమీడియా తదితర రంగాల్లో స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు మరిన్ని ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేస్తాం.
- విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ పరంగా సేవలు మెరుగు పరుస్తాం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మరింత పటిష్టం చేస్తాం. ప్రభుత్వ సంస్థలతో బ్యాలెన్స్ చేస్తూ ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తాం. టాస్క్ ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. వచ్చే మూడేళ్లలో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాం.
- తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎవరో చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాల వారికి ఎలాంటి నష్టం జరగలేదు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం మెరుగైన విధానాన్ని అవలంబిస్తోంది. న్యూయార్క్, డాలస్ నగరాల్లో మాదిరిగా పోలీస్ వ్యవస్థకు అవసరమైన సదుపాయాలను కల్పించాం.
- గతేడాది కాలంలో హైదరాబాద్‌లో కరెంట్ కోతల్లేవు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన సరఫరాను అందిస్తాం. ప్రస్తుతం ఉన్న 4,760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని 24 వేల మెగావాట్లకు పెంచేలా చర్యలు చేపట్టాం. కరెంటు ఆదా చేసేందుకు నగరంలో వీధిలైట్లకు ఎల్‌ఈడీ బల్బులను అమరుస్తున్నాం.
- స్మార్ట్‌సిటీల విషయంలో, ఎఫ్‌ఆర్‌బీఎం (రుణ పరిమితి) పెంపు విషయంలోనూ కేంద్రం సహకరించడం లేదు. అయినా వివిధ అభివృద్ధి పనులకు ఆర్థిక సాయం అందించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి.
- రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీటిని అందించేందుకు రూ.40 వేల కోట్లతో ప్రభుత్వం మిషన్ భగీరథ చేపట్టింది. హైదరాబాద్‌కు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మరో రెండు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తాం.
- ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. త్వరలో నూతన ఐటీ పాలసీ తెస్తాం.
- నగరంలో తడి చెత్త ద్వారా ఎరువును, పొడి చెత్త నుంచి విద్యుత్‌ను తయారు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం.
- ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు.. తదిరత సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం.