సదాశివ మాస్టర్‌ విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తా mother language | Sakshi
Sakshi News home page

సదాశివ మాస్టర్‌ విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తా

Published Sun, Jul 17 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

mother language

కాగజ్‌నగర్‌రూరల్‌ : మహనీయులు, మన ప్రాంతీయులైన దివంగత డాక్టర్‌ సామల సదాశివ మాస్టరు విగ్రహాన్ని కాగజ్‌నగర్‌లో ప్రతిష్టించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని సిర్పూర్‌ శాసనసభ్యులు కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక పద్మశాలి భవన్‌లో అష్టవధాని, విశ్రాంత ఆంగ్ల ఉపన్యాసకులు, కవి, సాహితీ వేత్త, అవధాన కర్త, ముద్దు రాజయ్యకు సదాశివ సాహితి పురస్కారం అందజేసిన సందర్భంలో ఏర్పాటైన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు.
            ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా డాక్టర్‌ మాడుగుల భాస్కర్‌ శర్మ వ్యవహరించగా, సమన్వయ కర్తగా తెలుగు సాహితీ సదస్సు కార్యదర్శి పెండ్యాల కిషన్‌శర్మ వ్యవహరించారు.  సాహితీ వేత్తలో అణిముత్యాన్ని కోల్పోవడం దురదుష్టాకరమని సదాశివ మాస్టర్‌ పేరుతో చేపట్టే ప్రతి కార్యక్రమానికి తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. 
సదాశివ రచనలు అనేకం
గౌరవ సలహాదారుడు కె. నారాయణగౌడ్‌ మాట్లాడుతూ తాను సామల సదాశివ శిష్యునేనని, ఆయన పేరు చిరస్థాయిగా ఉండేందుకు అందరదూ సహకరించాలని కోరారు. సదాశివ మాస్టర్‌ రచనలు ఐదువందల వరకు ఉన్నాయని వాటిని ముద్రించేందుకు అందరూ సహకరించాలని కార్యదర్శి పెండ్యాల కిషన్‌ శర్మ అన్నారు.
          డెప్యూటీ ఈవో పీఎల్‌ఎన్‌ చారి మాట్లాడుతూ సదాశివ మాస్టరు సిర్పూర్‌ తాలుకా దహెగాం మండలం తెనుగుపల్లి నివాసి అని తెలిపారు. సదాశివ మాస్టర్‌ కుమారుడు శ్రీవర్ధన్‌ తన ప్రసంగంలో తన తండ్రి శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినందుకు కతజ్ఞతలు తెలిపారు. పీఆర్టీయూ ప్రధాన సంపాదకుడు పర్వతి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తునప్పటికీ మాతృభాష తెలుగుపై పట్టు సాధించాలని కోరారు. అంతకు ముందు అవార్డు గ్రహీత ముద్దు రాజయ్యను  ఎమ్మెల్యేతో పాటు సభలో పాల్గొన్న పలువురు పట్టు శాలువలతో సన్మానించారు.  
             నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సామల సదాశివ కుమారులు రాజవర్ధన్, చంద్రశేఖర్, డాక్టర్‌ టి. దామోదర్‌రావు, తెలుగు సాహితీ సదస్సు ప్రచార సమితి అధ్యక్షుడు ఎస్‌. లక్ష్మీ రాజయ్య, ఎంఈవో జి. భిక్షపతి, కటకం మధుకర్, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు సామల రాజయ్య, ఉర్దూ కవి సాబీర్‌ హుస్సేన్, దయాకర్‌లతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమ చివరిలో ముద్దు రాజయ్యతో అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement