![తెలుగుబ్లాగ్‌ల్లో విహరిద్దాం..](/styles/webp/s3/article_images/2017/09/2/81419460911_625x300.jpg.webp?itok=a6prhkTy)
తెలుగుబ్లాగ్‌ల్లో విహరిద్దాం..
ఇంటర్నెట్.. ఈ రోజుల్లో సమస్త సమాచారం కోసం మనం ఆధారపడే సాధనం. అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్ సైతం అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్ వినియోగం మరింత పెరిగింది. కాసింత సమయం దొరికితే చాలు.. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టేస్తుంటారు. అయితే దీన్ని ఉపయోగించడానికి ఆంగ్లం అవసరం కావడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం అందుబాటులోకి వచ్చాయి తెలుగుబ్లాగులు. వీటిలో కథలు, పద్యాల నుంచి వైద్య సలహాల వరకు మనకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది. ఇందులో యాడ్ అయితే చాలు.. మన మనసులోని భావాలు సైతం మాతృభాషలో అందరితో పంచుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం మీరు క్రియేట్ చేయండి ఓ బ్లాగ్..
* మాతృభాషలోనే సమస్త సమాచారం
* సినిమాలు, ఆటలు,కవితలు లభ్యం
* అందుబాటులో కథలు, వైద్య సలహాలు
* వింతలు విశేషాలతో అబ్బురపరుస్తున్న వైనం
నల్లగొండ కల్చరల్: తెలుగులో కూడలి, జల్లెడ.. వంటి పేర్లతో బ్లాగులు కనిపిస్తున్నాయి. వీటిలో మాతృభాషలోనే సమస్త సమాచారం దొరుకుతుంది. తెలుగులో ఎవరు బ్లాగ్ క్రియేట్ చేసుకున్నా తెలుగు కూడలి, జల్లెడలో యాడ్ కావచ్చు. ఈ బ్లాగ్‌ల్లో వంటింటి విషయాల నుంచి జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, వింతలు, విశేషాలు వంటి ఎన్నో నూతన విషయాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. సినిమా, సాహిత్యం, హాస్యం, సాంకేతికం, ఫొటోలు, రాజకీయాలు, పిల్లలకు ఉపయోగపడే నీతికథలు, ఆటలు, కబుర్లు, వార్తా విశేషాలు ఇలాంటివెన్నో తెలుగు భాషల్లో దొరికే బ్లాగ్‌స్పాట్ డాట్ కామ్‌ల్లో వెతుక్కోవచ్చు.
బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం ఇలా..
మనకు జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు.. ఉచితంగా తెలుగు లేదా ఇంగ్లిష్‌లో బ్లాగ్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మన జిల్లాలోని వింతలు విశేషాలతో, జిల్లా ఇతర సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను క్రియేట్ చేయాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని. కానీ అదే సమాచారంతో నల్లగొండ డాట్ బ్లాగ్‌స్పాట్ డాట్ కామ్ పేరుతో ఓ బ్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటే చాలా సులభం. కేవలం మనకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.
దీని ద్వారా మన సమాచారాన్ని పొందుపర్చాలనుకున్నా సులువే. గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాల్‌పేపర్‌లో కుడివైపున కనిపించే యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చే స్తే అందులో బ్లాగ్స్ అనే ఒక స్పాట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మన మెయిల్‌ఐడీతో ఎంటర్ కావాలి. ఇక్కడి నుంచి తెలుగు లేదా ఇంగ్లిష్ బ్లాగ్‌ను ఎంచుకుని మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన విషయాలను ప్రపంచానికి తెలిసే విధంగా పోస్ట్ చేయవచ్చు.
నవలలు, కథల కోసం
* డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగువన్.కామ్ వెబ్‌సైట్‌లో కావల్సిననన్నీ నవలలు అందుబాటులో ఉంటాయి. ఈ సైట్‌లోకి వెళ్లి సాహిత్యం ఆప్షన్‌పై క్లిక్‌చేస్తే మనకు కావల్సిన నవలలు ఎంచుకోవచ్చు. డివోషనల్‌పై క్లిక్ చేస్తే భక్తి సమాచారం వస్తుంది. ఇదే సైట్‌లో పిల్లలకు సులభంగా అర్థమయ్యే నీతికథలు, కూరగాయల పేర్లు, పద్యాలు, ఆటలు కూడా ఉంటాయి. సైట్‌లోని కిడ్స్ ఆప్షన్‌లోకి వెళ్తే మనకు కావాల్సినవి ఎంచుకోవచ్చు. వార్తలు, పలు విశేష కథనాలు సైతం ఈ సైట్‌లో చదవవచ్చు.
* డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగుకార్నర్.కామ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లితే తెలుగుకు సంబంధించి మరిన్ని వివరాలు లభ్యమవుతాయి. ఇందులో సుమతి, వేమన, భాస్కర శతకాలు.. నీతికథలు చదువుకోవచ్చు. తెలుగు ఆటలు, అంకెలు, గుణింతాలు, రాశులు.. ఈ వెబ్‌పేజీలో చూడవచ్చు. మనకు కావల్సిన ఆప్షన్ ఎంచుకుంటే మరో పేజీ ప్రత్యక్షమవుతుంది. అందులో పూర్తి సమాచారం ఉంటుంది.
* డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఉపకారి.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కినిగె.కామ్, వాకిలి.. తదితర సైట్‌లలో తెలుగు సాహిత్యం, కథలు, నవలలు చదవవచ్చు.
మాతృభాషను గౌరవిద్దాం
* తెలుగు బ్లాగులను వినియోగించడం ద్వారా మాతృభాషను గౌరవించినట్లవుతుంది.
* సమాచారమంతా తెలుగులో ఉండడం ద్వారా ఇంగ్లిష్ రాని వారికి సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది.
* పిల్లలకు పెద్దలకు అవసరమయ్యే కథలు, సాహిత్యం, పద్యాలు అన్నీ తెలుగు బ్లాగులు, సైట్లలో అందుబాటులో ఉంటాయి.
* తెలుగు భాషలో ఉండే బ్లాగులు, సైట్లలో పిల్లలకు ఉపయోగకరమైన విషయాలూ ఉంటాయి.
* నీతికథలు, బాలల ప్రపంచం, అక్బర్, బీర్బల్ వంటి కథలు అందులో ఉంటాయి.
పిల్లల కోసం ప్రత్యేకంగా...
* పిల్లలకథలు, బాలల ప్రపంచం, బొమ్మలు, బాలల సాహిత్యం, నీతి చంద్రికలు, చందమామ కథలు అక్బర్, బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణుని కథలు, అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం లాంటి క థానికల సమాచారంతో కూడిన బ్లాగ్‌లు కూడలి, జల్లెడ, బ్లాగిల్లు, మౌలిక వంటి బ్లాగ్‌స్పాట్ డాట్ కామ్‌లలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా పెద్దవారికి అవసరమైన సాహిత్య సమావేశాలు, ఆధ్యాత్మిక రంగాలు, యువతకు అవసరమైన క్రీడలు, సినిమాలు, బ్యూటీ టిప్స్, ఇంట్లో వాళ్లందరికీ అవసరమగు కొత్త కొత్త వంటకాలు మొదలుకుని ఆయుర్వేదం టిప్స్, వాటి ఉపయోగాలను వివరించే బ్లాగ్స్ కూడా దొరుకుతాయి.
మాతృభాషలోనే కంప్యూటర్ విజ్ఞానం..
చాలా మంది ఇంటర్నెట్ వాడకం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని కనెక్షన్ తీసుకుంటారు. తీరా అందులో ఏ సమాచారం చూసినా ఇంగ్లిష్‌లోనే ఉండడం తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు తెలుగు బ్లాగ్‌లోకి వెళ్తే ఎంతో సులువుగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కంప్యూటర్ వాడకం నుంచి మొదలుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అన్నింటి గురించి తెలిపే సైట్లు సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
ఫొటోషాప్ ద్వారా మన ఫొటోలు అందమైన లోకేషన్లకు యాడ్ చేస్తూ మనకు నచ్చిన ఫ్రేముల్లో చూసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో లభించే ఫీచర్లు, యాప్స్ వరకు చాలా అంశాలు కూడా ఈ బ్లాగ్ సైట్‌లలో మనకు లభిస్తాయి. ఇవే కాకుండా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఫీచర్స్, గూగుల్ ఫీచర్స్ ఇలా చాలా విషయాలను సులువుగా తెలుసుకోవడానికి ఈ బ్లాగులు తోడ్పడుతున్నాయి.