సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ విద్యలో తమిళ మీడియంను ప్రవేశపెట్టి పాఠ్యాంశాలను బోధించేందుకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతిచ్చింది. తమిళం సహా 8 మాతృభాషలో బోధనకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. జాతీయ విద్యావిధానంలోని కొన్ని అంశాలను పలువురు వ్యతిరేకించారు. అందులో మాతృభాషలో విద్యాబోధన జరగాలని కూడా ఉంది.
మాతృభాషలో విద్యాబోధనను అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టడం ప్రారంభించింది. ఇంజినీరింగ్ విద్యను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో బోధించేందుకు కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఈ నేపథ్యంలో విధివిధానాల రూపకల్పన పనులను ఏఐసీటీఈ చేపట్టింది. మాతృభాషలో ఇంజినీరింగ్ విద్యా బోధన వల్ల గ్రామీణ, కొండప్రాంత హరిజన, గిరిజనుల కలలు నెరవేరుతాయని నమ్ముతున్నారు.
జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, జపాన్, చైనా దేశాలు తమ మాతృభాషల్లోనే పూర్తిగా విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయి. అదే రీతిలో ఏఐసీటీఈ సైతం ఆంగ్ల భాషలోని పాఠాలను 22 భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తమైంది. తమిళనాడుకు సంబంధించి ఇంజినీరింగ్ విద్యను విద్యార్థులు ఇంగ్లిష్ లేదా తమిళంలో అభ్యసించడంపై ఏఐసీటీఈ అభిప్రాయ సేకరణ చేపట్టింది. అందులో 42 శాతం మంది మాతృభాష తమిళంలోనే బోధనకు మద్దతు పలికారు. ఈ కారణంగా తమిళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తెలుగు, గుజరాతీ, కన్నడం, మలయాళం.
ఈ 8 భాషల్లో ఇంజినీరింగ్ పాఠాలను తర్జుమా చేసేందుకు ఏఐసీటీఈ నిర్ణయించుకుంది. దీని గురించి ఏఐసీటీఈ అధ్యక్షుడు అనిల్ సహస్రబుదే మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను మాతృభాషలో బోధించేందుకు పలు మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. మాతృభాషలో పాఠ్యాంశాల బోధన వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. తొలి దశలో 8 భాషల్లో సిలబస్‌ను తర్జుమా చేస్తున్నామని, గరిష్టంగా 142 పాఠ్యాంశాలు, తమిళంలో 94 పాఠ్యాంశాల సిలబస్‌ను తర్జుమా సాగుతోందన్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాతృభాషలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఏఐసీటీఈ అనుమతిచ్చిందన్నారు. తర్వాత మరో 11 భాషల్లోకి తర్జుమా చేస్తామని చెప్పారు. అన్నాయూనివర్సిటీ (చెన్నై) సహా అదే వర్సిటీకి చెందిన 12 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ తరగతులను 2010 నుంచి తమిళంలో నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment