
సాక్షి, చెన్నై: కలైంజర్ డీఎంకే పేరుతో కొత్త పార్టీ స్థాపనకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ నెల 20న మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యతకు దారి తీసింది. డీఎంకే నుంచి తన పెద్దకుమారుడు అళగిరిని కరుణానిధి గతంలో బహిష్కరించిన విష యం తెలిసిందే. కరుణానిధి మరణం తదుపరి డీఎంకేలో చేరడానికి అళగిరి ప్రయత్నాలు చేసినా స్టాలిన్ ఆసక్తి చూపలేదు. చదవండి: బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి
డీఎంకే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం 2021 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా స్టాలిన్ ముందుకెళుతున్నారు. అదే సమయంలో పార్టీలోకి తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను తీసుకురావడం, ప్రాధాన్యత ఇవ్వడంతో డీఎంకే సీనియర్లలో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో అళగిరి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరగడం డీఎంకేలో చర్చకు దారి తీసింది.
మద్దతుదారులతో భేటీ
రాజకీయాలకు అళగిరి దూరంగా ఉంటున్నా తన మాటలతో వార్తల్లో నిలుస్తున్నారు. నటుడు రజనీకాంత్ పార్టీ పెడితే ఆయన వెంట నడిచేందుకు అళగిరి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం కూడా సాగింది. అయితే రజనీ పార్టీపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 20న మదురైలోని దయ కల్యాణ మండపంలో తన మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యను సంతరించుకుంది. చదవండి: కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు..
దక్షిణ తమిళనాడులో అళగిరికి మద్దతు గణం అధికంగా ఉండడం, ప్రస్తుత డీఎంకేలో అసంతృప్తితో ఉన్న నేతలకు రహస్యంగా పిలుపు వెళ్లడం వెరసి అళగిరి ఏ ప్రకటన చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే కలైంజర్ డీఎంకే ఏర్పాటుకు గతంలో తమ నేత సిద్ధంగా ఉన్నట్టుగా మద్దతుదారులు ప్రకటించిన నేపథ్యంలో అదే నినాదాన్ని అందుకుని డీఎంకేలో చీలిక దిశగా అళగిరి వ్యూహాలు ఉండవచ్చన్న చర్చ ఊపందుకుంది. మద్దతుదారుల అభిప్రాయం మేరకు కొత్త పార్టీనా లేదా బీజేపీతో జతకట్టడమా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.