విభజనవాదం ఏర్పడింది...భాషపై గౌరవం లేకే | Separatism in respect of language Leke occurred ... | Sakshi
Sakshi News home page

విభజనవాదం ఏర్పడింది...భాషపై గౌరవం లేకే

Published Mon, Dec 23 2013 12:52 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Separatism in respect of language Leke occurred ...

 = భాషాభివృద్ధిపై శ్రద్ధ ఏదీ?
 = తెలుగు భాషా వికాస సంస్కృతీ సంవత్సరంగా ప్రకటించినా పట్టని సర్కారు
 = అమలుకునోచని సీఎం కిరణ్ వాగ్దానాలు
 = రాష్ట్ర తెలుగు భాషా వికాస ఉద్యమ అధ్యక్షుడు హనుమంతరావు ఆవేదన

 
పామర్రు, న్యూస్‌లైన్ : మాతృభాషపై గౌరవం లేకనే రాష్ట్రంలో విభజనవాదం తలెత్తిందని రాష్ట్ర తెలుగు భాషా వికాస ఉద్యమ అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత గానుగపెంట హనుమంతరావు తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఆయన బంధువులను కలిసేందుకు పామర్రు వచ్చిన సందర్భంగా ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రంలో అందరం ఒకే భాష మాట్లాడేటప్పుడు రాష్ట్రాన్ని విభజించడం అసంబద్ధమని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడం క్షంతవ్యం కాదని, తెలుగు తల్లిని నిట్టనిలువునా చీల్చడం మంచిది కాదని చెప్పారు.
 
తెలుగు భాషాభివృద్ధిపై కొరవడిన శ్రద్ధ...

తెలుగు భాషా వికాస సంస్కృతిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని, దీంతో తెలుగుభాషా విస్తరణ పనులు కుంటుపడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రస్తుత సంవత్సరాన్ని తెలుగు భాషా వికాస సంస్కృతీ సంవత్సరంగా స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారని, ఈ ఏడాది మొత్తం తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తామని, ఆ భాషకు సంబంధించిన చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తామని కూడా వాగ్దానాలు చేశారని వివరించారు. దీని కోసం జిల్లాకు కోటి రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. తెలుగు భాషా వికాస సంస్కృతీ సంవత్సరం ప్రారంభించి ఆరు నెలలు పైబడుతున్నా రాష్ట్రంలో ఏవిధమైన భాషాభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భాషాభివృద్ధి పనులు రాష్ట్రంలో 20 శాతం మాత్రమే అరకొరగా అమలవుతున్నాయని చెప్పారు.
 
భాషాభివృద్ధికి ప్రభుత్వం చేయాల్సిన పనులివీ...

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం చేయాల్సిన పనులను ఈ సందర్భంగా హనుమంతరావు వివరించారు. పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగును బోధనా భాషగా విధిగా ప్రవేశపెట్టాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక తెలుగు పండితుడిని నియమించాలని, అన్ని కార్యాలయాల్లో తెలుగు సంపూర్ణంగా అమలయ్యేందుకు పర్యవేక్షక అధికారులను మండల స్థాయిలో నియమించాలని, తెలుగు వాచకాలలో మాతృభాషపై మమకారం కలిగించే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని. ప్రతి జిల్లాకు ఏపీకి చెందిన కలెక్టర్‌లనే నియమించి.. వీటిని అమలుచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికార భాషా సంఘానికి తగిన స్వేచ్ఛ, నిధులు, అధికారాలు ఇవ్వాలని, పాఠశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులు మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేషధారణ తప్పనిసరిగా ఉండేలా చూడాలని చెప్పారు. తెలుగు భాషను తెలుగు వారే నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తెలుగు సంపూర్ణంగా అమలు అయ్యేందుకు ప్రజలు, భాషాభిమానులు, మేధావులు, విద్యార్థులు ఉద్యమాలను తీసుకురావాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement