రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనువైనదిగా పరిశ్రమల యాజమాన్యాలు భావిస్తున్నాయి.
మహబూబ్‌నగర్:రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనువైనదిగా పరిశ్రమల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో ఉండడంతో పాటు హైదరాబాద్, బెంగళూరులను కలిపే జాతీయ రహదారి- 44 కూడా జిల్లా గుండా వెళ్తుండడంతో పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలో మానవ వనరులు కూడా పుష్కలంగా ఉండడంతో సమస్య ఉత్పన్నం కాదని పరిశ్రమలు భావిస్తున్నాయి. అలాగే పరిశ్రమల స్థాపనకు భూ సమస్య రాకుండా ప్రభుత్వం కూడా పక్కా చర్యలు చేపట్టింది.
జిల్లాలో దాదాపు 13,439 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు అనువైన భూమి ఉన్నట్లు ఇదివరకే రెవెన్యూశాఖ తేల్చి చెప్పింది. రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిశ్రమలకు నూతన పారిశ్రామిక విధానం టీఎస్- ఐపాస్ ద్వారా రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ మధ్య కాలంలో అరబిందో ఫార్మా లిమిటెడ్, ఓయుఎం పరిశ్రమలు, శ్రీ వెంకటేశ్వర పరిశ్రమలు, గౌరిప్రియ పరిశ్రమలు, ఓఆర్‌ఇఎం యాక్సెక్ బయోఇంక్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి మల్టినేషన్ కంపెనీల మ్యాన్ ఫాక్చరింగ్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలోని యువతకు పెద్దఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.