నిలోఫర్ ఆసుపత్రి వద్ద మల్లు రవి ఆధ్వర్యంలో ధర్నా
వారంలో నివేదిక ఇవ్వాలని లక్ష్మారెడ్డి ఆదేశం
• కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాకు విచారణ బాధ్యతలు అప్పగించింది. నిలోఫర్ ఘటనపై ఇప్పటికే అంతర్గత విచారణ జరగగా... ముగ్గురు సభ్యుల విచారణకు ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కూడా విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మరోసారి అధికారులతో భేటీ అయ్యారు. నిలోఫర్ ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి ఉన్నత అధికారులతో మంగళవారం మరోసారి సమీక్షించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని... అలాగని ప్రస్తుతం జరిగిన తప్పును గుర్తించి సరిదిద్దడం, తప్పు చేసిన వాళ్లను శిక్షించడం జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒక ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని... నిష్పాక్షికత ఉంటుందని భావించినట్లు మంత్రి తెలిపారు. రోగుల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఈ ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి కలెక్టర్‌కు ఆదేశించారు.
వైద్య మంత్రి రాజీనామా చేయాలి...
ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాలకు బాధ్యత వహించి రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. నిలోఫర్ ఆసుపత్రిని టీపీసీసీ నేతలు, యువజన కాంగ్రెస్ నేతలతో కలసి మంగళవారం సందర్శిం చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. మల్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యరంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రుల్లోనే నిర్లక్ష్యంతో మరణాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు పట్టిన నిర్లక్ష్యపు రోగాన్ని తగ్గించాలంటే మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు. నిలోఫర్ సూపరింటెండెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ, స్వైన్‌ఫ్లూ, మెదడువాపు వంటి తీవ్రమైన జ్వరాలు గ్రామీణ ప్రాంతాల్లో విజృంభిస్తు న్నాయన్నారు. వీటిని పట్టించుకోకుండా కేవలం ప్రచారంతో ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారని ఆరోపించారు.
నిర్వహణ లోపంతోనే...
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ నిలోఫర్‌లో రోగుల మరణాలు బాధాకరమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ లోపంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు.
ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి...
వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన బాధితులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రి మరణాలపై, ప్రభుత్వ వైద్యశాలలకు సరఫరా అవుతున్న మందులు, ఫ్లూయిడ్స్‌పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.