సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారుల కొరత పోలీసు విభాగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. అవసరమైన సంఖ్యలో ఉన్నతాధికారులు లేకపోవడం, మరికొందరిని అప్రాధాన్య విభాగాలకు బదిలీ చేయడంతో ఈ ఇబ్బంది తీవ్రమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రానికి 40 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించా లంటూ.. తెలంగాణ హోంశాఖ కేంద్రానికి విన్నవించింది. త్వరలోనే ఈ మేరకు రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయనే ధీమాతో ఉంది. తగినంతమంది ఐపీఎస్‌లు లేని కారణంగానే ప్రస్తుతం 8 జిల్లాలకు నాన్ కేడర్, అదనపు ఎస్పీ స్థాయి అధికారులనే ఎస్పీలుగా నియమించారు. మరోవైపు రాష్ట్రంలో 23 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చినా.. వారికి కొత్త పోస్టింగులు ఇవ్వలేదు. ఐజీలు, డీఐజీ వంటి కీలక పోస్టులకు సైతం ఐపీఎస్ అధికారులు లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంకోవైపు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డిప్యుటేషన్లకు అనుమతి రావడంతో త్వరలోనే వారు రాష్ట్రాన్ని వీడనున్నారు. రాష్ట్రానికి అవసరానికంటే తక్కువ అధికారులను కేంద్రం కేటాయించడం కూడా ఈ పరిస్థితికి ఓ కారణమని చెప్పవచ్చు.
10 నుంచి 33 కావడంతో...: 2016 వరకు తెలంగాణలో కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 33కు పెంచింది. వీటిలో కొత్త కమిషనరేట్లు కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 18 పోలీసు జిల్లాలు.. వీటికి అదనంగా 9 పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. ఒకేసారి ఈ స్థాయిలో పెరగడంతో ఐపీఎస్‌లకు డిమాండ్ ఏర్పడింది. కొరత కారణంగా 8 జిల్లాలకు నాన్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఎస్పీలుగా నియమించారు. మరోవైపు డీసీపీ ర్యాంకుల్లోనూ వీరినే నియమించారు. మామూలుగా అయితే, ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి వేరుగా ఉండేది. ఒక ఐపీఎస్ అధికారి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడానికి కనీసం ఆరేళ్లు సమయం పట్టేది. కానీ, కొత్త జిల్లాల ఆవిర్భావంతో అనివార్యంగా ఆ అనుభవం లేకపోయినా, అసలు ఐపీఎస్ కాకపోయినా ఎస్పీలుగా పని చేయాల్సి వస్తోంది.
అదనపు బాధ్యతలు..
ఆకస్మిక బదిలీలు, పెరుగుతున్న రిటైర్మెంట్లు కూడా డిపార్ట్‌మెంట్‌లో కొత్త ఐపీఎస్‌ల అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి. ఇప్పటికే కీలకమైన కొన్ని పోస్టులు ఖాళీగా ఉండగా, మరికొన్నింటిని ఇతర అధికారులకు అదనపు బాధ్యతగా అప్పజెప్పారు. హైదరాబాద్ రేంజ్, వరంగల్ రేంజ్‌లకు డీఐజీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వెస్ట్‌జోన్ ఐజీగా ఉన్న స్టీఫెన్‌రవీంద్ర ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లి తిరిగి వచ్చారు. దీంతో అప్పటివరకు ఆ బాధ్యతలను అదనంగా పర్యవేక్షించిన వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డికి ఉపశమనం కలిగింది. జైళ్లశాఖ డీజీగా ఉన్న వీకే సింగ్‌ను కొంతకాలం క్రితం ప్రింటింగ్ విభాగానికి బదిలీ చేయడంతో ఆ బాధ్యతలను రోడ్ సేఫ్టీ అండ్ రైల్వేస్ అడిషనల్ డీజీ సందీప్ శాండిల్యకు అప్పగించారు. తర్వాత వీకే సింగ్‌ను తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీ (టీఎస్‌పీఏ) డైరెక్టర్‌గా పంపారు. ప్రింటింగ్ డీజీగా గోపీకృష్ణను నియమించారు. మొన్నటిదాకా హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న రాజీవ్ త్రివేదిని జైళ్లశాఖ డీజీగా బదిలీ చేశారు. దీంతో శాండిల్యకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభించింది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఏడీజీ (టెక్నికల్)గా సీనియర్ ఐపీఎస్ అధికారి రవిగుప్తా నియమితులయ్యారు. తన స్థానంలో మరొకరు వచ్చే వరకు రెండు పదవుల్లోనూ రవిగుప్తానే విధులు నిర్వహించనున్నారు. గత జూన్‌లో గద్వాల ఎస్పీ లక్ష్మీనాయక్, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరరావులు రిటైరయ్యారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావుకు గద్వాల ఇన్‌చార్జి ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.
త్వరలో రిటైరయ్యేది వీరే..
ప్రస్తుతం అడిషనల్ సీపీలుగా ఉన్న ఐపీఎస్ అధికారులు మురళీకృష్ణ, శివప్రసాద్ ఆగస్టులో రిటైరయ్యారు. ప్రస్తుతం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ఎండీగా ఉన్న మల్లారెడ్డి, వరంగల్ సీపీగా ఉన్న రవీందర్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న నవీన్‌చంద్ వచ్చే ఏడాది జూన్, సెపె్టంబర్‌లలో రిటైర్ కానున్నారు. ఎస్‌ఐబీలో పనిచేస్తోన్న ప్రభాకర్‌రావు కూడా వచ్చే ఏడాదే పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు డీజీపీ ర్యాంకులో ఉన్న రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్, టీఎస్‌పీఏ అడిషనల్ డీజీగా ఉన్న వీకే సింగ్‌లు వచ్చే ఏడాదే పదవీ విరమణ చేయనున్నారు.
డిప్యుటేషన్లు సైతం..!
సీనియర్ ఐపీఎస్ అధికారులు అడిషనల్ డీజీ సౌమ్యమిశ్రా (పోలీస్ వెల్ఫేర్), ఐజీ అకున్ సబర్వాల్ (పౌరసరఫరాల శాఖ కమిషనర్)లు డిప్యుటేషన్‌కు అర్జీ పెట్టుకున్నారు. తొలుత అకున్ సబర్వాల్‌కు అనుమతి వచ్చింది. రాష్ట్రం కూడా ఇటీవల అనుమతించడంతో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. గతంలో సౌమ్య మిశ్రాను ఒడిశా క్యాడర్‌కు వెళ్ళేందుకు కేంద్రం అనుమతించగా.. రాష్ట్రం కూడా సుముఖత తెలిపింది. దీంతో ఆమె డిసెంబర్‌లో రాష్ట్రాన్ని వీడనున్నారు. మరోవైపు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సంతోష్‌మెహ్రా చేసుకున్న దరఖాస్తుకు సైతం గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. మొన్నటిదాకా టీఎస్‌పీఏ డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను ఆ విధుల నుంచి తప్పించడమూ ఇందుకు బలం చేకూరుస్తోంది.
వాస్తవ సంఖ్య ఇదీ..
తెలంగాణ రాష్ట్ర అవసరాల దష్ట్యా పోలీసుశాఖలో 139 మంది ఐపీఎస్ అధికారులు ఉండాలి. కానీ, కేంద్రం 112 మందినే కేటాయించింది. ఇందులో ఖాళీలు, రిటైర్‌మెంట్లు, ఇతర శాఖలకు బదిలీలు పోను కేవలం 96 మంది మిగిలారు. వీరిలో ఇద్దరు అధికారులు ఆగస్టులో రిటైరయ్యారు. ఇప్పటికే అకున్ సబర్వాల్ వెళ్లిపోయారు. త్వరలోనే సౌమ్యా మిశ్రా రాష్ట్రాన్ని వీడనున్నారు. దీంతో ఈ సంఖ్య 92కు పడిపోనుంది. అంటే కేంద్రం కేటాయించిన అధికారుల కంటే 20 మంది, వాస్తవ సంఖ్య కంటే 47 మంది ఐపీఎస్ అధికారులు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కనీసం 40 మంది ఐపీఎస్ అధికారులు కావాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు అనుమతి లభిస్తుందని తెలంగాణ హోంశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
వాంటెడ్ ‘ఐపీఎస్’!
Published Mon, Nov 4 2019 3:27 AM | Last Updated on Mon, Nov 4 2019 3:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment