సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న డైనమిక్ సిటీల జాబితాలో హైదరాబాద్ రెండోస్థానాన్ని దక్కించుకుంది. తొలిస్థానంలో బెంగళూరు నిలిచింది. తాజాగా జేఎల్‌ఎల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని నిర్ధారించింది. టెక్నాలజీ, ఏకో సిస్టమ్‌ల మేలు కలయికగా దూసుకుపోతున్న పలు నగరాలను జేఎల్‌ఎల్ సంస్థ నిర్వాహకులు తమ సర్వే కోసం ఎంచుకున్నారు. తొలి 20 అగ్రగామి డైనమిక్ నగరాల జాబితాలో మన దేశంలోని ఢిల్లీ 4, పూణె 5, చెన్నై 7, కోల్‌కతా 15వ ర్యాంక్స్‌తో చోటు దక్కించుకున్నాయి. (హనోయి 3వ ర్యాంక్, నైరోబి 6వ ర్యాంక్, హోచిమిన్ 8, గూంగ్జ్ 10వ ర్యాంక్‌లో నిలిచాయి) ఈ జాబితాలో ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచే 19 నగరాలు చోటు దక్కించుకోవడం విశేషం. క్రమబద్ధమైన పట్టణీకరణ, వేగవంతమైన ఆర్థికావృద్ధి ఆధారంగా ఈ ర్యాంక్స్ ఇచ్చారు. అయితే, గత ఏడాది ‘సిటీ మూమెంటమ్’ ఎడిషన్‌లో హైదరాబాద్ తొలిస్థానంలో నిలవగా బెంగళూరు 2వ స్థానంలోను, పూనె 4, కోల్‌కతా 5, ఢిల్లీ 8వ స్థానాలు అందుకున్నాయి. ఏదేమైనా తొలి రెండు స్థానాలు హైదరాబాద్, బెంగళూర్లకు మాత్రమే దక్కడం విశేషం.
రియల్ ‘టెక్’నిక్.. అదే టానిక్
రియల్ ఎస్టేట్, ఆర్ధికాభివృద్ధికి టెక్నాలజీ రంగం కీలకం. ఈ అగ్రగామి నగరాలు బలమైన టెక్నాలజీ, సృజనాత్మకమైన ఏకో సిస్టమ్ కలిగి ఉన్నాయి. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరాలు గత కొన్నేళ్లుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో విజయవంతమవుతున్నాయి. భారీ టెక్ సంస్థలు మాత్రమే కాదు బలమైన స్టార్టప్ కల్చర్ కూడా నగరాల వృద్ధి వేగానికి తోడవుతోందని సర్వే నిర్వాహక సంస్థ జేఎల్‌ఎల్ ఇండియా సీఈఓ కంట్రీ హెడ్ రమేష్ నాయర్ తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ రెండూ గత కొంతకాలంగా విస్తృతమైన ఐటీ కార్యకలాపాలకు, ఇటీవల స్టార్టప్ కల్చర్‌కు చిరునామాగా మారి అగ్రగామి నగరాలుగా నిలిచాయి. మౌలికమైన సంస్కరణల్లో వేగం కారణంగా విదేశీ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు వీటి ఎదుగుదల నుంచి లాభాలను అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తనకున్న సాటిలేని ఎదుగుదల అవకాశాల ద్వారా గత కొన్నేళ్లుగా హైదరాబాద్ పెట్టుబడి దారుల గమ్యంగా ఎదిగింది. ప్రపంచ నలుమూలల నుంచీ మన నగరానికి టెక్నాలజీ ఆధారిత సంస్థలు వెల్లువలా పెట్టుబడులను తరలిస్తున్నాయి. రియల్ మార్కెట్ పరంగా గత కొన్నేళ్లుగా దేశంలో మంచి ఊపు మీద ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. అదేవిధంగా దేశపు సిలికాన్ వ్యాలీగా బెంగళూరు కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. అంతేకాకుండా 3వ అతిపెద్ద హాస్పిటాలిటీ మార్కెట్ రిటైల్ మార్కెట్లు కూడా దీని పురోగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment