Number One position
-
2047 నాటికి మన దేశమే నంబర్ వన్
హైదరాబాద్: అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన 2047 నాటికి భారత్‌ను నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న 25 ఏళ్లను అమృత కాలంగా పరిగణిస్తూ రాజకీయాలకతీతంగా దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగం, పేదరికం లేనటువంటి దేశంగా అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు ఆధ్వర్యంలో సోమవారం బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయం వద్ద తిరంగా ర్యాలీని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి వారిలో వెలుగులోకి రానివారి జీవిత చరిత్రను, ఆధ్యాత్మికమైన ప్రముఖ వ్యక్తుల చరిత్రను రేపటి తరానికి అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గత ఏడాది దేశంలో 25 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేశారని, అదే స్ఫూర్తితో ఆగస్టు 15, జనవరి 26న ప్రతి భారతీయుడి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. 75 మీటర్ల జాతీయ జెండాతో బర్కత్‌పురా చమన్ నుంచి కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్ విగ్రహాం వరకు తిరంగా ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి జి.కావ్యారెడ్డి, బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి, నీరజ, కార్పొరేటర్లు బి.పద్మ వెంకట్‌రెడ్డి, కన్నె ఉమారమేష్ యాదవ్, వై.అమృత, పార్టీ నేతలు అట్లూరి సుభాషిణి, కృష్ణాగౌడ్, ఎ.సూర్యప్రకాష్ సింగ్, ఎడెల్లి అజయ్ కుమార్, సి.నందకిషోర్ యాదవ్, సి.వినోద్ యాదవ్, వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
Henley Passport Index 2023: సింగపూర్ పాస్‌పోర్టు పవర్ఫుల్ ..!
లండన్: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా సింగపూర్ నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఈ దేశం పాస్‌పోర్టు ఉంటే ఎలాంటి వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించవచ్చు. ఇన్నాళ్లూ నెంబర్ వన్ స్థానంలో ఉంటూ వచ్చిన జపాన్ను తోసిరాజని సింగపూర్ మొదటి ర్యాంక్ దక్కించుకుంది. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ 2023 సంవత్సరానికి విడుదల చేసిన జాబితాలో సింగపూర్ తొలిస్థానంలో నిలిస్తే భారత్ 80వ ర్యాంక్ దక్కించుకుంది. భారత్ వీసా ఉంటే ఇండోనేసియా, రువాండా, జమైకా, శ్రీలంక వంటి దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. కానీ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాలకు భారతీయులు వెళ్లాలంటే వీసా తీసుకొని తీరాలి. అమెరికా, చైనా, రష్యా, జపాన్ సహా పలు యూరోపియన్ యూనియన్ దేశాలకు వీసా తప్పకుండా తీసుకోవాలి. వీసా లేకుండా పాస్ పోర్టు సాయంతో ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఐఏటీఏ) ఇచ్చే డేటా ఆధారంగా తొలిసారిగా ఈ జాబితా రూపొందించింది. జాబితాలో అమెరికాకు ఎనిమిదో స్థానం, యూకే నాలుగో ర్యాంకులో ఉంటే అట్టడుగు స్థానంలో అఫ్గానిస్తాన్ నిలిచింది. -
హైదరాబాద్.. డైనమిక్ సిటీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న డైనమిక్ సిటీల జాబితాలో హైదరాబాద్ రెండోస్థానాన్ని దక్కించుకుంది. తొలిస్థానంలో బెంగళూరు నిలిచింది. తాజాగా జేఎల్ఎల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని నిర్ధారించింది. టెక్నాలజీ, ఏకో సిస్టమ్‌ల మేలు కలయికగా దూసుకుపోతున్న పలు నగరాలను జేఎల్ఎల్ సంస్థ నిర్వాహకులు తమ సర్వే కోసం ఎంచుకున్నారు. తొలి 20 అగ్రగామి డైనమిక్ నగరాల జాబితాలో మన దేశంలోని ఢిల్లీ 4, పూణె 5, చెన్నై 7, కోల్‌కతా 15వ ర్యాంక్స్‌తో చోటు దక్కించుకున్నాయి. (హనోయి 3వ ర్యాంక్, నైరోబి 6వ ర్యాంక్, హోచిమిన్ 8, గూంగ్జ్ 10వ ర్యాంక్‌లో నిలిచాయి) ఈ జాబితాలో ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచే 19 నగరాలు చోటు దక్కించుకోవడం విశేషం. క్రమబద్ధమైన పట్టణీకరణ, వేగవంతమైన ఆర్థికావృద్ధి ఆధారంగా ఈ ర్యాంక్స్ ఇచ్చారు. అయితే, గత ఏడాది ‘సిటీ మూమెంటమ్’ ఎడిషన్‌లో హైదరాబాద్ తొలిస్థానంలో నిలవగా బెంగళూరు 2వ స్థానంలోను, పూనె 4, కోల్‌కతా 5, ఢిల్లీ 8వ స్థానాలు అందుకున్నాయి. ఏదేమైనా తొలి రెండు స్థానాలు హైదరాబాద్, బెంగళూర్‌లకు మాత్రమే దక్కడం విశేషం. రియల్ ‘టెక్’నిక్.. అదే టానిక్ రియల్ ఎస్టేట్, ఆర్ధికాభివృద్ధికి టెక్నాలజీ రంగం కీలకం. ఈ అగ్రగామి నగరాలు బలమైన టెక్నాలజీ, సృజనాత్మకమైన ఏకో సిస్టమ్ కలిగి ఉన్నాయి. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరాలు గత కొన్నేళ్లుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో విజయవంతమవుతున్నాయి. భారీ టెక్ సంస్థలు మాత్రమే కాదు బలమైన స్టార్టప్ కల్చర్ కూడా నగరాల వృద్ధి వేగానికి తోడవుతోందని సర్వే నిర్వాహక సంస్థ జేఎల్ఎల్ ఇండియా సీఈఓ కంట్రీ హెడ్ రమేష్ నాయర్ తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ రెండూ గత కొంతకాలంగా విస్తృతమైన ఐటీ కార్యకలాపాలకు, ఇటీవల స్టార్టప్ కల్చర్‌కు చిరునామాగా మారి అగ్రగామి నగరాలుగా నిలిచాయి. మౌలికమైన సంస్కరణల్లో వేగం కారణంగా విదేశీ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు వీటి ఎదుగుదల నుంచి లాభాలను అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తనకున్న సాటిలేని ఎదుగుదల అవకాశాల ద్వారా గత కొన్నేళ్లుగా హైదరాబాద్ పెట్టుబడి దారుల గమ్యంగా ఎదిగింది. ప్రపంచ నలుమూలల నుంచీ మన నగరానికి టెక్నాలజీ ఆధారిత సంస్థలు వెల్లువలా పెట్టుబడులను తరలిస్తున్నాయి. రియల్ మార్కెట్ పరంగా గత కొన్నేళ్లుగా దేశంలో మంచి ఊపు మీద ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. అదేవిధంగా దేశపు సిలికాన్ వ్యాలీగా బెంగళూరు కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. అంతేకాకుండా 3వ అతిపెద్ద హాస్పిటాలిటీ మార్కెట్ రిటైల్ మార్కెట్లు కూడా దీని పురోగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. -
ఆదాయ వృద్ధిలో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ టాప్
సాక్షి, విశాఖపట్నం: ఆదాయ వృద్ధిలో దేశంలోనే బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్(రెండు తెలుగు రాష్ట్రాలు) నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆ సంస్థ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ పీవీ మురళీధర్ తెలిపారు. విశాఖలోని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల కష్టఫలమే ఈ స్థానమన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో 8 శాతం వృద్ధి రేటు సాధించగలిగామని చెప్పారు. దేశంలోనే ఏపీ టెలికాం నెంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. సెల్యులర్ విభాగంలో 10%, బ్రాడ్‌బ్యాండ్‌లో 5% వృద్ధి రేటు సాధించామన్నారు. రూ.160 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. 17 లక్షల కనెక్షన్లతో మంచి రెవెన్యూ సాధించగలిగామని చెప్పారు. డేటా విషయానికొస్తే ఐదు శాతం పెరిగిందన్నారు. సర్కిల్ పరిధిలో 2జీలో 7,500 2జీ టవర్లు, 3,500 3జీ టవర్లు ఏర్పాటు చేశామని, మరో 1450 3జీ టవర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరికి 4జీ సేవల్లో అడుగుపెట్టనున్నట్టు తెలిపారు.