హైదరాబాద్: అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన 2047 నాటికి భారత్‌ను నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న 25 ఏళ్లను అమృత కాలంగా పరిగణిస్తూ రాజకీయాలకతీతంగా దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగం, పేదరికం లేనటువంటి దేశంగా అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు ఆధ్వర్యంలో సోమవారం బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయం వద్ద తిరంగా ర్యాలీని కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి వారిలో వెలుగులోకి రానివారి జీవిత చరిత్రను, ఆధ్యాత్మికమైన ప్రముఖ వ్యక్తుల చరిత్రను రేపటి తరానికి అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గత ఏడాది దేశంలో 25 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేశారని, అదే స్ఫూర్తితో ఆగస్టు 15, జనవరి 26న ప్రతి భారతీయుడి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు.
75 మీటర్ల జాతీయ జెండాతో బర్కత్‌పురా చమన్ నుంచి కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్ విగ్రహాం వరకు తిరంగా ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి జి.కావ్యారెడ్డి, బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి, నీరజ, కార్పొరేటర్లు బి.పద్మ వెంకట్‌రెడ్డి, కన్నె ఉమారమేష్ యాదవ్, వై.అమృత, పార్టీ నేతలు అట్లూరి సుభాషిణి, కృష్ణాగౌడ్, ఎ.సూర్యప్రకాష్ సింగ్, ఎడెల్లి అజయ్ కుమార్, సి.నందకిషోర్ యాదవ్, సి.వినోద్ యాదవ్, వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment