దుబాయ్‌లో జోగాపూర్ యువకుడి హత్య
నిందితులు వేములవాడ మండలవాసులే..!
చందుర్తి: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి బైరి బాలాజీ(35) దారుణ హత్యకు గురయ్యాడు. వేములవాడ మండలానికి చెందిన ఇద్దరు ఈ ఘాతు కానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. బైరి బాలాజీ ఉపాధి కోసం మూడేళ్లుగా దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలోనే 10 నెలల క్రితం ఇక్కడకు వచ్చి మళ్లీ దుబాయ్ వెళ్లాడు. ఇతడితోపాటు వేములవాడ మండలం మర్రిపల్లి, నూకలమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు శుక్రవారం దుబాయ్ సరిహద్దు ప్రాంతంలోకి విందు చేసుకునేందుకు వెళ్లారు. విందు అనంతరం మర్రిపల్లికి చెందిన ఓ మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని బాలాజీ బయట పెట్టాడు.
సదరు మహిళ అందులోని ఒకరికి బంధువు కావడంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహించిన ఇద్దరు యువకులు కలిసి ఇనుపరాడ్‌తో బాలాజీపై దాడి చేసి కొట్టారు. ఈ ఘటనలో తీవ్రరక్తస్రావమై బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తమకు శిక్ష పడుతుందని భావించిన ఆ ఇద్దరు యువకులు బాలాజీ శవాన్ని డ్రైనేజీలోకి నెట్టేశారు. నాలుగైదు రోజులుగా బాలాజీ తన గదికి వెళ్లకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐడీ పోలీసులు రంగంలోకి దిగి సెల్ నంబర్ ఆధారంగా శవాన్ని కనుగొన్నారు. నిందితులను గుర్తించినట్లు స్నేహితులు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు.