
ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి
విద్యార్థులకు ఢిల్లీ ఐఐటీ డెరైక్టర్ రాంగోపాల్‌రావు పిలుపు
జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల కోసం వెంపర్లాడకూడదని.. ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని ఢిల్లీ ఐఐటీ డెరైక్టర్ వి.రాంగోపాల్ రావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలన్నారు. ప్రస్తుతం క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లే లక్ష్యంగానే విద్యార్థులు కళాశాలల్లో అడుగు పెడుతున్నారని పేర్కొన్నారు. కోర్సుల ఎంపికల నుంచే ఆ ధోరణి మొదలవుతోందన్నారు. చివరకు ఐఐటీల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన రాంగోపాల్‌రావు ఇటీవల ఐఐటీ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ పూర్వ విద్యార్థుల సంఘం (కోసా) ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాంగోపాల్ రావు భారత జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మారుమూల ప్రాంతమైన కొల్లాపూర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. రాంగోపాల్ రావు చేసిన పరిశోధనలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోపడుతున్నాయన్నారు. బంగారు తెలంగాణ కోసం, నిరుద్యోగ యువత, రైతుల కోసం ఆయన సేవలను సద్వినియోగం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో చుక్కా రామయ్య, గాయకుడు దేశపతి శ్రీనివాస్, కోసా ఫౌండర్ ఖాజా మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.