మహబూబ్‌నగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ మానసపుత్రికగా భావిస్తున్న ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న భారీ సాగునీటి ప్రాజెక్టుల శాఖ మంత్రి టి.హరీష్‌రావు రెండు నెలలుగా జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఎంజీఎల్‌ఐ, కోయల్‌సాగర్, నెట్టెంపాడు, భీమాతో పాటు నూతనంగా చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల పథకాల పట్ల చూపుతున్న శ్రద్ధ మిషన్ కాకతీయ పట్ల చూపడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లా కేంద్రంలో సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా ఈ పథకాన్ని సాధారణ అంశంగా చర్చించి చేతులు దులుపుకున్నారని విపక్షపార్టీల ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రతిపక్షపార్టీల ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేయకుండా అధికారపార్టీ టీఆర్‌ఎస్ తమ సొంత కార్యక్రమం మాదిరిగా వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
258 చెరువులకు మాత్రమే ఆమోదం
మిషన్ కాకతీయకు అవసరమైనన్ని నిధులు విడుదల చేస్తే జిల్లాలో ఎంపికచేసిన 7396 చెరువులు, కుంటలను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టి ఆయా వనరుల కింద సాగునీటిని అందించొచ్చని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖర్చు పరిమితి లేకుండా ఒక్కోచెరువుకు పాటుకాల్వలు, ఇరిగేషన్ చానల్స్, చెరువు కట్టల సామర్థ్యం పెంపుదల, అలుగులు, తూములు, పూడిక తీసివేత తదితర పనులు పూర్తిచేసి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. కానీ ఈ ఏడాదికి 20శాతం వాటికి మాత్రమే పనులు చేపట్టాలని నిబంధనలు విధించడంతో జిల్లాలో 1477 చెరువులను ఎంపికచేశారు. వాటిలో ఇప్పటిదాకా 683 వనరులకు రూ.224కోట్లు ఖర్చవుతాయని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. కాగా, అందులో రూ.16.33కోట్ల విలువతో 55 పనులకు జనవరి 23వ తేదీన, రూ.58.73కోట్ల విలువైన 203 పనులకు ఫిబ్రవరి 3న పరిపాలనా ఆమోదం ఇచ్చింది. కానీ ఇంతవరకు నిధులు విడుదల కాలేదు.
లక్ష్యం ఘనం.. పనులే ఆలస్యం!
Published Fri, Feb 6 2015 2:05 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement