సాక్షి, హైదరాబాద్ : ‘‘గొప్ప ధనవంతులైన గిరిజనులు ఏ రాష్ట్రంలో ఉన్నారంటె తెలంగాణల్నే అన్న పేరు ఐదారేళ్లలోనే రావాలె. అట్ల వస్తె ఈ బిల్లు సార్థకం. మన బతుకు సార్థకం. వచ్చిన తెలంగాణ సార్థకం’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. తండాలకు గ్రామ పంచాయతీలుగా గుర్తింపు కల్పిస్తూ కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినందుకు లంబాడా ప్రతినిధులు శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. ‘‘సర్పంచులం అయినం కదా అని గిరిజనులు సంతోషపడితే కాదు. డబ్బు నేరుగా తండాకు వస్తున్నది. మధ్యలో ఏ దళారీ లేడు. ఎవరినీ అడుక్కునేది లేదు. మీకు స్వతంత్య్రం వచ్చింది. మీ రాజ్యం వచ్చింది. మీకే పవర్ వచ్చింది కాబట్టి తండాలను అద్దాల్లెక్క మంచిగ తీర్చిదిద్దాలె. ఆ బాధ్యత పెద్దలు తీసుకోవాలె. గ్రామాల కన్నా తండాలు బాగున్నాయన్న పేరు తెచ్చుకుంటే ఈ బిల్లు సార్థకమైనట్లు లెక్క’’అని పేర్కొన్నారు.
‘‘సర్పంచ్‌గా ఎవరో ఉంటే దండం పెట్టుకుని దరఖాస్తు చేసుకోవడానికి మీరు తిరిగిన్రు. ఇప్పుడు మీరే నాయకులైనంక కూడా పని జరగకుంటే చెడ్డ పేరు ఎవరికికొస్తది? అప్పుడు నవ్వెటోని ముందు జారిపడ్డట్టయితది. పడుదామా? గెలుద్దామా? గెలుద్దాం, ఎలాగైనా’’అని గిరిజనులకు పిలుపునిచ్చారు. ‘‘వచ్చే జూలైతో పంచాయతీల టర్మ్ అయిపోతది. 12,741 గ్రామ పంచాయతీలు ఏర్పడితే వాటిలో 2,600 గ్రామాల్లో అచ్చంగా గిరిజనులే ఉంటరు. 100 శాతం గిరిజనుల జనాభా ఉన్న గ్రామాలకు వారే ప్రాతినిధ్యం వహిస్తరు. మిగతా చోట్ల కూడా జనాభా దామాషా ప్రకారం వారికి ప్రాతినిధ్య అవకాశముంటది. అంటే రాష్ట్రంలో ఎప్పుడు చూసినా 3,000 మంది గిరిజన సర్పంచిలుంటరు. ఇది చాలా అద్భుతమైన విషయం. సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాల్లో కూడా ఇలా 3 వేల మంది గిరిజన సర్పంచులున్న సందర్భం లేదు’’అని పేర్కొన్నారు.
ఐదేళ్లలో కనీసం రూ.20 లక్షలు
‘‘ఒక్కో గ్రామ పంచాయతీకి ఏటా కనీసం రూ.3 లక్షలొస్తయి. బడ్జెట్‌లో పైసలు పెట్టినం. ఉపాధి హామీ డబ్బులు, కేంద్రమిచ్చేవి, ఇలా రకరకాలుగా డబ్బులు సమకూరుతయి. చిన్న గ్రామ పంచాయతీకి కూడా ఐదేళ్ల టర్మ్‌లో కనీసం రూ.20 లక్షలొస్తయి’’అని సీఎం వివరించారు.ఒక తండాలో కేవలం 106 మంది ప్రజలే ఉన్నా అది గ్రామానికి 16 కి.మీ. దూరంలో ఉండటంతో పంచాయతీగా చేశామని చెప్పారు. వాళ్లకూ ఐదేళ్లలో రూ.15 లక్షలొస్తాయన్నారు. ‘‘గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చగా, జనం అనారోగ్యానికి గురవని పద్ధతిలో తీర్చిదిద్దితే గొప్ప పేరొస్తది. గిరిజనులు ఎక్కువ శాతముండే రాష్ట్రం తెలంగాణ. గిరిజనులకు ఒక ఏడాదిలో కేటాయించిన డబ్బులు ఖర్చవకున్నా అవి మురిగిపోకుండా మరుసటేడు ఖర్చు చేయాలని సబ్ ప్లాన్ పెట్టినం. చాలా డబ్బుంది. గతేడాది రూ.9 వేల కోట్లు, ఈసారి రూ.10 వేల కోట్లు పెట్టుకున్నం. వీటిలో రూ.7.5 వేల కోట్లు కచ్చితంగా వస్తయి. అట్ల ఐదేళ్ల టర్మ్‌లో రూ.36 వేల కోట్ల దాకా వస్తయి. అంత ఖర్చు పెడితే ఇక గిరిజనుల్లో పేదరికం ఎందుకుండాలె?’’అని సీఎం అన్నారు. ఎట్టి పరిస్థితిల్లో పేదరికం ఉండకూడదని, విద్యావంతులు అందుకు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
తండాల్లోనే సబ్‌ప్లాన్ రూపకల్పన
‘‘మూడు వేల గిరిజన గ్రామాలకు మీరే ప్రతినిధులైనరు గనుక గ్రామాల్లో 100 గిరిజన కుటుంబాల లెక్క పత్రం రాసే బాధ్యత సర్పంచ్ తీసుకోవాలె. ట్రైబల్ సబ్ ప్లాన్ ఇద్దరు అధికారులో, ఓ మంత్రో, ముఖ్యమంత్రో సెక్రటేరియట్ల తయారు చేయొద్దు. మీరే సర్పంచులుగా ఉన్న మీ గ్రామ సచివాలయంలో తయారు కావాలె. ఏ ఊరి సబ్ ప్లాన్ ఆ ఊళ్లె కావాలె. మీ ఊళ్లె గిరిజన కుటుంబాలెన్ని, వారికున్న భూమెంత, అప్పెంత, ఎంత చదువుకున్నరు వంటి మొత్తం సమాచారం సేకరించాలె. కంప్యూటర్‌లో ఫార్మాట్ పెట్టి ఏ ఊరికి ఆ ఊరు తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టి మీ ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా మాట్లాడాలె. కచ్చితంగా ఆ అవసరాలు తీరేలా బడ్జెట్ తయారు కావాలె. దాన్ని అమలు చేసుకోవాలె. 70 ఏళ్లుగా జరిగినట్టే ఇకపైనా జరిగితే లాభం లేదు. ఇప్పుడు డబ్బులు, రాజ్యం మీ చేతిలో ఉన్నాయి. అనుకూలమైన ప్రభుత్వముంది. మీరనుకున్నది సాధించుకునే అవకాశముంది’’అని ఉద్బోధించారు. రాబట్టుకోకపోతే తప్పు మీదవుతది తప్ప ఇంకొకరిది కాదని చమత్కరించారు.
బాగా డబ్బులున్న రాష్ట్రం మనది
‘‘చిన్న పిల్లలు ఎట్టి పరిస్థితిలో బడికి పోవాలె. బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకున్నం. ఒక విద్యార్థి మీద రూ.లక్ష ఖర్చు చేస్తున్నం. బాగా లేని కొన్ని ఆశ్రమ పాఠశాలలను గురుకులాల్లా మార్చుతం. చదువుకునే వారు చదువుకుంటుంటే, సాగులో ఉన్న గిరిజన కుటుంబాలెన్ని? వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయమేంది? చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నవాళ్లు కాంట్రాక్టర్‌గా మారాలన్నా, వ్యాపారం చేయాలనుకున్నా ఆ వివరాలు సేకరించాలె. సబ్ ప్లాన్ ద్వారా తండాల్లో అతి పేదలకు తొలి సాయం అందాలె’’అని సీఎం అన్నారు. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఏటా 22 శాతం పెరుగుతోందని, దేశంలో మరే రాష్ట్రం ఇంత వృద్ధి సాధించడం లేదని చెప్పారు.
‘2018–19లో నగదు రూపంలో రూ.16 వేల కోట్లు అదనంగా వస్తాయి. ఏటా రూ.15 వేల కోట్లు పెరిగే బడ్జెట్ మన రాష్ట్రానిది. అంటే ఇంత డబ్బు రాష్ట్రం వద్ద ఉంది. కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షా 16 వేలు అందిస్తున్నం. కేసీఆరే లక్ష ఇస్తుండు, నువ్వేమిస్తవని కొందరు దుర్మార్గులైన పెళ్లి కొడుకులు అడుగుతున్నట్టు నాకు సమాచారముంది. తండాలో పెళ్లి ఖర్చులపై లిమిట్ పెట్టుకోవాలె. ఆడపిల్ల పెళ్లి కుటుంబానికి ఆర్థిక భారం కావొద్దనే ఈ పథకం తెచ్చినం’’ అని హితవు పలికారు. కార్యక్రమంలో ఎంపీలు సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రాంచంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ గోవింద్ నాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment