సింహవాహినికి ‘బంగారు బోనం’ | kcr participates in Bonalu festival | Sakshi
Sakshi News home page

సింహవాహినికి ‘బంగారు బోనం’

Published Mon, Jul 21 2014 1:45 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

సింహవాహినికి ‘బంగారు బోనం’ - Sakshi

సింహవాహినికి ‘బంగారు బోనం’

 రాష్ట్రప్రభుత్వం తరఫున సమర్పించిన సీఎం కేసీఆర్
 పాతనగరంలో వైభవంగా రాష్ట్ర పండుగ

 
 సాక్షి, హైదరాబాద్ : అక్కడ భక్తి పరవళ్లు తొక్కింది. లయబద్ధమైన డప్పుల దరువులకు పోతురాజులు అడుగులు కదిపారు. అమ్మ కళను ఆవహించుకున్న శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. అంబరాన్నంటిన సంబరాల మధ్యన ఫలహార బండ్ల ఊరేగింపు సాగింది. బోనాలు పట్టిన మహిళలు అమ్మవారికి తొట్టెలను సమర్పించి పులకితులయ్యారు. ఇదీ ఆదివారం పాతనగరంలో కన్నుల పండువగా సాగిన రాష్ట్రపండగ బోనాల జాతర తీరు. మహానగరిలో కుగ్రామ వాతావరణం ఆవిష్కృతమైన ఘట్టం.
 
 ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉదయం 11.50 గంటలకు సతీసమేతంగా విచ్చేసి లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.సీఎంకు ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకు ముందు హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయంలోనూ కేసీఆర్  ప్రత్యేక పూజలు చేశారు. మీరాలంమండిలోని మహంకాళి దేవాలయంలో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. బోనాలను రాష్ట్ర పర్వదినంగా గుర్తించడంతో నగరంలోని అన్ని ప్రధాన  దేవాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు.
 
  పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతా:సీఎం కేసీఆర్
 
 లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయాన్ని విస్తరించి  పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా  జాతర నిర్వహించుకునే అమ్మవారి ఆలయం చాలా చిన్నదిగా ఉండడం బాధాకరమన్నారు.క్షేత్రంగా విస్తరణకు అవసరమైనస్థలాన్ని సేకరిస్తామన్నారు. బోనం సమర్పించిన అనంతరం ఆయన అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. గతేడాది అమ్మవారి ఆలయానికి రమ్మని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారని.. ఆ సమయంలో తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మొక్కుకున్నానని కేసీఆర్ అన్నారు. అమ్మవారి దయతో  రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో బంగారు బోనాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నానన్నారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసి పంటలు సస్యశ్యామలంగా పండేలా దీవించాలని తల్లిని మొక్కుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు  కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిలకు అమ్మవారి ఫొటోలను జ్ఞాపికలుగా అందజేశారు.
 
 కిటకిటలాడిన సింహవాహిని ఆలయం
 
 తెల్లవారు జామునుంచేమహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి లాల్‌దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ కట్టారు. భక్తుల రద్దీతో పరిసర రోడ్లన్నీ కళకళలాడాయి. పాతబస్తీలోని మీరాలం మండి మహంకాళి దేవాలయం, ఉప్పుగూడ, సుల్తాన్‌షాహి, గౌలిపురా, మురాద్‌మహాల్, అక్కన్నమాదన్నల మహంకాళి దేవాలయం, బేలా ముత్యాలమ్మ, హరిబౌలి, రాంబక్షిబండ ,మేకలబండ, తదితర ప్రాంతాల్లోని అమ్మవార్ల ఆలయాలు  భక్తులతో కిక్కిరిసాయి. దక్షిణ మండలం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్వయంగా శాంతి భద్రతలను పర్యవేక్షించారు.
 
 ప్రముఖుల సందర్శన
 
 సీఎంతో పాటు శాసన సభ స్పీకర్ మధుసూధనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా నిజామాబాద్ ఎంపీ కవిత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రకాష్‌గౌడ్, గీతారెడ్డి, తదితరులు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
 
 బోనానికి అరకిలో బంగారం
 
 లాల్ దర్వాజ మహంకాళికి సీఎం చేతులు మీదుగా సమర్పించిన బంగారు బోనం తయారీకి అరకిలో బంగారాన్ని వినియోగించారు. దాతల సాయంతో శివ అనే భక్తుడు ఈ బోనాన్ని రూపొందించాడు.
 
 ఊరేగింపుగా.. ‘నేత’
 
 విలక్షణ శైలిలో మైసమ్మకు చీర సమర్పించిన పద్మశాలీ భక్తులు
 
 హైదరాబాద్ : వారు భక్తిని విలక్షణంగా చాటుకున్నారు. హైదరాబాద్ నగరంలోని కార్వాన్ దర్బార్ మైసమ్మ తల్లికి స్థానిక పద్మశాలీ భక్తులు తమ నేత నిపుణతను ప్రదర్శిస్తూ పట్టు చీరను సమర్పించారు. అందర్నీ ఆకట్టుకున్న ఈ ప్రదర్శన ఆదివారం జరిగింది. కార్వాన్‌లోని మార్కండేయ భవన్‌నుంచి కొందరు పద్మశాలీ వర్గానికి చెందిన భక్తులు మగ్గంపై నేతపని చేస్తూనే ఊరేగింపుగా వచ్చారు. తొలుత వారు మార్కండేయ భవన్‌లో ఉదయం తొమ్మిది గంటలకు నేతను ప్రారంభించి రెండు గంటల వరకూ ఏకధాటిగా సాగించారు. అనంతరం మూడుగంటలకు నేత ఊరేగింపును ప్రారంభిస్తూ నాలుగు గంటలకు ఆలయం వద్దకు చేరుకునే సరికి  అల్లిక పూర్తిచేసి అమ్మవారికి పట్టుచీరను భక్తి ప్రపత్తులతో అందించి పులకితులయ్యారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement