
సాక్షి, హైదరాబాద్ : రానున్న రెండేళ్లకుగాను రూపొందించిన ఎక్సైజ్ పాలసీకి నేడు గ్రీన్‌సిగ్నల్ లభించనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సమర్పించిన ఫైలును పరిశీలించి సీఎం కేసీఆర్ నేడు సంతకం చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 2017–19 సంవత్సరాలకుగాను రూపొందించిన పాలసీలో కొన్ని మార్పులు చేసి కొత్త పాలసీకి సంబంధించిన ఫైలును ఎక్సైజ్ అధికారులు సీఎంకు పంపారు. రెండు, మూడు ప్రతిపాదనలతో కూడిన ఈ ఫైలుపై సీఎం సంతకం తర్వాత, ఆయన సూచనలకు అనుగుణంగా మార్పులుచేసి కొత్త పాలసీని ఎక్సైజ్ శాఖ విడుదల చేయనుంది. కాగా, నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో ఈ పాలసీ అమల్లోకి రావడంతోపాటు కొత్త మద్యం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో కొత్త షాపుల ఏర్పాటుకుగాను దసరా తర్వాత వారం రోజులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈనెల 22 లేదా 23 తేదీల్లో డ్రాలు ఉండే విధంగా టెండర్ నోటిఫికేషన్ రూపొందిస్తారని, టెండర్ ఫీజు రూ.2 లక్షలకు పెంచనున్నారని సమాచారం.