ఇలాంటి తెలంగాణ చూస్తామనుకోలేదు
► జేఏసీ చర్చాగోష్టిలో కోదండరాం
► నిర్బంధాలపై ప్రతిఘటించాలని నేతల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అణచివేత పెరిగిపోతోందని.. ఇలాంటి నిర్బంధాల తెలంగాణను చూస్తామనుకోలేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫె సర్ ఎం.కోదండరాం అన్నారు. ‘సభలు, సమావేశా లు జరుపుకొనే హక్కు–ప్రభుత్వ ఆంక్షలు’ అనే అంశంపై శనివారం తెలంగాణ జేఏసీ హైదరా బాద్‌లో చర్చాగోష్టి నిర్వహించింది. కోదండరాం మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యం ఉంటేనే సమాజం నిలబడుతుందన్నారు.
తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకున్న ప్రతీ విద్యార్థి సూసైడ్ నోట్‌లో తమ ఆకాంక్షలు రాశారని, అమరవీరుల ఆకాంక్షలను అమలుచేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నామని అన్నారు. నేరెళ్లలో అన్యాయాన్ని ప్రశ్నించిన దళితులను పోలీసులు అమానవీయంగా, అప్రజా స్వామికంగా కొట్టారని విమర్శించారు. దీనిపై నేరెళ్లలో సభకు అనుమతి ఇస్తే కొంపలు మునుగు తాయా అని కోదండరాం ప్రశ్నించారు. 144 , 38,151 సెక్షన్లను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోం దని విమర్శించారు. ఈ సెక్షన్లను ఉపయోగించు కుని శాంతియుతంగా, ప్రజాస్వామికంగా సభలు పెట్టుకునే హక్కును కూడా ప్రభుత్వం హరిస్తోందన్నారు.
ఇలాంటి దుస్థితి ఊహించలేదు: సంపత్
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలాంటి సభలు, సమావే శాలు జరుపుకోలేని దుస్థితి వస్తుందని ఏ తెలంగాణ వాదీ ఊహించలేదన్నారు. అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు నోరువిప్పలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. తమ గురించి మాట్లాడాలని టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులే అడుగుతున్నారని వెల్లడించారు. ప్రజలకోసం పనిచేసే న్యాయవా దులు, ఉద్యమ కారులపై పోలీసుల దాడులు టీఆర్‌ఎస్ అనుస రిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు పరాకాష్ట అని సంపత్ విమర్శించారు.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నేరెళ్ల ఘటన, ప్రభుత్వ నిర్బంధాలపై నిలదీస్తామని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పోలీసులు కేవలం సీఎం కేసీఆర్ కోసమే పని చేయవద్దని కోరారు. చట్టాలను ఉల్లంఘిస్తే పోలీసులు కూడా బాధ్యత వహిం చాల్సి వస్తుందని హెచ్చరించారు. కామారెడ్డిలో జేఏసీ సమావేశం కోసం ఏర్పాటు చేసిన టెంట్లను పడగొట్టిన టీఆర్‌ఎస్ నేతలు, కార్య కర్తలపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. బీజేపీ నేత మనోహర్‌రెడ్డి మాట్లాడు తూ ఆంక్షలు, నిర్బంధాలపై జాతీయస్థాయిలో పోరాడుదామని అన్నారు. న్యూ డెమొక్రసీ నేత గోవర్ధన్, ప్రొఫెసర్లు విశ్వేశ్వర్‌రావు, పురుషోత్తం, న్యాయవాదులు రచనారెడ్డి, గోపాలశర్మ ప్రసంగిం చారు. నిర్బంధాలపై పోరాడుతామని వారు అన్నారు. జేఏసీ నేతలు దరువు ఎల్లన్న, మాదు సత్యం తదితరులు పాల్గొన్నారు.