
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఇప్పటికే నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 66:34 నిష్పత్తిన దక్కిన నీటి వాటాల్లోంచి రాష్ట్ర నెలవారీ అవసరాలకు నీటి కేటాయింపులు చేసేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటలకు జలసౌధలో భేటీ కానుంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఇరు రాష్ట్రాలకు శుక్రవారం లేఖలు రాశారు. ఈ భేటీకి తెలంగాణ, ఏపీల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు, బోర్డు సభ్య కార్యదర్శులు హాజరు కానున్నారు. ఇప్పటికే తమకు తక్షణ అవసరాలకు లభ్యతగా ఉన్న జలాల్లో తమకు 53 టీఎంసీల మేర నీటిని తక్షణం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డుకు విన్నవించింది.
ఇందులో పోతిరెడ్డిపాడుకు 25 టీఎంసీ, హంద్రీనీవాకు 5, కృష్ణాడెల్టాకు 4, నాగార్జునసాగర్ కుడి కాల్వలకు 15, ఎడమ కాల్వకు 4 టీఎంసీలు కోరింది. ఇక తెలంగాణ తనకు 31 టీఎంసీలు అవసరమవుతుందని తేల్చింది. ఇందులో సాగర్‌ఎడమ కాల్వకు 13 టీఎంసీ, నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్ తాగునీటికి 10, కల్వకుర్తి అవసరాలకు 8 టీఎంసీలు అవసరమని తెలిపింది. ఇందులో ఇప్పటికే సాగర్‌ఎడమ కాల్వ కింద ఏపీకి 4 టీఎంసీలను కేటాయిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేయగా, మిగతా నీటి కేటాయింపులపై నిర్ణయం చేయాల్సి ఉంది. ఇక దీంతో పాటే ఎడమ కాల్వ పరిధిలో టెలీమెట్రీ వ్యవస్థ ఏర్పాటు, నీటి సరఫరా నష్టాలను అంచనా వేసేందుకు బోర్డు నేతృత్వంలోని నలుగురు సభ్యుల అధికారుల బృందం ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల్లో పరివాహక ప్రాంతంలో పర్యటించనుంది.