కబ్జా ఆకారం.. ‘లకారం’ | Land aquation on the pond goingon | Sakshi
Sakshi News home page

కబ్జా ఆకారం.. ‘లకారం’

Published Tue, Sep 29 2015 4:44 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

కబ్జా ఆకారం.. ‘లకారం’ - Sakshi

కబ్జా ఆకారం.. ‘లకారం’

ఇక ‘సీక్వెల్’..
ఆక్రమణ హద్దు మీరుతోంది..‘లకారం’ ఆకారం మారుతోంది. పట్టణం నగరంగా విస్తరించింది..ఈ చెరువు భూమి విలువ అమాంతం పెరిగింది. ఒకప్పుడు పంటలకు నెలవు..ఇప్పుడు ఆక్రమణదారులకు ఆదరవు. అంగబలం.. అర్థబలం.. అధికారపార్టీ అండుంటే ఇక్కడ పాగా వేయడం భలే సులభం..అనే రీతిలో వ్యవహారం సాగుతోంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న లకారం నానాటికీ కుచించుకుపోతుండటంపై ఇక ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు వరుసగా..
రూపురేఖలు మారుతున్న చెరువు
- ఆక్రమణ చెరలో రూ.కోట్ల విలువైన భూమి
- నానాటికీ తగ్గుతున్న చెరువు విస్తీర్ణం
- నాడు 163.15 .. నేడు 105.29 ఎకరాలే
- ప్రైవేట్ వ్యక్తుల చేతిలో 5.4.. సీక్వెల్ ఆధీనంలో 13.22 ఎకరాలు
- నోటీసులు జారీ చేసినా జంకని ఆక్రమణదారులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం:
ఖమ్మం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు ఆనవాళ్లను కోల్పోతోంది. ఒకప్పుడు ఎన్నెస్పీ కెనాల్ కింద ఉన్న ఈ చెరువు పంటల సాగుకు నెలవుగా ఉండే ది.  పట్టణం నగరంగా రూపాంతరం చెందింది.. కబ్జా కూడా విస్తరిస్తూ వస్తోం ది.  ప్రస్తుతం ఈ చెరువు కార్పొరేషన్ పరిధిలోకి రావడంతో గుంట భూమి రూ.లక్షలు పలుకుతోంది. ఈ చెరువు కింద రూ.కోట్ల విలువ చేసే భూమి ఇప్పటికే అన్యాక్రాంతమైంది. ఈ కబ్జాపై ఇక ‘సీక్వెల్’ కథనాలు...
 
ఇదీ లకారం చరిత్ర..
కార్పొరేషన్‌కు ముందు ఖానాపురం హ వేలి పంచాయతీ పరిధిలో 234, పాకబం డ బజారులోని సర్వేనంబర్ 66లో మొ త్తంగా లకారం చెరువు విస్తీర్ణం 163.15 ఎకరాలు. ఇందులో 234 సర్వేనెంబర్లో 129.04, 66లో 34.11 ఎకరాలు ఉంది. పదేళ్లకు ముందు ఈ చెరువు పరిధిలో 74 ఎకరాల ఆయకట్టు ఉండేది. నాగార్జున సాగర్ కాల్వ ఊట, ఖమ్మం అర్బన్ మం డలంలోని మంచుకొండ, పై గ్రామాల నుంచి వచ్చే వరద నీటి ద్వారా ఈ చెరు వు నిండేది. పట్టణ విస్తీర్ణం పెరగడంతో చెరువు సమీపంలో గృహ నిర్మాణాలు ఏర్పాటయ్యూయి. 2001 నుంచి రెండు, మూడేళ్ల వరకు వరుసగా సీక్వెల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 33 ఏళ్లకు ఈ చెరువు పరిధిలోని 234 సర్వే నంబర్లో 13.22 ఎకరాలను కొంతమంది వ్యక్తులు లీజుకు తీసుకున్నారు.

యోగా, హెల్త్ సెంటర్, క్లబ్ ప్రాజెక్టు, వాటర్ స్పోర్ట్స్,  థీమ్ పార్కు, ఎంట్రీపార్క్ కోసం ప్రభుత్వం ఈ భూములను లీజుకిచ్చింది. ఇటీవల ఇదే సర్వేనంబర్‌లోని 39 ఎకరాలను అప్పటి అర్బన్ మండలంలోని ఫ్లోరైడ్ రహిత మంచినీటి ప్రాజెక్టుకు కేటాయిం చారు. 163.15 ఎకరాల్లో ఇది మినహా యించగా.. ఇంకా 110.4 ఎకరాలు లకా రం చెరువు కింద ఉండాలి. కానీ ఇందు లో కూడా 5.6 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల కబ్జాలోకి వెళ్లిపోయింది.
 
ఆకారం ఇలా మారింది..

లకారం చెరువుకు ఓ వైపు సీక్వెల్ రిసా ర్ట్స్, మరోవైపు పార్క్ రెస్టారెంట్, మమ తా ఆస్పత్రి రోడ్డులో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. సీక్వెల్ రిసార్ట్స్ వెనుక భాగంలోనూ 4 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురి కావడం గమనార్హం. చెరువులోని మట్టినే తవ్వి ఇక్కడ ఆక్రమించిన ప్రాంతాన్ని దర్జాగా కబ్జా దారులు పూడ్చేశారు. సర్వే నంబర్ 234లో 4.24 ఎకరాలు, 66లో 20 గుంటల భూమిని కబ్జాకోరులు ఆక్రమించినా ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు లేవు. ప్రభుత్వాలు మారుతుండటంతో ఇక్కడున్న కబ్జాదారులు ప్రజాప్రతినిధులు తమవారేనంటూ అధికారులను బెదిరిస్తుండటంతో ఈ ఆక్రమణల పర్వానికి అంతులేకుండా పోయింది. చెరువు మధ్యలో కూడా అక్కడక్కడా రాత్రికిరాత్రే పునాదులు వెలిశాయి. ఇటీవల సర్వే చేసి ఆక్రమణలు తేల్చిన అధికార యంత్రాంగం వీటిని మాత్రం కూల్చలేదు. ఈ పరిస్థితులతో విలువైన భూములపై బడాబాబులు కన్నేశారు.
 
గజం రూ.వేలల్లో పలకడంతోనే ఆక్రమణ
ఒకప్పుడు చెరువుకే పరిమితమైన ఈ భూమి ప్రస్తుతం ఖమ్మానికి కార్పొరేషన్ హోదా రావడంతో గజం రూ.20వేల పైనే పలుకుతోంది. అధికార పార్టీ మాటున బడాబాబులు, పెద్దలు ఆక్రమణలపై కన్నేశారు. ఇటీవల రెవెన్యూ యంత్రాంగం ఆక్రమణలపై మార్కింగ్ చేసినా తమకు అన్ని పత్రాలున్నాయంటూ కొందరు, కోర్టు స్టే ఇచ్చిందని మరికొందరు, అధికార పార్టీ నేతలతో యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చే తంతు జరిగింది. రానున్న కాలంలో ఇక్కడ గజం రూ.30వేల నుంచి రూ.40 వేలకు చేరే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఆక్రమించుకున్నవారంతా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించే పనిలో ఉన్నారు.

గతంలో కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం, ముడుపులు అందుకోవడం వల్లనే లకారం.. ఆకారం మారిందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. 234, 66 సర్వే నంబర్లో భూమి ఆక్రమణకు గురైందని సర్వే చేసుకున్న రెవెన్యూ యంత్రాంగం ఆగస్టు 25న 29మందికి నోటీసులు కూడా పంపింది. చెరువు శిఖం అక్రమంగా ఆక్రమించిన వీరిపై ఇప్పటి వరకు చర్యలకు ముందడుగు పడటం లేదు.
 
అధికారపార్టీ పెద్దలే అండగా..
ఇటీవల లకారం చెరువును ఆధునికీకరించేందుకు రూ.7.78 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. ట్యాంకును ఆధునీకరిస్తున్నా ఇందులోనే ఆక్రమణలున్నాయి. ఆక్రమణదారులు చెరువు మధ్యలో పునాదులు తీసి పెట్టుకున్నారు. వీటిపై అధికార యంత్రాంగం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనుకకు అనే చందంగా వ్యవహరిస్తోంది. కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులే ఈ ఆక్రమించిన భూముల జాబితాలో ఉన్నట్లు సమాచారం.

వీరికి అధికార పార్టీ అండదండలుండటంతో యంత్రాంగం కూడా ఏమీ చేయక చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. చెరువును ఆధునికీకరించినా.. ఈ ఆక్రమణలపై ఏం చేయాలనే ప్రశ్నకు సమాధానం మాత్రం అధికారుల వద్దలేదు. నోటీసులు ఇచ్చాం.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నా.. ఆక్రమణదారులకు మద్దతుగా అధికార పార్టీ వత్తాసే అధికారులు ముందుకుపోకుండా చేస్తోందనే ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement