న్యాయం కావాలి | law officials asking justice | Sakshi
Sakshi News home page

న్యాయం కావాలి

Published Mon, Jun 27 2016 1:43 AM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM

న్యాయం కావాలి - Sakshi

న్యాయం కావాలి

కేటాయింపు జాబితాపై తెలంగాణ న్యాయాధికారుల భగ్గు
 పదవులకు 120 మంది మూకుమ్మడి రాజీనామా
 సంఘం అధ్యక్షుడికి లేఖ సమర్పణ
 వారంలో సమస్య పరిష్కారం కావాలి..
 లేదంటే రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించాలని విజ్ఞప్తి
 రాజీనామా లేఖలో హైకోర్టుపై ఘాటైన పదజాలం
 మాపై కోర్టు సవతితల్లి ప్రేమ చూపింది
 మెజారిటీ జడ్జీలు పక్షపాతంతో ఉన్నారు
 ఇప్పటికైనా కనువిప్పు కాకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధం
 న్యాయాధికారులు రోడ్డెక్కడం చరిత్రలో ఇదే తొలిసారి
 సీనియర్ న్యాయమూర్తులతో ఏసీజే అత్యవసర సమావేశం

 
 సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి న్యాయవ్యవస్థలో న్యాయాధికారుల కేటాయింపు చిచ్చు రోజురోజుకూ రాజుకుంటోంది. హైకోర్టు రూపొందించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ న్యాయాధికారులు.. తాజాగా రాజీనామాస్త్రాలను సంధించారు. రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న దాదాపు 120 మంది న్యాయాధికారులు ఆదివారం తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డికి సమర్పించారు. ఏడు రోజుల్లో సమస్య పరిష్కారం కావాలని, లేని పక్షంలో తమ రాజీనామాలన్నింటినీ గవర్నర్ నరసింహన్‌కు సమర్పించాలని కోరారు.
 
 అనంతరం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి వరప్రసాద్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ప్రసాద్ నేతృత్వంలోని ప్రతి నిధి బృందం గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటల సమయంలో సీనియర్ న్యాయమూర్తులతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అత్యవసర సమావేశం నిర్వహించారు. అంతకుముందు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో న్యాయాధికారుల సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి న్యాయాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఈ రాజీనామా లేఖలో న్యాయాధికారులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. హైకోర్టుపై ఘాటైన పదజాలం ఉపయోగించారు. లేఖలో ఏముందంటే..
 
 మాపై సవతి ప్రేమ...
 ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యాయాధికారుల విభజనకు హైకోర్టు శ్రీకారం చుట్టడంతో మేమెం తో సంతోషించాం. అయితే న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితా చూసిన తర్వాత హైకోర్టు మాపై సవతి ప్రేమ చూపినట్లు అర్థమైంది. హైకోర్టు రిజిస్ట్రీ తమకు నచ్చిన విధంగా వ్యవహరించినట్లు స్పష్టమైం ది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కేడర్లలో పోస్టులను ఖాళీగా ఉంచి, తెలంగాణలో మాత్రం ఖాళీలు లేకుండా చేశారు. ఏపీకి చెందిన యువ న్యాయాధికారులను ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు కేటాయించారు. తద్వారా తెలంగాణ న్యాయాధికారుల పదోన్నతి అవకాశాలను హైకోర్టు దెబ్బతీసింది. రాజకీయంగా, పాల నాపరంగా తెలంగాణను సాధించుకున్నా.. ఇప్పటికీ మేం ఏపీ హైకోర్టు కింద పనిచేస్తున్నామనే భావన కలుగుతుందే తప్ప.. ఉమ్మడి హైకోర్టు కింద చేస్తున్నామనిపించడం లేదు.  
 
 పక్షపాత వైఖరితో ఉన్నారు..
 మీ (రవీందర్‌రెడ్డి) నేతృత్వంలో సంఘం ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మాకు అన్యా యం జరిగిందని ఏసీజేనే చెప్పారు. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వినతులు పంపాం. దురదృష్టవశాత్తూ ఏ ఒక్కరూ మనకు జరిగిన అన్యాయంపై స్పందించలేదు. దీంతో హైకో ర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై మేం విశ్వాసం కోల్పోయాం. ఈ మొత్తం వ్యవహారంలో మెజారిటీ హైకోర్టు న్యాయమూర్తులు పక్షపాత వైఖరితో ఉన్నారు కాబట్టి.. సమస్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయరాదని గత సమావేశంలో తీర్మానించాం.
 
 హైకోర్టు అన్యాయంగా వ్యవహరిస్తోంది
 తెలంగాణ న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు మన తరఫున గత మూడు వారాలుగా పోరాటం చేస్తున్నారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నాం. న్యాయాధికారులు సీసీఏ నిబంధనలకు, ప్రవర్తనా నియమావళికి లోబడి పనిచేయాలని మాకు తెలు సు. అయితే న్యాయాధికారుల కేటాయింపుల్లో హైకోర్టు ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా, అన్యాయంగా వ్యవహరి స్తోంది. గత మూడు వారాలు గా న్యాయవాదులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నా హైకోర్టు తన తప్పులను సరిదిద్దుకోవడం గానీ, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవ డం గానీ చేయ డం లేదు.
 
 ప్రాణత్యాగానికైనా సిద్ధం..
 ఈ పరిస్థితుల్లో న్యాయం అందుతుందనే నమ్మకం మాకు లేదు. ఆంధ్రా పాలకుల కింద ఏ మాత్రం పనిచేయలేం. న్యాయాధికారులం కావడంతో మా మనస్సాక్షికి విరుద్ధంగా మౌనంగా ఉంటూ వస్తున్నాం. ఇక మౌనంగా ఉండటం మా వల్ల కాదు. బంగారు తెలంగాణ కోసం మా న్యాయాధికారుల పోస్టులను వదులుకోవాలని భారమైన హృదయంతో నిర్ణయం తీసుకున్నాం. మా రాజీనామాలు పైస్థాయిలో ఉన్న వ్యక్తులకు కనువిప్పు కలిగించకుంటే.. హైకోర్టు ప్రాంగణంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి ప్రాణాలు వదిలేందుకు కూడా సిద్ధం. మా రాజీనామాలను మీకు(రవీందర్‌రెడ్డి) సమర్పిస్తున్నాం. వాటిని ఆమోదం కోసం గవర్నర్‌కు సమర్పించగలరని కోరుతున్నాం.
 
 మౌన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు
 సర్వసభ్య సమావేశం ముగిసిన తర్వాత న్యాయాధికారులందరూ గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్‌రెడ్డి, వరప్రసాద్‌ల నేతృత్వంలో రాజ్‌భవన్ వరకు మౌన ప్రదర్శన చేపట్టారు. ఖైరతాబాద్ చౌరస్తా వద్దకు చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. తాము ఆందోళనలు చేయడానికి వెళ్లడం లేదని, వినతిపత్రం సమర్పించడానికి వెళుతున్నామని చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.

అయితే ఇంత మందిని అనుమతించబోమని, ఓ ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపుతామని పేర్కొన్నారు. దీంతో ఎనిమిది మందితో కూడిన ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. ప్రాథమిక కేటాయింపులతో తెలంగాణ న్యాయాధికారులకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్‌కు వివరించారు. ఇందులో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అభ్యర్థించారు. ఈ విషయంపై వీరు గవర్నర్‌ను కలవడం ఇది రెండోసారి. ఇలా న్యాయం చేయాలంటూ న్యాయాధికారులు రోడ్డెక్కడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు జూలై 1 నుంచి సమ్మె చేయాలని న్యాయశాఖ ఉద్యోగులు తీర్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement