జడ్చర్ల టౌన్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూలు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్నానని, నాయకులు, కార్యకర్తలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా తన గెలుపు కోసం రెండు నెలలు శ్రమించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి స్పష్టం చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన మేరకు తనకు లోక్‌సభ టికెట్ కేటాయింపులో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డుగా ఉంటుందని ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డికి తన రాజీనామాను సమర్పించానని, సమయం, సందర్భం రానందున బహిర్గత పరచలేదని తెలిపారు.
శుక్రవారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇచ్చినపుడే సీఎం రేవంత్‌తో చర్చించానని, ఎంపీ టికెట్‌కు అడ్డు రాకుండా ఉంటేనే బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పానన్నారు. పదేళ్లుగా అనేక ఫైళ్లు ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పటంతో ఈ బాధ్యతలు స్వీకరించి అనేక శాఖల్లో ఫైళ్లలో కదలిక తీసుకువచ్చానన్నారు. తన రాజీనామాను ఆమోదించే వరకు ఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు.
అయితే తనకు టికెట్ రావడంలేదని ప్రచారం జరుగుతున్నందున కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలందరూ తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న మంద జగన్నాథం, సంపత్‌కుమార్‌లకు తాను వ్యతిరేకం కాదని, వారికి టికెట్ అడిగే హక్కు ఉందని అన్నారు. పార్టీ సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని, టికెట్ ఇవ్వకూడదని ఏ ఒక్క కారణం చెప్పినా.. సర్వేలు అనుకూలంగా లేవని తేలినా తాను స్వీకరిస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment