వలస కూలీల జీవనం పశువులకన్నా హీనం..!
వారిది అవసరం. వీరిది అవకాశం. బతుకు గడిపేందుకు బహుదూరపు ప్రయాణం ఆ పేదలకు నిత్యకృత్యం. దీనికోసం..చివరకు తమ ప్రాణాలనూ ఫణంగా పెడ్తున్నారు. ఇందుకు సాక్ష్యం ఈ చిత్రం. ఓ కాంట్రాక్టర్ మరికల్‌కు చెందిన వారిని మధ్యప్రదేశ్‌కు ఇదే వాహనంలో కూలీలను తరలించాడు. అక్కడ పనులు ముగిశాక మైసూరుకు తీసుకెళ్తూ వారి వాహనాన్ని అడ్డాకుల వద్ద ఆపాడు. ఒకే వాహనంలో అరను ఏర్పాటు చేసి పిల్లలనూ, పెద్దలనూ కలిపి ఓ అరవైమందిని అందులో కుక్కాడు. వారితో పాటు పరికరాలను సర్ది ప్రయాణం కట్టించాడు. సంతకు పశువులను తరలించినట్టు పనులకోసం ఇలా తీసుకెళ్లాడు.
లారీల్లో సంతకు పశువులను తరలించాలన్నా.. అంగడికి మేకలు,గొర్రెలను తీసుకెళ్లాలన్నా కనీస సౌకర్యం ఉండేందుకు యజమాని చర్యలు తీసుకుంటాడు. కానీ ఆ మూగజీవాలకన్నా దీనంగా ఉంది పాలమూరు వలస కూలీల బతుకు. డీసీఎంలో సామర్థ్యానికి మించి..పైన చెక్కలతో కంచెమాదిరి ఏ ర్పాటు చేసి ఒకరిపై ఒకరిని కర్కశంగా కుక్కి వందల కిలోమీటర్లు తరలిస్తున్నారు గుంపుమేస్త్రీలు. పసిపిల్లలు,చిన్నపిల్లలు,మహిళలు,అందరూ కనీసం కాళ్లు చాచుకోడానికి వీల్లేకుండా ఎక్కించారు. భగభగ మండే ఎండలో తరలిస్తూ కనీస మానవత్వాన్ని విస్మరిస్తున్నారు. పైనా కింద వేడి పుట్టినా ఊపిరాడని స్థితిలో ఓ రాష్ట్రం దాటి మరో రాష్ట్రానికి వలస వెళ్లారు.
అడ్డాకుల, న్యూస్‌లైన్ : పాలమూరు వలస కూలీలను పనులకు తీసుకెళ్లే గుంపు మేస్త్రీలు..కూలీల కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస కూలీలను తరలించేటపుడు వారిని మూ గజీవాల కన్నా అధ్వానంగా చూస్తున్నారు. మరికల్‌కు చెందిన సుమారు 60 మంది వలస కూలీలను ఓ గుంపుమేస్త్రీ 4నెలల కిందట మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పనులు ముగియడంతో వారిని డీసీఎంలో కర్ణా టక రాష్ట్రంలోని మైసూర్‌కు తరలిస్తున్నాడు.
అయితే డీసీఎంలో కూలీల సామాన్లతో పాటు వారి పిల్లలు, కూలీలు కూర్చోవడానికి సరిపడా స్థలం కూడా లేదు. డీసీఎం పైభాగాన చెక్కలతో ఓ అర ఏర్పాటు చేసి దానిపై లగే జీతో పాటు కూలీలను కుక్కారు. అందులో కనీసం కాళ్లు చాపుకుని పడుకునే అవకాశం కూడా లేదు. లగేజీని మొదట కిందికి దింపితే కాని కూలీలు కిందికి దిగే అవకాశం లేదు. బుధవారం మధ్యాహ్నం సంకలమద్ది స్టేజీ వద్ద హైవేపై కొద్దిసేపు నిలపడంతో అందులో కిక్కిరిసి ఉన్న కూలీలు కొద్దిసేపు ఎండలోనే సేదతీరారు. తిరిగి కూ లీలతో పాటు వారి పిల్లలను డీసీఎంలో కిక్కిరిసి ఎక్కిస్తుండటం ‘న్యూస్‌లైన్’ కంటపడింది.