
లాటరీ మాఫియా..!
జిల్లా కేంద్రంలో విచ్చల విడిగా సింగిల్ నంబర్ దందా
నల్లగొండ టు షోలాపూర్ వరకు నెట్‌వర్క్
పండ్లు, పూల వ్యాపారులు, హోటల్ యజమానులే టార్గెట్
‘కోడ్’ భాషను ఉపయోగిస్తూ సెల్‌ఫోన్‌ల ద్వారా బిజినెస్
జిల్లా కేంద్రంలో లాటరీ మాఫియా జూలువిదిల్చింది. సింగిల్ నంబర్ లాటరీ ముసుగులో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. కొంత కాలంగా చాపకింద నీరులా సాగుతున్న ఈ దందా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలన్న ఆత్రుతతో దిగువ మధ్యతరగతి కుటుంబాలు లాటరీ మాయలో పడి అప్పులపాలవుతున్నాయి. అప్పుల బాధ భరించలేక పలు సందర్భాల్లో పోలీస్‌స్టేషన్‌ల వరకు పంచాయితీలు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో లాటరీ టిక్కెట్ల అమ్మకాన్ని నిషేధించినప్పటికీ నల్లగొండ పట్టణంలో ఏవిధంగా సాగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నల్లగొండ : మహారాష్ర్టలోని షోలాపూర్ నుంచి నల్లగొండ వరకు లాటరీ నెట్‌వర్క్ కొనసాగుతోంది. పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే ప్రకాశంబజార్, పాతబస్తీలను కేం ద్రంగా చేసుకుని లాటరీబిజినెస్ నడిపిస్తున్నారు. వీరు పూల, పండ్ల వ్యాపారులు, హోటల్స్, చెప్పుల దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నారు. షోలాపూర్‌కు చెందిన కొందరు ఏజెంట్లు నల్లగొండలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని చిరు వ్యాపారులను లాటరీ ముగ్గులోకి లాగుతున్నారు. టిక్కెట్లు విక్రయిస్తే లాటరీ బండారం బయట పడుతుందన్న భయంతో సెల్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. లాటరీ ఎవరికి తగిలిందన్న విషయాన్ని కూడా ‘కోడ్’ భాషను ఉపయోగిస్తూ సమాచారం చేరవేస్తున్నారు.
రూ.10 టికెట్.. రోజుకు నాలుగు ‘షో’లు
లాటరీ టికెట్ ఖరీదు రూ.10 మాత్రమే ఉండటంతో చిరు వ్యాపారులు తొందరగా ఆకర్షితులవుతున్నారు. కాగితపు అట్టాల మీద చార్ట్‌లు గీసి 1 నుంచి 10 వరకు నంబర్లు వేస్తారు. ఆ నంబర్ల ఆధారంగా టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నల్లగొండలో ఉండే లాటరీ ఏజెంట్ నుంచి షోలాపూర్ ఏజెంట్‌కు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. 1 నుంచి 10 నంబర్ల వరకు ప్రత్యేకంగా కొన్ని గుర్తులు కేటాయించారు. ఈ గుర్తుల ఆధారంగా షోలాపూర్‌లో ఏ నంబర్‌కు లాటరీ తగిలిందనే విషయాన్ని ఇక్కడ టికెట్ కొన్న వ్యక్తులకు చేరవేస్తారు. ఈ విధంగా రోజుకు నాలుగు షో (ఆట)లు నడుస్తాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిత్యం 4 నుంచి 5 షోలు నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా ప్రకాశం బజార్, పాత బస్తీలోని కొన్ని హోటళ్లు, ప్రధాన కూడళ్లను అడ్డాలుగా చేసుకుని నడిపిస్తున్నారు.
చేతులు మారుతున్న రూ. లక్షలు
వంద రూపాయలు పెట్టుబడి పెడితే వెయ్యి రూపాయలు లాభం వస్తుందని ఏజెంట్లు ఆశ చూపి వ్యాపారులను లాటరీ ముగ్గులోకి దింపుతున్నారు. ఇదొక్కటే కాదు ఏ నంబర్ మీద లాటరీ కడితే వస్తుంది...లాటరీ ఏవిధంగా ఆడాలి అనే విషయాలపై ఏజెంట్లు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ శిక్షణకు వచ్చిన వారి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. ఇలాంటి శిక్షణకు వెళ్లే వారిలో యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. ఈవిధంగా శిక్షణ పొందిన వారు తమకు తెలియకుండానే లాటరీ ముసుగులో పడిపోతున్నారు.
ఇదీ కోడ్ భాష ..
లాటరీ ఏ నంబర్‌కు తగిలిందన్న విషయాన్ని తెలియజేయడానికి కోడ్ భాషను వినియోగిస్తుంటారు. ఒకటో నంబర్ లాటరీగుర్తును గడ్డపార అని పిలుస్తారు. అదే విధంగా రెండో నంబర్‌కు బాతు, 3వ నంబర్‌కు నామాలు, 4వ నంబర్‌కు మంచం, 5వ నంబర్‌కు పచ్‌కడ్, 6కు నపూసకుడు, 7కు సత్తా, 8కి బేడీలు, 9, ఎన్టీరామారావు,10వ నంబర్‌కు లక్ష్మీ పార్వతి ఇలా కోడ్ భాషను ఉపయోగిస్తూ దందా నడిపిస్తున్నారు.