
సాక్షి, దేవరకద్ర : మహబూబ్‌నగర్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన స్థలాల అన్వేషణ ఇంకా కొలిక్కి రావడం లేదు. దేవరకద్ర నియోజకవర్గంలోనే ఎయిర్‌పోర్టు నెలకొల్పే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు ప్రకటించినా ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం మాత్రం తేలడం లేదు. గతంలో అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. తాజాగా మంగళవారం దేవరకద్ర మండలం చౌదర్‌పల్లి, హజిలాపూర్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను జిల్లా రెవెన్యూ సర్వేయర్ అధికారులు పరిశీలించడంతో ఎయిర్ పోర్టు రూటు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా నియోజకవర్గంలోని మూసాపేట వద్ద విభా సీడ్స్ కంపెనీ సమీపంలో, భూత్పూర్ మండలంలోని హెచ్‌బీఎల్ కంపెనీ సమీపంలో కొన్ని స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దేవరకద్ర నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట విమానాశ్రయం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జాతీయ రహదారికి దగ్గరే..
ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు స్థల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో దానికి రోడ్డు మార్గం కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టుకు జాతీయ రహదారి దగ్గరగా ఉండాలని ఏవియేషన్ అధికారులు కూడా భావిస్తున్నారు. దేవరకద్ర మండలంలోని చౌదర్‌పల్లి, హజిలాపూర్‌లు 44వ జాతీయ రహదారికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. గతంలో అడ్డాకుల మండలం గుడిబండ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ స్థలంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ సమస్యగా ఉన్నందున విమానాశ్రయం దేవరకద్ర మండలం వైపు మళ్లించినట్లు తెలుస్తుంది.
ఏఏఐ బృందం పర్యటన
ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో ఈ నెల 21 నుంచి 22 వరకు పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో 23న హైదరాబాద్‌కు తిరిగి వచ్చే బృందం మహబూబ్‌నగర్ జిల్లాకు మరోసారి వచ్చే అవకాశం ఉంది. అయితే వారి రాక అధికారికంగా ఖరారు కాకపోయినా తాజాగా దేవరకద్ర మండలంలోని భూములను పరిశీలించినట్లు తెలుస్తుంది. చౌదర్‌పల్లి, హజిలాపూర్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉండడం, విమానాశ్రయానికి అనువుగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment