ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
చాడ వెంకట్ రెడ్డి
హిమాయత్‌నగర్: ఓటుకు నోటు వ్యవహారంలో కేసీఆర్, చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మద్దూం భవన్‌లో తన్‌జీమ్ - ఎ - ఇన్సాఫ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి మైనార్టీల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధిని విస్మరించి రాజకీయాలకే పరిమితమవుతున్నారన్నారు. ఓటుకు నోటుతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలను రెచ్చగొట్టే విధానాలను విడనాడాలని హితవు పలికారు. కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమవుతూ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తుందని ఆరోపించారు.
భూసేకరణ చట్టం పేరుతో రైతులను నిరాశ్రయులను చేసేందుకు పూనుకుందని, పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులు, పేదల నోట్లో మట్టి కొడుతుందన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు మైనార్టీల వ్యతిరేక ప్రభుత్వంగా పనిచేస్తోందని, గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ వైఖరి మార్చుకోకపోతే మైనార్టీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మీర్ అహ్మద్ అలీ, మునీర్ పటేల్, నగర నేతలు యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.