ప్రియుడి గొంతు కోసిన యువతి | Man attacked by woman with blade | Sakshi
Sakshi News home page

ప్రియుడి గొంతు కోసిన యువతి

Published Mon, Apr 27 2015 2:34 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

ప్రియుడి గొంతు కోసిన యువతి - Sakshi

ప్రియుడి గొంతు కోసిన యువతి

ప్రేమించి మోసం చేశాడని..
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మూడేళ్ల పాటు ప్రేమ పేరుతో వంచించి.. మరో యువతిని వివాహం చేసుకున్న ప్రియుడి గొంతుకోసింది ఓ యువతి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. ఖమ్మంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... జిల్లాలోని అశ్వాపురం మండలం కుర్వపల్లి గ్రామానికి చెందిన పైదా కరుణ(23) ఖమ్మంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే కళాశాలలో చర్ల మండలం వెంకటాపురం ఉప్పిడి వీరాపురంనకు చెందిన చల్లూరి పాండురంగారావు(23) కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నాడు. ఖమ్మంలో ఓ సంవత్సరం పాటు ఒకే గదిలో ఉన్నారు.
 
 అయితే, ఇటీవల పాండురంగారావు గుట్టు చప్పుడు కాకుండా తన మామయ్య కూతురిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన కరుణ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు. ఆదివారం ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించి ఖమ్మం వచ్చిన పాండురంగారావుని కలిసిన కరుణ మాట్లాడాల్సి ఉందని చెప్పింది. దీంతో ఇద్దరూ ఖమ్మంలో నరసింహస్వామి గుట్ట పైకి వెళ్లారు. అక్కడ కరుణ పాండురంగారావుని నిలదీయగా తాను వివాహం చేసుకున్నది నిజమేనని, తనను మర్చిపోవాలని చెప్పాడు.

దీంతో కరుణ కోపంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసింది. ఒక్కసారిగా జరిగిన పరిణామానికి బిత్తరపోయిన పాండురంగారావు కేకలు వేయటంతో స్థానికులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కరుణను ఖమ్మం టూ టౌన్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. తనను ప్రేమించి మోసం చేసినందుకే అతడిని చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని... అందుకే ఈ పని చేశానని విలేకరులతో కరుణ తెలిపింది. పాండురంగారావుని వివరణ కోరగా కరుణ, తాను ప్రేమించుకున్నమాట వాస్తవమేనని తల్లిదండ్రుల కోరిక మేరకు తాను మామయ్య కూతురిని వివాహం చేసుకున్నాని తెలిపాడు. అతని పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కరుణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement