ఆందోళనకారులకు నచ్చజెప్పుతున్న జేసీ వేణుగోపాల్
వనపర్తి క్రైం: జిల్లాలోని పెబ్బేరు మండలం పాతపల్లికి చెందిన దళిత ఆత్మగౌరవ పోరాట నాయకుడు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎనమల ఉస్సేన్ గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అయితే ఉస్సేన్‌ను అనుమానాస్పద మృతి కాదని.. భూమి కోసం హత్య చేశారంటూ కేఎన్‌పీఎస్ రాష్ట్ర నాయకులు, పాతపల్లి దళితులు శుక్రవారం వనపర్తి జిల్లా ఏరియా ఆస్పత్రిలో ధర్నా చేపట్టారు. హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పట్టుబట్టారు. ఉస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలని బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు, కేఎన్‌పీఎస్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అపూర్వరావు, ఇన్‌చార్జ్ డీఎస్పీ షాకీర్‌హుస్సేన్ అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో జేసీ వేణుగోపాల్ అక్కడికి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం పోలీసుల సమక్షంలో ఉస్సేన్ మృతుదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో స్వగ్రామానికి తరలించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అభినవ్, బద్రి, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment