
తెలంగాణలో అపార అవకాశాలు
హాంకాంగ్, తైవాన్ పర్యటనకు వెళ్లిన ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం పలు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు.
⇒ హాంకాంగ్‌లో పారిశ్రామికవేత్తలతో కేటీఆర్
⇒ ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ
⇒ భారీగా పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం
⇒ హాంకాంగ్‌లో తెలంగాణ రోడ్‌షో
సాక్షి, హైదరాబాద్: హాంకాంగ్, తైవాన్ పర్యటనకు వెళ్లిన ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం పలు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో పాటు ఆర్థిక సేవలను అందించే కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రోడ్‌షో-ఇంటరాక్టివ్ సెషన్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అపార అవకాశాలను, పెట్టుబడులకు లభించే విలువను రోడ్‌షోకు హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చౌకగా లభించే మౌలికవసతులపై వారికి అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానం, స్థానికంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రముఖ కంపెనీల ప్రతినిధులు అభినందించారని కేటీఆర్ చెప్పారు.
ఈ సెషన్‌లో పాల్గొన్న ప్రముఖ కంపెనీల్లో ఎక్కువ శాతం ఆర్థిక సేవలందించేవే కనుక, తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఆశాభవం వ్యక్తంచేశారు. అనంతరం స్టార్టప్ కంపెనీలకు సేవలందించే సైబర్ పోర్టు కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీ-హబ్‌కు సైబర్ పోర్ట్ సహకారం కావాలని ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ అధికారి మార్క్‌వో క్లిఫ్ట్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ , సీఐఐ హైదరాబాద్ చైర్మన్ వనితా దాట్ల, హాంకాంగ్ కాన్సుల్ ఆఫ్ ఇండియా ప్రశాంత్ అగర్వాల్, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ హాంకాంగ్ చైర్మన్ ఎం.అరుణాచలం పాల్గొన్నారు.