
లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు
⇒ కొత్త సంవత్సరంలో నిరుద్యోగులకు తీపి కబురు
⇒ టీఎస్‌పీఎస్‌సీ డెరైక్టర్ చంద్రావతి
ఖమ్మంరూరల్/ఖమ్మంవైరారోడ్/కూసుమంచి : వచ్చే ఏడాది తెలంగాణలో లక్ష ప్రభుత్వోద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డెరైక్టర్ బానోత్ చంద్రావతి తెలిపారు. హైదరాబాద్ నుంచి బుధవారం జిల్లాకు వచ్చిన చం ద్రావతి కూసుమంచి, ఖమ్మం రూరల్ మండ లం పెద్దతండా, ఖమ్మం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రా ష్ట్రంలో కొలువులు లభిస్తాయనే ఆశతో నిరుద్యోగులు ఉన్నారని, వారి ఆకాంక్ష నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని చెప్పారు. అయితే శాఖల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, ప్రతిభ ఉన్నవారికే అవకాశాలొస్తాయని, నిరుద్యోగులు దళారుల మాట నమ్మవద్దని సూచించారు.
కేవలం ప్రతిభ ప్రాతిపదికనే ఉద్యోగాల ఎంపిక ఉంటుందని, నిరుద్యోగులు అందుకు సిద్ధం కావాలని కోరారు. బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పలు తప్పిదాలు చేశాయని, ఇకపై అలాంటివి ఉండబోవని చెప్పారు. కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులంతా కష్టపడి పని చేసేవారేనని, నిరుద్యోగులకు ఎక్కడా అన్యాయం జరుగదని అన్నారు.
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ ఖమ్మం జిల్లాకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి, పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, చంద్రావతికి టీఎస్‌పీఎస్‌సీ పదవి ఇచ్చి ప్రాధాన్యత కల్పించారన్నారు. చంద్రావతి వెంట టీఆర్‌ఎస్ ఖమ్మం, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆర్జేసీ కృష్ణ, బత్తుల సోమయ్య, జడ్పీటీసీలు వడ్త్యి రాంచంద్రునాయక్, ధరావత్ భారతి, నాయకులు ధరావత్ రాంమూర్తి, చెరుకుపల్లి లక్ష్మి , కొత్తపల్లి సరిత, బారి శ్రీనివాస్, వీరభద్రం ఉన్నారు.