మల్లన్న సాగర్ వద్దంటూ ‘మల్లన్న’కు వినతిపత్రం
Published Sun, Jun 5 2016 9:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM
చేర్యాల: మెదక్ జిల్లా కొండపాక, తొగుట మండలాల పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ తమకొద్దంటూ భూ నిర్వాసితులు వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జున స్వామికి ఆదివారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు.ఈ విషయంలో ప్రభుత్వ మనసు మార్చాలని కోరుతూ స్వామికి వినతిపత్రం సమర్పించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పరిధిలోని 14 గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో సుమారు 50 మంది రైతులు, యువకులు కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భూమి లాక్కుంటే తమకు భిక్షాటనే గతి అని ఆలయ మెట్ల వద్ద భిక్షాటన చేసి నిరసన తెలిపారు. 2013 చట్టం ప్రకారం 80 శాతం మంది రైతులు ఒప్పుకుంటేనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటే 14 గ్రామాల ముంపు భాదితులు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని నిర్వాసితులు హెచ్చరించారు.
Advertisement
Advertisement