మాతృదేశ రాకకు ‘మత్లూబ్’ అడ్డంకి..
మాతృదేశ రాకకు ‘మత్లూబ్’ అడ్డంకి..
Published Wed, Jul 19 2017 3:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
- చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న సుమారు వెయ్యి మంది
- ‘అమ్నెస్టీ’ని వినియోగించుకోలేక పోతున్న వైనం
- ఈనెల 25తో ముగియనున్న గడువు
- ఆదుకోవాలంటున్న సౌదీలోని వలస కార్మికులు
సాక్షి, నిజామాబాద్: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్‌కు చెందిన దాసరి మధుసూదన్ సౌదీలోని హాయిల్ పట్టణంలో ఓ మహిళా యజమాని వద్ద డ్రైవర్‌గా చేరాడు. యజమాని ప్రతినెలా వేతనం ఇవ్వడంలో జాప్యం చేయడంతో అక్కడ పని మానేసి.. వేరో చోట పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడిపై ఒప్పంద ఉల్లంఘన కేసు నమోదైంది. కాగా, సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల అమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం ప్రకటించింది. అక్రమంగా నివాసముంటున్న వారిని ఆయా దేశాలకు తిరిగి వెళ్లే అవకాశం కల్పించింది. దీంతో మధుసూదన్ స్వదేశానికి వచ్చేందుకు అక్కడి భారతీయ రాయబారి కార్యాలయం నుంచి అవుట్‌పాస్, సౌదీ అరేబియా అధికారుల నుంచి ఫైనల్ ఎగ్జిట్ (సౌదీ దేశం వదిలి వెళ్లేందుకు అనుమతి) తీసుకున్నారు. హైదరాబాద్ వచ్చేందుకు ఏప్రిల్ 15న సౌదీలోని రియాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా మధుసూదన్‌పై మత్లూబ్ (పోలీసు కేసు) ఉన్నందున ఇండియాకు వెళ్లేందుకు అనుమతించలేదు. ఇది మధుసూదన్ పరి స్థితే కాదు., ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన అనేక మంది కార్మికులది ఇలాంటి పరిస్థితే.
భారతదేశానికి చెందిన సుమారు 31 లక్షల మంది సౌదీ అరేబియాలో నివసిస్తున్న ట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ వారు నాలుగు లక్షల మంది ఉంటారని అంచనా. ఉమ్మడి నిజా మాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా గల్ఫ్ బాట పట్టిన వారిలో ఉన్నారు. ఇలా ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లి చేయని నేరా లకు, చిన్న తప్పిదాలకు కేసుల పాలైన వారు సుమారు వెయ్యి మందికిపైగా ఉంటారని అంచనా. ఇప్పుడు వీరంతా ఈ అమ్నెస్టీలో స్వస్థలాలకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. వీరు స్వదేశానికి రావాలంటే కేసు నమోదైన పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయి, న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది. అదే విధంగా కేసు వేసిన యజమాని కేసు ఉపసంహరించుకోవాలని కోరాల్సి ఉంటుంది. కేసు ఉపసంహరణకు అంగీకరిస్తే తప్ప వారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం లేదు.
భారీ జరిమానాలు చెల్లించలేక..
మత్లూబ్ కేసుల్లో ఇరుకున్న వారిలో చాలా మట్టుకు పని ఒప్పందాలను ఉల్లంఘించిన వారే. కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వకపోవడం, నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేయడం, కొందరు యజమాని వే«ధింపులు, హింసలను తట్టుకో లేక పారిపోవడం.. కొందరు అధిక వేతనం ఆశతో మరోచోట పనిచేయడానికి కూడా వెళ్లిపోతున్నారు. దీంతో ఒప్పందాల ఉల్లం ఘన కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులో అక్కడి కోర్టులు భారీ జరిమానాలు విధించడంతో పెండింగ్‌లో ఉంటున్నాయి. తెలంగా ణలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు వెయ్యి మంది మత్లూబ్ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
అమ్నెస్టీ గడువు 25 వరకు
అత్యంత కఠిన చట్టాలు అమలులో ఉండే సౌదీ అరేబియా అతిక్రమణలు లేని దేశం (ఎ నేషన్ వితౌట్ వయలేషన్స్) అనే ప్రచారంలో భాగంగా అమ్నెస్టీని ప్రకటించింది. తొలుత మార్చి 29 నుంచి 90 రోజుల పాటు ఈ అమ్నెస్టీని అమలు చేయాలని నిర్ణయించిన అక్కడి ప్రభుత్వం గడువును ఈనెల 25 వరకు పొడగించింది. ఈ అమ్నెస్టీ అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా సౌదీలోనే అక్రమ నివాసులుగా ఉండిపోయే వారికి ఇకపై లక్ష రియాళ్ల భారీ జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
ధైర్యం కోల్పోవద్దు..
మత్లూబ్ కేసుల్లో ఇరుక్కున్నవారు ధైర్యం కోల్పోవద్దు. సౌదీలోని భారతీయ రాయబారి కార్యాలయం అధికారుల సాయం తీసుకుని కేసుల పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అక్కడి సామా జిక సేవకులను ఆశ్రయిస్తే యజమానులు కేసులు వాపస్ తీసుకునేలా సాయం చేస్తారు. అవకాశాన్ని వినియోగించుకో వాలి. తమ ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడుతుంది.
– మంద భీంరెడ్డి, ప్రవాసీ కార్మిక నాయకులు
Advertisement