ఆగి ఉన్న లారీని ఢీకొన్నమినీ బస్సు
ఒకరు మృతి,8 మందికి తీవ్రగాయాలు
రాజమండ్రి పుష్కరాలకు వెళ్తుండగా ప్రమాదం
పెనుబల్లి : ఆగి ఉన్న లారీని మినీబస్సు ఢీకొట్టడంతో మినీబస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందగా, మరో 8 మంది తీవ్ర గాయూలపాలైన సంఘటన పెనుబల్లి మండల పరిధిలోని లంకపల్లి-కొత్త లంకపల్లి గ్రామాల మధ్య మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
హైదరాబాద్ తార్నాక, రామంతపూర్, ఉప్పల్ ప్రాంతాలకు చెందిన 21 మంది హైదరాబాద్‌లోని మారుతి ట్రావెల్స్ నుంచి స్వరాజ్ మజ్డా మినీ బస్సులో రాజమండ్రి పుష్కరాలకు సోమవారం రాత్రి 7 గంటలకు బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు పెనుబల్లి మండల పరిధిలోని లంకపల్లి -కొత్త లంకపల్లి గ్రామాల మధ్య అప్పటికే రోడ్డు ప్రమాదానికి గురైన లారీని వెనుక నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన అటుగా వెళ్తున్న వాహనదారులు వియంబంజర్ ఎస్సై పి. నవీన్‌కు సమాచారమివ్వడంతో ఆయన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను రక్షించేందుకు జేసీబీని ఉపయోగించి బస్సుకు తాళ్లుకట్టి 2 గంటల పాటు శ్రమించి లారీ నుంచి మినీ బస్సును వేరుచేసి డ్రైవర్ గుర్రాల నరసింహారావును ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ తార్నాకకు చెందిన చమంగళ లక్ష్మీనారాయణ(50), శివాల దిశాలు, బర్ల సుజాత, శివాల చిన్నమ్మ, బొంగోలు తరణికి తీవ్రగాయూలు కాగా గావర గోవిందరావు, బొంగోలు గున్నమ్మ, శివాల కావ్యకు గాయాలయ్యాయి. వారిని సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో చమంగళ లక్ష్మీనారాయణ మృతిచెందాడు.
ప్రమాదానికి గురైన వారంతా ఒరిస్సా రాష్ట్రం గజపతి జిల్లా పాతపట్నం మండలం వాసులని తెలిసింది. పరాలికవిండ గ్రామానికి చెందిన వారిగా, వీరంతా 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి, పంచనామా చేసి, పోస్టు మార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి. నవీన్ తెలిపారు.
ఆటోను లారీ ఢీకొని మహిళ మృతి
కొత్తగూడెం రూరల్ : ఆటోను లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందగా, చిన్నారికి తీవ్ర గాయూలైన సంఘటన కొత్తగూడెం పట్టణంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామవరంలోని నాగయ్యగడ్డకు చెందిన ముత్తెర భాగ్య(45), ముత్తెర రాజమ్మ, ఎస్ సమ్మయ్య, అతడి భార్య మదునమ్మ, యాకుబ్‌బీ, రూప్ బేగం, ఎమ్డీ పర్వీన్‌బీ సోమవారం ఉదయం పుష్కర స్నానాలకు వెళ్లారు. స్నానాలు ముగించుకుని ఆర్డీసీ బస్సు లో కొత్తగూడెం వచ్చారు.
అనంతరం కొంగ నవీన్ ఆటోలో ఇంటికి వెళుతుండగా, సెయిం ట్ మేరీస్ స్కూల్ ముందున్న ఎస్‌బీహెచ్ బ్యాంకు వద్ద రామవరం నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడగా ముత్తెర భాగ్య, ఎమ్డీ పర్వీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా భాగ్య చికిత్స పొందుతూ మృతిచెందింది. చిన్నారి ఎమ్డీ పర్వీన్ గాయాలతో ఖమ్మం ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది. మిగతా వారికి గాయూలు కాగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సితపొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.