సూత్రధారి చంద్రబాబే
ఓటుకు నోటు వ్యవహారంపై మంత్రి హరీశ్‌రావు
ఈ విషయంలో బాబు మౌనంపై ధ్వజం
ఆయనకు సీఎంగా ఉండే అర్హత లేదని మండిపాటు
హైదరాబాద్: ‘మండలి ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకున్నా టీడీపీ పోటీకి పెట్టింది. పక్క పార్టీ ఎమ్మెల్యేలను డబ్బిచ్చి కొనుగోలు చేసి గెలవాలనుకుంది. టీడీపీది దొడ్డిదారి, వెన్నుపోటు దారి, దొంగదారి. ఆ పార్టీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడింది. ఓటుకు నోట్లు ఇవ్వజూపిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు..? మౌనం అంగీకారం అనుకోవాలా..? చంద్రబాబుకు ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండే అర్హత లేదు..’ అని రాష్ట్ర భారీ నీటిపారుదల, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆయన సోమవారం రాత్రి టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు డెరైక్షన్‌లోనే రేవంత్ డబ్బు కట్టలు పట్టుకుని తిరిగారని, ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి బాబు అయితే, పాత్రధారి రేవంత్ అని హరీశ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ జీవితమే వెన్నుపోటు రాజకీయాల పుట్టుకని, బాబు అవినీతిని ప్రజలు మరిచిపోరన్నారు. మహానాడులో టీఆర్‌ఎస్ తమ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను డబ్బులకు కొనుగోలు చేసిందని ఆరోపించారని, మరి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, శ్రీనివాసనాయుడు, చైతన్య రాజు, జూపూడి ప్రభాకర్, ఎంపీలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీతలను ఎంత పెట్టి కొన్నారో చంద్రబాబు చెప్పాలని, వారిని ఎలా చేర్చుకున్నారో వివరించాలని డిమాండ్ చేశారు.